Job Value: ఇప్పుడు జీతం కోసం పదేళ్లలోనే 10 కంపెనీలు మారే ఉద్యోగులు ఉన్నారు. కానీ పాత కాలంలో ఒక సంస్థలో చేరితే అందులోనే చివరివరకు కొనసాగేవారు. అలాగే ఆ కంపెనీలు కూడా ఉద్యోగులను ఎలా చూసుకునేవో ఈ నిజ జీవిత కథ చదివితే తెలుస్తుంది. ఇది విద్యా చంద్ర లింక్డిన్ లో షేర్ చేశారు.
మా నాన్న జీవితమంతా ఒకే కంపెనీలో పని చేశారు. అది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. ఆయన ఉద్యోగ జీవితం మొదలైంది ముగిసిపోయింది కూడా అదే కంపెనీలో. ఎంతో నిబద్ధతగా పనిచేశారు. కంపెనీ కూడా అంతే నిబద్ధతగా మమ్మల్ని చూసుకుంది. ఎన్నో సంవత్సరాల పాటు నిశ్శబ్దంగా ఆయన పని చేసుకుంటూనే గడిపారు. మధ్యలో బదిలీలు వచ్చాయి. నగరాలు మారాము. ప్రమోషన్లు కూడా వచ్చాయి. ఉద్యోగంలో చిన్న చిన్న సమస్యలు వచ్చాయి. అన్నింటినీ తట్టుకొని ఆ కంపెనీలోనే నిలబడ్డారు మా నాన్న. మాకు మా చిన్నప్పుడు ఆ విషయాలు ఏవి పెద్దగా తెలియదు. మాకు తెలిసింది ఒక్కటే ఆయన తన ఉద్యోగాన్ని ఎంతో నిజాయితీగా చేసేవారు. ఆ ఉద్యోగం వల్ల మా కుటుంబం సంతోషంగా సాగుతోంది. ప్రతినెలా జీతం సమయానికి వచ్చేది. ఆరోగ్య సదుపాయాలు కూడా కంపెనీ అందించేది. అలాగే ఆ కంపెనీ తరఫున అందమైన క్వార్టర్స్ కూడా వచ్చింది. మేముండే కాలనీలో ఎక్కువగా అదే కంపెనీలో పనిచేసే కుటుంబాలు ఉండేవారు. అందరం కలిసి పోయి జీవించే వాళ్ళం. ఒక నగరం నుంచి మరో నగరానికి ట్రాన్స్ఫర్ అయినప్పుడు కూడా కంపెనీ ఎన్నో విషయాల్లో సహాయంగా ఉండేది. ముఖ్యంగా మా స్కూల్ అడ్మిషన్ల విషయంలో మార్గం చూపించేది.
నాన్న చనిపోయాక కూడా...
ఒక సంస్థ తన ఉద్యోగి కుటుంబానికి ఇంతగా అండగా నిలబడడం చిన్నప్పుడు నాకు చాలా సాధారణ విషయంగా కనిపించేది. కానీ ఇప్పుడు ఆలోచిస్తే అది ఎంత పెద్ద సహాయమో అర్థం అవుతోంది. కానీ ఒకరోజు మా జీవితం పూర్తిగా మారిపోయింది. మా నాన్నకు అప్పటికి 51 ఏళ్లు. హఠాత్తుగా మమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు. మా కుటుంబానికి ఎంతో పెద్ద దెబ్బ అది. అప్పుడు ఏం చేయాలో కూడా మాకు ఏమీ అర్థం కాలేదు. అప్పుడే ఒక ఫోన్ కాల్ మా అమ్మకు వచ్చింది. అది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుంచి. మా అమ్మతో మీ భర్తకు వచ్చే జీతం మీకు కొనసాగుతుంది, మీ ఆరోగ్య ఖర్చులను కూడా మేమే చూసుకుంటాము అని చెప్పారు. ఆ మాటలు మా అమ్మకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయి. అంతేకాదు మరొక విషయం కూడా వారు మా అమ్మకు చెప్పారు. మీకు ఎప్పుడైనా ఉద్యోగం చేయాలనిపిస్తే మా సంస్థ ఉద్యోగం ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది.. మీరు గృహిణి అయినా పర్వాలేదు మీకు తగ్గ పని మేము ఇస్తాము.. ఎలాంటి ఒత్తిడి ఉండదు.. మీరు సిద్ధంగా ఉన్నప్పుడు చెప్పండి అని అన్నారు. నిజానికి ఆ మాటలు మా అమ్మకి ఎంతో బలాన్ని, ధైర్యాన్ని ఇచ్చాయి. మేము మా నాన్న మరణించే సమయానికి మంచి క్వార్టర్స్ లోనే ఉండేవాళ్ళం. ఆ ఏరియా కూడా ఎంతో బాగుండేది. సాధారణంగా ఉద్యోగంలో లేనివారు ఆ ఇల్లును వదిలిపెట్టాలి. కానీ మా పరిస్థితి చూశాక సంస్థ మీ పిల్లల చదువుకు ఆటంకం రాకూడదు.. మీరు అక్కడే మరి కొంతకాలం ఉండొచ్చని చెప్పారు. ఇది మా కుటుంబానికి ఎంతో పెద్ద సహాయంగా మారింది.
Also read: భర్తను అద్దెకిస్తానని ప్రియురాలికి ఆఫర్ ఇచ్చిన భార్య, నెలకు అద్దె ఎంతో తెలుసా?
మా అమ్మతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థ తరఫున మాట్లాడిన వారు చివరిలో ఒక మాట అన్నారు.. మీరు ఎప్పటికీ ఇండియన్ ఆయిల్ కుటుంబంలో భాగమే అని. ఆ మాటలు వింటే అది ఒక సంస్థ కాదు.. పెద్ద కుటుంబంలా అనిపించింది. ఈరోజుల్లో ఉద్యోగ ప్రపంచం ఎంతగానో మారిపోయింది. అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఒక కంపెనీ నుంచి మరొక కంపెనీకి సులభంగా మారిపోతున్నాము. ఎక్కడ కావాలంటే అక్కడ పని చేయడానికి వెళ్ళిపోతున్నాము.
మనం ఏం చేస్తున్నాం?
కొన్నిసార్లు ఏమైనా ఆలోచిస్తూ ఉంటాను. ఈ మార్పులు మధ్య మనం చాలా కోల్పోతున్నామేమోనని. ఒక కంపెనీ ఉద్యోగిని కేవలం ఉద్యోగిగా కాకుండా మనిషిగా చూసే భావన మనం మిస్ అయిపోతున్నాము. ఒక సంస్థకు జీవితాంతం పనిచేస్తే ఆ సంస్థ కూడా మన కుటుంబానికి అండగా నిలుస్తుందని మా నాన్న జీవితమే నాకు నేర్పింది. మా నాన్న తన జీవితాన్ని ఒకే కంపెనీకి అర్పించారు. ఆ కంపెనీ కూడా ఆయన లేనప్పుడు అతని కుటుంబానికి అండగా నిలిచింది. కానీ ఇప్పటి ప్రపంచాన్ని చూస్తూ ఉంటే నిజంగా మనం ఏం కోల్పోయామా అర్థమవుతోంది. ఉద్యోగాలు మారుతూ విలువైన దాన్ని కోల్పోయామా? మంచి వ్యవస్థను మనం నిర్మించామా? అనే సందేహాలు నాకు వస్తున్నాయి. ఈ ప్రశ్నకు ఎప్పటికీ సమాధానం దొరకదేమో.
- విద్యా చంద్ర, లింక్డిన్ మెంబర్
Also read: ఈ తేదీల్లో పుట్టిన వారికి రావణుడి లక్షణాలు ఎక్కువ, ప్రాణం పోతున్నా వెనక్కి తగ్గరు


