ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే.. ఇంట్లో అంతా ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ఇల్లు క్లీన్ గా పెట్టుకోవడం చాలా అవసరం. అయితే ప్రస్తుత బిజీ లైఫ్ లో ఇది కాస్త కష్టమైన పనే. కానీ ఈజీగా, ఒత్తిడి లేకుండా ఇంటిని క్లీన్ గా ఉంచుకోవచ్చు. ఎలాగో ఇక్కడ చూద్దాం.
ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. శుభ్రంగా లేకపోతే.. ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. ఇల్లు సరిగ్గా శుభ్రం చేయకపోతే దుర్వాసన కూడా వస్తుంది. కానీ ఇల్లు క్లీన్ గా పెట్టుకోవడం అంత ఈజీ ఏం కాదు. ముఖ్యంగా వర్కింగ్ ఉమెన్స్ కి చాలా కష్టమైన టాస్క్. అయితే కొన్ని చిట్కాలతో ఈ పనిని ఈజీగా చేయవచ్చు. అదేలాగో ఇక్కడ చూద్దాం.
ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడానికి ఉపయోగపడే చిట్కాలు:
1. చెత్తను తొలగించండి:
ఇంటిని శుభ్రం చేసుకోవడానికి మొదటి అడుగు చెత్తను తొలగించడం. దీని కోసం మీ ఇంట్లో అవసరం లేని లేదా ఉపయోగించని వస్తువులను తీసివేయండి. ఇంట్లో చెత్తను పేరుకుపోనివ్వకండి. ఎప్పటికప్పుడు చెత్తను తొలగించండి. తద్వారా ఇంటిని శుభ్రంగా ఉంచుకోవచ్చు. వస్తువులను స్టోర్ చేయడానికి ఒక నిర్ధిష్ట స్థలాన్ని కేటాయించండి. ఇది మీ ఇంటిని శుభ్రంగా, అందంగా కనిపించేలా చేస్తుంది.
2. శుభ్రం చేసే అలవాటు:
ఇంటిని శుభ్రం చేయడానికి టైమింగ్స్ పెట్టుకోండి. వాటిని అనుసరించండి. ఈ అలవాటు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడంలో సహాయపడుతుంది. ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. ఇంటి పనులను రోజువారీ, వార, నెలవారీ పనులుగా విభజించి వాటిని పాటించండి. ఉదాహరణకు.. ఇంటిని శుభ్రం చేయడం, తుడవడం, బట్టలు ఉతకడం వంటి పనులను ఒక్కో రోజుకు కేటాయించండి. ఈ విధంగా పనులను చిన్న భాగాలుగా విభజించడం ద్వారా పనిభారం తగ్గుతుంది. సమయం కూడా ఆదా అవుతుంది.
3. స్మార్ట్ స్టోరేజ్ సొల్యూషన్:
సాధారణంగా చాలా మంది ఇళ్లలో వస్తువులు వాటి స్థానంలో ఉండవు. దానివల్ల ఇల్లు గజిబిజిగా కనిపిస్తుంది. అవసరమైన వస్తువు దొరకనప్పుడు చిరాకు, కోపం వస్తుంది. కొన్నిసార్లు ఇంట్లో గొడవలు కూడా జరుగుతాయి. ముఖ్యంగా ఇంటికి అతిథులు వచ్చినప్పుడు ఇబ్బందిగా అనిపిస్తుంది. కాబట్టి చిన్న చిన్న వస్తువులు పెట్టడానికి బుట్టలు, డబ్బాల వంటివి ఉపయోగించండి. వస్తువులను డివైడ్ చేయడం ద్వారా, మీకు అవసరమైనప్పుడు వాటిని సులభంగా తీసుకోవచ్చు. వస్తువులను ఉపయోగించిన తర్వాత తిరిగి వాటి స్థానంలో పెట్టడాన్ని అలవాటు చేసుకోండి. ఇలా చేయడం ద్వారా ఇల్లు అందంగా కనిపిస్తుంది.
4. మొత్తం కుటుంబాన్ని భాగస్వామ్యం చేయండి:
ఇంటిని శుభ్రం చేయడం అమ్మ పనే అనుకుంటారు చాలామంది. కానీ అది తప్పు. ఇంటిని శుభ్రం చేయడం అమ్మ బాధ్యత మాత్రమే కాదు. అది ప్రతి ఒక్కరిపై ఉంటుంది. ఒకే వ్యక్తి మొత్తం పని చేస్తే ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడానికి మొత్తం కుటుంబం కలిసి పనిచేయాలి. దీని కోసం కుటుంబ సభ్యుల వయసును బట్టి పనులను కేటాయించాలి. అందరూ కలిసి పని చేస్తే ఇల్లు శుభ్రంగా ఉంటుంది. ముఖ్యంగా అమ్మకు పనిభారం తగ్గుతుంది. కుటుంబ సభ్యుల మధ్య సహకార భావం పెరుగుతుంది.
