Packing Tips: ప్రయాణాలకు వెళ్తున్నప్పుడు సూట్‌కేస్ లేదా ట్రాలీ బ్యాగ్‌లో ఎక్కువ సామాను సర్దాలనుకుంటున్నారా? బట్టలను మడతపెట్టకుండా రోల్ చేయడం, ప్యాకింగ్ క్యూబ్స్ వాడటం, బూట్లలో చిన్న వస్తువులు పెట్టడం వంటి 5 స్మార్ట్ ప్యాకింగ్ చిట్కాలు మీ పనిని చాలా సులభం చేస్తాయి. మీ బ్యాగ్‌ను ఆర్గనైజ్డ్‌గా ఉంచుతాయి.

Trolley Bag Packing Hacks: ప్రయాణాలకు వెళ్లేటప్పుడు మనందరికీ ఎదురయ్యే పెద్ద సమస్య ఏంటంటే... తక్కువ చోటులో ఎక్కువ సామాను సర్దడం. కొన్నిసార్లు ట్రాలీ బ్యాగ్ పెద్దగా ఉన్నా కూడా, కాస్త సామాను పెట్టగానే నిండిపోతుంది. దీంతో అవసరమైన కొన్ని వస్తువులను వదిలేయాల్సి వస్తుంది. కానీ, సరైన ప్యాకింగ్ టెక్నిక్స్ పాటిస్తే, అదే బ్యాగ్‌లో ఇంకా ఎక్కువ దుస్తులు, ఇతర సామాన్లు సులభంగా సర్దేయొచ్చు. కొన్ని సింపుల్, స్మార్ట్ ప్యాకింగ్ చిట్కాలతో మీ సూట్‌కేస్‌ను చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ప్రయాణంలో వస్తువులను వెతుక్కోవడం కూడా ఈజీ అవుతుంది. మీ ట్రాలీ బ్యాగ్‌లో ఎక్కువ స్థలాన్ని సృష్టించే ఆ 5 ప్యాకింగ్ చిట్కాలేంటో ఇప్పుడు చూద్దాం.

దుస్తులను మడత పెట్టొద్దు, రోల్ చేసి పెట్టండి

ప్యాకింగ్‌లో ఇది చాలా సులభమైన, పాపులర్ టెక్నిక్. బట్టలను మడత పెట్టడానికి బదులుగా రోల్ చేసి పెట్టాలి. ఇలా చేయడం వల్ల అవి తక్కువ స్థలాన్ని తీసుకుంటాయి. దీంతో సూట్‌కేస్‌లో మరిన్ని బట్టలు పెట్టొచ్చు. అంతేకాదు, బట్టలను రోల్ చేయడం వల్ల వాటిపై ముడతలు కూడా తక్కువగా పడతాయి. బ్యాగ్‌లో అన్నీ ఒక పద్ధతిలో సర్దినట్టుగా ఉంటాయి.

ప్యాకింగ్ క్యూబ్స్ లేదా చిన్న పౌచ్‌లు వాడండి

బట్టలు, లోదుస్తులు, ఇతర యాక్సెసరీలను వేర్వేరు ప్యాకింగ్ క్యూబ్స్‌లో లేదా చిన్న పౌచ్‌లలో సర్దండి. దీనివల్ల బ్యాగ్‌లో వస్తువులన్నీ ఒకదానితో ఒకటి కలిసిపోకుండా ఉంటాయి. ఏదైనా వస్తువు అవసరమైనప్పుడు మొత్తం బ్యాగ్‌ను వెతకాల్సిన పని ఉండదు. ఈ పద్ధతి స్థలాన్ని ఆదా చేయడమే కాకుండా, సామానును ఆర్గనైజ్డ్‌గా ఉంచడంలో కూడా సహాయపడుతుంది.

బూట్ల లోపల చిన్న వస్తువులు పెట్టండి

ప్రయాణాల్లో బూట్లు కూడా చాలా స్థలాన్ని ఆక్రమిస్తాయి. మీరు బూట్ల లోపల సాక్సులు, బెల్టులు, ఛార్జర్లు లేదా ఇతర చిన్న యాక్సెసరీలను పెట్టొచ్చు. దీనివల్ల బ్యాగ్‌లో అదనపు స్థలం మిగులుతుంది. మీ వస్తువులు కూడా సురక్షితంగా ఉంటాయి.

బరువైనవి కింద, తేలికైనవి పైన పెట్టండి

సూట్‌కేస్ సర్దేటప్పుడు ఎప్పుడూ బరువైన బట్టలు లేదా బూట్లను అడుగున పెట్టాలి. తేలికగా ఉండే వస్తువులను పైన సర్దాలి. దీనివల్ల బ్యాగ్ బ్యాలెన్స్‌డ్‌గా ఉంటుంది. బట్టలు కూడా ఒక పద్ధతిలో ఉంటాయి.

టాయిలెట్రీ, లిక్విడ్ ఐటమ్స్‌ను వేరుగా ప్యాక్ చేయండి

షాంపూ, లోషన్ లేదా ఇతర లిక్విడ్ ఐటమ్స్‌ను ఒక జిప్-లాక్ బ్యాగ్‌లో వేరుగా పెట్టండి. ఒకవేళ బాటిల్ లీక్ అయినా, మీ బట్టలు పాడవకుండా ఉంటాయి. బ్యాగ్ కూడా శుభ్రంగా ఉంటుంది.