హిమాచల్ ప్రదేశ్‌లోని జిభీ అనే గ్రామం ఇప్పుడు 'మినీ థాయ్‌లాండ్ ఆఫ్ ఇండియా'గా తెగ ఫేమస్ అవుతోంది. అసలు ఈ ఆఫ్-బీట్ హిల్ స్టేషన్ ఎక్కడుంది? దాని ప్రత్యేకత ఏంటి? ఎప్పుడు వెళ్లాలి? ఎలా చేరుకోవాలి? లాంటి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
ఈ వేసవి కాలంలో రద్దీకి దూరంగా, ప్రశాంతంగా, ప్రకృతి అందాల మధ్య సేదతీరాలనుకుంటున్నారా? అయితే హిమాచల్ ప్రదేశ్‌లోని జిభీ (Jibhi) మీకు పర్ఫెక్ట్ ఛాయిస్. బంజార్ వ్యాలీలో ఉన్న ఈ అందమైన పల్లెటూరు, అక్కడి క్రిస్టల్ క్లియర్ నీళ్లు, దట్టమైన దేవదారు అడవులు, చెక్క వంతెనల వల్ల మినీ థాయిలాండ్ ఆఫ్ ఇండియా(Mini Thailand of India)గా ఫేమస్ అవుతోంది. ఇక్కడికి వెళ్తే మీకు థాయ్‌లాండ్‌లో ఉన్నట్టే అనిపిస్తుంది.
మినీ థాయ్‌లాండ్ అని ఎందుకు అంటారు?

జిభీలో ప్రవహించే స్వచ్ఛమైన నది, దానిపై కట్టిన చిన్న చిన్న చెక్క వంతెనలు, చుట్టూ పచ్చదనం... ఇవన్నీ చూడ్డానికి అచ్చం థాయ్‌లాండ్‌లా ఉంటాయి. ముఖ్యంగా, రాళ్ల మధ్య నుంచి నీళ్లు ప్రవహించే చోట కట్టిన ఓ చెక్క వంతెన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అప్పటి నుంచి దీనికి మినీ థాయిలాండ్ అనే పేరు స్థిరపడిపోయింది.
జిభీలో తప్పక చూడాల్సిన ప్రదేశాలు
జిభీ అంటే కేవలం ఒక ఊరు మాత్రమే కాదు.. చుట్టుపక్కల ఎన్నో అందమైన ప్రదేశాలున్నాయి. ఇక్కడికి వెళ్లినప్పుడు జిభీ వాటర్‌ఫాల్, జలోరీ పాస్, సెరోల్సర్ సరస్సు, చారిత్రక చెహ్నీ కోఠి లాంటి ప్రదేశాలను అస్సలు మిస్ అవ్వొద్దు. కొన్ని చోట్ల ప్రశాంతత, మరికొన్ని చోట్ల అడ్వెంచర్... ఇలా ప్రతి ప్రదేశం మీకు ఓ కొత్త అనుభూతినిస్తుంది.
ట్రావెలర్స్‌కు పర్ఫెక్ట్ ఆఫ్-బీట్ డెస్టినేషన్

మనాలీ, సిమ్లా లాంటి రద్దీ ప్రదేశాలకు వెళ్లొద్దనుకుంటే, జిభీ మీకు బెస్ట్ ఆప్షన్. ఇక్కడ జనసందోహం తక్కువ, తక్కువ ధరకే హోమ్‌స్టేలు దొరుకుతాయి. స్థానిక హిమాచలీ వంటకాలు కూడా టేస్ట్ చేయవచ్చు. ముఖ్యంగా జంటలకు, సోలో ట్రావెలర్స్‌కు, ప్రకృతి ప్రేమికులకు ఈ ప్రదేశం ఓ స్వర్గంలాంటిది అని చెప్పాలి.
ఎలా వెళ్లాలి? ఎప్పుడు వెళ్లాలి?
జిభీ చేరుకోవడానికి దగ్గర్లోని రైల్వే స్టేషన్ చండీగఢ్. అక్కడి నుంచి ట్యాక్సీ లేదా బస్సులో బంజార్ వ్యాలీ మీదుగా జిభీకి చేరుకోవచ్చు. మార్చి నుంచి జూన్, అలాగే సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్య ఇక్కడికి వెళ్లొచ్చు. ఈ టైమ్‌లో అక్కడి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రకృతి అందాలు కనులవిందు చేస్తాయి.


