తల్లి కావాలని ప్రతి అమ్మాయి ఎంతగా ఎదురుచూస్తుందో.. తండ్రి హోదా పొందేందుకు అబ్బాయిలు కూడా అంతగానే ఎదురుచూస్తారు. నవమాసాలు మోసి కనేది తల్లే అయినా.. పుట్టిన తర్వాత ఆ బిడ్డ బరువు బాధ్యతలు మోసేది తండ్రే. ఇప్పటి వరకు మనం కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఎదగాలంటే.. తల్లి పౌష్టికాహారం తీసుకుంటే చాలని భావిస్తూ వస్తున్నాం. కానీ.. అంతకన్నా ముందు అబ్బాయిలు కూడా కొంత డైట్ ఫాలో అవ్వాలి.

బిడ్డ ఆరోగ్యంగా పుట్టాలనే ఏ తల్లిదండ్రులైనా కోరుకుంటారు. పుట్టిన బిడ్డ ఎలాంటి రోగాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఎదగడం తండ్రి చేతుల్లోనే ఉంటుంది అంటున్నారు నిపుణులు. ఎవరైతే పిల్లల కోసం ప్లానింగ్ లో ఉంటారో వారు కనీసం 3నెలల పాటు డైట్ ఫాలో అవ్వాలి అంటున్నారు నిపుణులు.

సిగరెట్లు, మద్యం, జంక్ ఫుడ్స్ కి ఈ మూడు నెలలు దూరంగా ఉండాలట. అంతేకాదు. రోజుకి గుప్పెడు నట్స్ ( డ్రై ఫ్రూట్స్) తీసుకోవడం చాలా ముఖ్యమట. రోజుకి 60గ్రాములకు తక్కువ కాకుండా 14వారాల పాటు ఈ నట్స్ తింటే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల పురుషుల వీర్యం క్వాలిటీ, క్వాంటిటీ పెరగుతుందట. దీంతో పుట్టబోయే బిడ్డ చాలా ఆరోగ్యంగా పుడుతుందంటున్నారు పరిశోధకులు.

దీనిపై సర్వే కూడా చేశారట. 18నుంచి 35ఏళ్లలోపు వయసుగల పురుషులకు 14వారాల పాటు నట్స్ ఇచ్చి.. సాధారణ డైట్ ఫాలో అయ్యేలా చూశారట. ఆ తర్వాత మార్పుని కూడా గమనించినట్లు పరిశోధకులు చెబుతున్నారు. ముఖ్యంగా వీర్యకణాల సంఖ్య 20శాతం పెరిగిందట.