ముంబై: తిరుగుబాటు నేత అజిత్ పవార్ మీద ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ తీవ్రంగా మండిపడ్డారు. ఎమ్మెల్యేల నుంచి సేకరించిన సంతకాలను దుర్వినియోగం చేశారని ఆయన ఆరోపించారు. హాజరు కోసం తాము ఎమ్మెల్యేల సంతకాలను తీసుకున్నామని, ఆ తర్వాత వాటిని దుర్వినియోగం చేశారని మాలిక్ శనివారం మీడియాతో అన్నారు. 

హాజరు కోసం తీసుకున్న ఎమ్మెల్యేల సంతకాలను ప్రమాణ స్వీకారం కోసం వాడుకున్నారని ఆయన చెప్పారు. శనివారం తెల్లవారు జామున బిజెపికి చెందిన దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా, అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.

Also Read: ఎన్సీపీ ఆఫీస్ వద్ద హై డ్రామా: పార్టీ నుండి అజిత్ పవార్ సస్పెన్షన్

బిజెపికి 105 మంది శాసనసభ్యులున్నారు. దాంతో బిజెపి 54 మంది శాసనసభ్యులు గల ఎన్సీపీ మద్దతు తీసుకుంది. బిజెపి మద్దతు ఇవ్వాలనే నిర్ణయం అజిత్ పవార్ వ్యక్తిగతమని శరద్ పవార్ అన్నారు. దానికితోడు, అజిత్ పవార్ ను శాసనసభా పక్ష నేతగా తొలగిస్తూ, ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఎన్సీపీ నిర్ణయం తీసుకుంది. 

అజిత్ పవార్ నిర్ణయాన్ని తాము బలపరచడం లేదని శరద్ పవార్ స్పష్టం చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్సీపీ, కాంగ్రెసు, శివసేన నేతలు చర్చలు జరుపుతున్న క్రమంలోనే అజిత్ పవార్ ఫిరాయించి బిజెపి వైపు వెళ్లిపోయారు. 

Also Read: పార్టీ, కుటుంబం చీలిపోయాయి: పవార్ కూతురు సుప్రియా

శివసేన 56 స్థానాలను, కాంగ్రెసు 44 స్థానాలను గెలుచుకున్నాయి. శివసేన మొండిపట్టు కారణంగా బిజెపి మహారాష్ట్రలో తొలుత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. ప్రభుత్వ ఏర్పాటులో జరుగుతున్న జాప్యం కారణంగా మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించారు. 

చివరకు శుక్రవారం అర్థరాత్రి మహారాష్ట్ర రాజకీయాలు అనూహ్యమైన మలుపు తీసుకున్నాయి. అప్పటికప్పుడు ఫడ్నవీస్, అజిత్ పవార్ లతో రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేయించి, రాష్ట్రపతి పాలనను ఎత్తేశారు.