కలబంద అనేక జుట్టు సమస్యలకు పరిష్కారం చూపుతుంది. కలబందలో ఎన్నో సూక్ష్మ పోషకాలు ఉన్నాయి. ఆరోగ్యానికి, అందానికి ఎంతో మేలు చేస్తుంది కలబంద. కేరటిన్ అనే ప్రాథమిక ప్రోటీన్ జుట్టు పెరుగుదలకు దోహద పడుతున్నది. ఇందులో అమైనో యాసిడ్స్, ఆక్సిజన్, కార్బన్, చిన్న మొత్తంలో హైడ్రోజన్, నత్రజని, భాస్పరం నిల్వలు ఉన్నాయి. కేరటిన్ ప్రోటీన్ తన వద్ద అందుబాటులో ఉన్న పోషకాలతో జట్టులో చైతన్యం కలిగిస్తుంది. వెంట్రుకలు సాగే గుణాన్ని, పగుళ్లను కేరాటిన్ నివారిస్తుందని తెలుస్తోంది. 

వారానికి ఒకసారి గానీ, పక్షం రోజులకు ఒకసారి గానీ కలబంద గుజ్జును జుట్టుకు పట్టించాలి. అంతకుముందు కొబ్బరినూనె కలబంద గుజ్జును సమపాళ్లలో కలపాలి. దీనిని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు రాయాలి. తల అంతా పట్టించాక, షవర్‌ క్యాప్‌ పెట్టుకొని ఒక గంటపాటు వదిలేయాలి. తరువాత నీటితో కడగాలి. ఇది జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. తలపై తేమ లేకుండా చేస్తుంది. కలబంద గుజ్జులో ఉన్న ప్రోటియోలైటిక్‌ ఎంజైమ్స్‌ మాడుపై కణాలను బాగు చేస్తాయి. జుట్టు కుదుళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, జుట్టుపెరిగేలా చేస్తాయి. కలబంద గుజ్జును జుట్టుకి రాయటం వలన జుట్టు మృదువుగా మారుతుంది. రాలిపోవడాన్ని నిలువరిస్తుంది.

సహజంగా ఒత్తైన జుట్టు రావడానికి ఉపయోగపడుతుంది. తల మాడుకి మంట, వాపు నుంచి ఉపశమనం ఇస్తుంది. ఇందులో ఉన్న ఫంగల్‌ వ్యతిరేక గుణాలు చుండ్రును రాకుండా చేస్తాయి. పొట్టురాలడాన్ని నివారిస్తాయి. కలబందలో ఉండే ఎక్కువ ప్రొటీన్‌, విటమిన్లు, ఖనిజలవణాలు జుట్టు కుదుళ్లకు మంచి పోషణనిస్తాయి. కలబంద జుట్టును కండీషన్‌ చేసి, హైడ్రేషన్‌ స్థాయిలను నిలుపుతుంది. కెమికల్స్ డై వేయడానికి బదులు కలబంద గుజ్జు పట్టించడంతో ఎంతో మేలు జరుగుతుంది. శరీరానికి, జుట్టుకు మేలు చేసే కలబందను మీ ఇంటి కిచెన్ గార్డెన్స్‌లో గానీ, బాల్కానీలో గానీ పెంచవచ్చు. కలబంద మొక్క చిన్నగా ఉన్నా దాని ప్రయోజనాలు మాత్రం పుష్కలంగా ఉన్నాయి. కొంచెం సమయం వెచ్చిస్తే మీకు ఆరోగ్యం లభిస్తుంది.