డెల్ టెక్నాలజీస్ ఎలాంటి పెద్ద ప్రకటన లేకుండానే FY2026లో 11,000 మంది ఉద్యోగులను తొలగించింది. ఇది మొత్తం వర్క్‌ఫోర్స్‌లో 10%కి సమానం. దీంతో ఉద్యోగుల సంఖ్య 1,08,000 నుంచి 97,000కి పడిపోయింది. ఈ తొలగింపుల కోసం కంపెనీ 569 మిలియన్ డాలర్లు ఖర్చు చేసింది.

DELL layoffs : ప్రముఖ టెక్ కంపెనీ డెల్ టెక్నాలజీస్ (Dell Technologies) ఎవరికీ పెద్దగా తెలియకుండా సైలెంట్‌గా ఓ పని కానిచ్చేసింది. 2026 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 11,000 మంది ఉద్యోగులను ఇంటికి పంపించేసింది. కంపెనీ తాజాగా ఫైల్ చేసిన 10-K రిపోర్ట్‌లో ఈ విషయం బయటపడింది. ఈ కోతలతో మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 10 శాతం మందిని తగ్గించినట్లు కంపెనీ చెప్పింది. 

జనవరి 2025 నాటికి 1,08,000గా ఉన్న ఉద్యోగుల సంఖ్య, 2026 జనవరి 31 నాటికి 97,000కి పడిపోయింది. ఈ లేఆఫ్స్ గురించి డెల్ బయటకు పెద్దగా ప్రకటించలేదు. కానీ ఉద్యోగులకు సెటిల్‌మెంట్ కోసం 569 మిలియన్ డాలర్లు ఖర్చు చేసినట్లు రిపోర్ట్‌లో పేర్కొంది. ఖర్చులను తగ్గించుకునే వ్యూహంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

ఖర్చుల నిర్వహణ, బిజినెస్ ఆధునికీకరణపై ఫోకస్

డెల్ తన కార్యకలాపాలను ఆధునికీకరించడం, ఖర్చులను కంట్రోల్ చేయడం, దీర్ఘకాలిక వ్యాపార లక్ష్యాలకు అనుగుణంగా వనరులను కేటాయించడం వంటి చర్యల్లో భాగంగానే ఈ ఉద్యోగాల కోతను చేపట్టినట్లు చెప్పింది. ముఖ్యంగాఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఎంటర్‌ప్రైజ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రంగాల్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నట్లు తెలిపింది.

ఖర్చులు తగ్గించుకోవడం తప్పనిసరి: కంపెనీ

“2026 ఆర్థిక సంవత్సరం మొత్తం మా వ్యాపార ఆధునికీకరణకు అనుగుణంగా ఖర్చులను క్రమశిక్షణతో నిర్వహించడానికి కట్టుబడి ఉన్నాం. ఉద్యోగుల పునర్‌వ్యవస్థీకరణ, కొత్త నియామకాలను నిలిపివేయడం, వ్యూహాత్మక, కస్టమర్ ప్రాధాన్యానికి అనుగుణంగా పెట్టుబడులను మళ్లించడం వంటి అనేక చర్యలు తీసుకున్నాం” అని డెల్ తన ఫైలింగ్‌లో పేర్కొంది. వేగంగా మారుతున్న టెక్ మార్కెట్‌లో పోటీలో నిలబడాలంటే ఇలాంటి చర్యలు తప్పవని కూడా కంపెనీ స్పష్టం చేసింది.

మూడేళ్లలో 27% మంది ఉద్యోగులు ఔట్

డెల్‌లో ఉద్యోగుల సంఖ్య తగ్గడం ఇదే మొదటిసారి కాదు. గత కొన్నేళ్లుగా ఇదే ట్రెండ్ కొనసాగుతోంది.

  • 2023లో సుమారు 1,33,000 మంది ఉద్యోగులు
  • 2024లో సుమారు 1,20,000 మంది ఉద్యోగులు
  • 2025లో సుమారు 1,08,000 మంది ఉద్యోగులు
  • 2026 నాటికి సుమారు 97,000 మంది ఉద్యోగులు

అంటే, గత మూడేళ్లలో కంపెనీ వర్క్‌ఫోర్స్‌లో దాదాపు 27 శాతం తగ్గుదల కనిపించింది. దీనివల్ల 36,000 మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయారు.

టెక్ పరిశ్రమలో పెరుగుతున్న లేఆఫ్స్ ట్రెండ్

టెక్ పరిశ్రమ మొత్తం ఖర్చులను తగ్గించుకుని, AIపై పెట్టుబడులు పెంచే పనిలో ఉంది. ఈ క్రమంలోనే డెల్ కూడా ఉద్యోగాల కోత విధించింది. Layoffs.fyi డేటా ప్రకారం, 2026లో ఇప్పటివరకు దాదాపు 66 టెక్ కంపెనీలు 39,000కు పైగా ఉద్యోగాలను తొలగించాయి.

Meta, Atlassian, Block కూడా ఇదే దారిలో..

రిపోర్టుల ప్రకారం, Meta కూడా లేఆఫ్స్‌కు ప్లాన్ చేస్తోంది. దీనివల్ల చాలా మంది ఉద్యోగులు ప్రభావితం కావచ్చు. మరోవైపు, Atlassian కంపెనీ AI ఆధారిత రోల్స్‌ వైపు మారేందుకు దాదాపు 1600 ఉద్యోగాలను (మొత్తం సిబ్బందిలో 10%) తొలగించాలని యోచిస్తోంది. ఇక Block కంపెనీ కూడా AI సామర్థ్యంపై దృష్టి పెట్టి, తన ఉద్యోగుల్లో దాదాపు 40% మందిని, అంటే సుమారు 4000 మందిని తొలగిస్తోంది.