కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణ భారతదేశంలో బీజేపీ బలపడుతోందని చెప్పారు.

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా ఈ నెల 23న తెలంగాణలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం కర్ణాటక అసెబ్లీ ఎన్నికల పర్యటనలో ఉన్న అమిత్ షా అక్కడ ఓ న్యూస్ చానల్ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. దక్షిణ భారతదేశంలో బీజేపీ బలపడుతోందని చెప్పారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని.. తెలంగాణలో పూర్తి మెజారిటీతో అధికారం చేపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. డబుల్ ఇంజిన్ సర్కార్‌పై కర్ణాటక ప్రజల్లో విశ్వాసం ఉందన్నారు. 

ఇదిలా ఉంటే.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏప్రిల్ 23న తెలంగాణలో పర్యటించనున్నారు. చేవెళ్లలో జరిగే బీజేపీ బహిరంగ సభలో అమిత్ షా పాల్గొననున్నారు. పార్లమెంట్ ప్రభాస్ యోజన కార్యక్రమంలో భాగంగా చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో అమిత్ షా పర్యటన సాగనుంది. ఇక, అమిత్ షా తన తెలంగాణ పర్యటనలో ఆర్‌ఆర్‌ఆర్ చిత్ర బృందంలోని కొంతమంది ముఖ్య సభ్యులను కలిసే అవకాశం ఉంది. ఆస్కార్ అవార్డును గెలుచుకున్నందుకు ఆర్‌ఆర్ఆర్ చిత్ర బృందాన్ని అమిత్ షా సత్కరించాలని భావిస్తున్నారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. 

Also Read: karnataka Election 2023 : ఏషియానెట్ న్యూస్ డిజిటల్ సర్వే - హోరాహోరీలో బీజేపీకి ఎడ్జ్..!

అమిత్ షా తన పర్యటనలలో భాగంగా పలువరు ప్రముఖులను కలుస్తుంటారని.. అందులో భాగంగానే గత ఏడాది తన పర్యటనల సందర్భంగా నటులు జూనియర్ ఎన్టీఆర్, నితిన్‌లను ఆయన కలిశారని చెబుతున్నారు. మే 10న కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే.. తెలంగాణపై బీజేపీ మరింతగా దృష్టి సారిస్తుందని బీజేపీ వర్గాలు తెలిపాయి.