ముంబై: శివసేనకు బిజెపి మంచి గుణపాఠం చెప్పిందని కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే వ్యాఖ్యానించారు. కాంగ్రెసు, ఎన్సీపీలతో కలిసి కట్టే కూటమి నిలబడదని ఆయన శుక్రావరం సాయంత్రం శివసేనను హెచ్చరించారు. బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, బిజెపితో ఎన్సీపీ చేతులు కలుపుతుందని, కాంగ్రెసు శివసేన, ఎన్సీపీలతో కూటమి కట్టడం జాప్యం చేయడం వల్ల అది జరుగుతుందని ఆయన చెప్పారు. 

అథవాలే వ్యాఖ్యలు చేసిన కొద్ది గంటల్లోనే మహారాష్ట్ర రాజకీయాలు అనూహ్యమైన మలుపు తిరిగాయి. ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేశారు. బిజెపి, అమిత్ షా శివసేనకు గుణపాఠం చెప్పినట్లు ఆయన వ్యాఖ్యానించారు. అంతా సజావుగానే సాగుతుందని, ప్రతిదీ ఇప్పుడు మంచే అవుతుందని అథవాలే శనివారం అన్నారు. 

Also Read: ఎన్సీపీ ఆఫీస్ వద్ద హై డ్రామా: పార్టీ నుండి అజిత్ పవార్ సస్పెన్షన్

బిజెపి ప్రభుత్వం ఏర్పడుతుందని తాను అనుకున్నానని, అయితే ఇంత త్వరగా అది జరుగుతుందని అనుకోలేదని, కాంగ్రెసు అయిష్టంగా ఉందని ఎన్సీపీ గ్రహించడం వల్లనే ఇది జరిగి ఉంటుందని ఆయన అన్నారు. ఏది ఏమైనప్పటికీ మహారాష్ట్ర ప్రజలకు మంచే జరిగిందని, వారి కోసం ప్రభుత్వం ఏర్పడిందని ఆయన అన్నారు.

బిజెపి నేతృత్వంలోని జాతీయ ప్రజాతంత్ర కూటమి (ఎన్డీఎ)లో చేరాలని ఆయన శరద్ పవార్ కు సూచించారు.  అంతా సజావుగానే జరుగుతుందని, ఆందోళన చెందవద్దని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పిన విషయాన్ని శివసేనతో చెప్పానని ఆయన గుర్తు చేశారు.

Also Read: ఎమ్మెల్యేల సంతకాలను అలా చేశారు: అజిత్ పవార్ పై నవాబ్ మాలిక్ ఫైర్