Omicron: మళ్లీ మహమ్మారి విజృంభణ.. ఒక్కవారంలోనే 50 లక్షలకు పైగా కొత్త కేసులు
Omicron: దక్షిణాఫ్రికాలో గత నెలలో వెలుగుచూసిన కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అత్యంత వేగంగా వ్యాపిస్తున్నది. ప్రస్తుతం చాలా దేశాలకు విస్తరించిన ఈ వేరియంట్ పంజా విసురుతుండటంతో రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఒక్క వారంలోనే 50 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదుకావడం వైరస్ ఉధృతికి అద్దం పడుతోంది.
Omicron: కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పంజా విసురుతోంది. గత నెలలో వెలుగుచూసిన ఈ వేరియంట్ ఇప్పటికే 100కు పైగా దేశాలకు విస్తరించింది. పలు దేశాల్లో అందోళనకర స్థాయిలో విజృంభిస్తోంది. దక్షిణాఫ్రికా, బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్ వంటి దేశాల్లో ఒమిక్రాన్ పంజా ఉధృతి కారణంగా నిత్యం లక్షల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. వీటితో పాటు మరికొన్ని దేశాల్లో ఇదివరకు లేని విధంగా గరిష్టం సంఖ్యలో రోజువారీ కొత్త కేసులు నమోదవుతున్నాయి. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విస్తరిస్తున్న వేళ పలుదేశాల్లో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. కేవలం ఒక్క వారంలోనే 50 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదుకావడం ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తికి అద్దం పడుతోంది. డిసెంబర్ 20 నుంచి 26 మధ్య ప్రపంచ వ్యాప్తంగా 50 లక్షల కొత్త కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) పేర్కొంది. ఇదే సమయంలో కరోనాతో పోరాడుతూ 44,000 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారిక గణాంకాలు పేర్కొంటున్నాయి.
Also Read: Chennai Rains: చెన్నైని ముంచెత్తిన భారీ వర్షం.. రోడ్లన్నీ జలమయం
అమెరికాలో ప్రస్తుతం కోవిడ్-19 కొత్త కేసులు అధికంగా నమోదవుతున్నాయి. నిత్యం లక్షల్లో కొత్త కేసులు నమోదుకావడం, అందులోనూ ఒమిక్రాన్ వేరియంట్ కేసులు అధికంగానే ఉంటుండటం ఆందోళన కలిగిస్తన్నది. రెండు డోసులతో పాటు బూస్టర్ డోసు తీసుకున్నవారు సైతం ప్రస్తుతం కరోనా బారినపడుతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. గత వారం యూఎస్ లో దాదాపు 15 లక్షల మంది కొత్తగా కరోనా మహమ్మారి బారినపడ్డారు. యూరప్ దేశాల్లోనూ కొత్త కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గత వారం నమోదైన 50 లక్షలకు పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల్లో దాదాపు 28 లక్షల కేసులు యూరప్ దేశాల్లోనే నమోదయ్యాయి. దీంతో మరోసారి యూరప్ కరోనా హాట్ స్పాట్ గా మారింది. ఇక్కడ పాజిటివిటి రేటు అధికంగా ఉంది. గత వారంతో పోల్చితే 3 శాతం పెరిగింది. ఇక పాజిటివ్ కేసులు ప్రతి లక్షమందిలో 304.6గా నమోదవుతున్నాయి. గత వారం ఆఫ్రికా దేశాల్లో 2 లక్షల 75 వేల కరోనా కేసులు నమోదు కాగా.. 7 శాతం కొత్త కేసులు పెరిగినట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి.
Also Read: De Kock: టెస్ట్ క్రికెట్ కు క్వింటన్ డికాక్ గుడ్‌బై.. జీవితంలో టైంను కొనలేమంటూ..
డెల్టా వేరియంట్ కేసులు సైతం క్రమంగా పెరుగుతున్నాయి. ఒకవైపు డెల్టా వేరియంట్.. మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్ పంజా విసురుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. కరోనా వైరస్ వివరాలు వెల్లడిస్తున్న వరల్డో మీటర్ కరోనా డాష్ బోర్డు వివరాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 285,836,199 మంది కరోనా మహమ్మారి బారినపడ్డారు. వైరస్ సోకినవారిలో 5,443,503 మంది ప్రాణాలు కోల్పోయారు. 252,940,604 మంది కరోనా నుంచి బయటపడ్డారు. నిత్యం 10 లక్షలకు పైగా కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయి. కరోనా కేసులు, మరణాలు అధికంగ నమోదవుతున్న దేశాల జాబితాలో అమెరికా మొదటి స్థానంలో ఉంది. భారత్, బ్రెజిల్, యూకే, రష్యా, ఫ్రాన్స్, టర్కీ, జర్మనీ, స్పెయిన్, ఇరాన్ దేశాలు ఆ తర్వాతి స్థానంలో ఉన్నాయి. ప్రస్తుతం అమెరికా, బ్రిటన్, స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్ లలో కొత్త కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ కట్టడి కోసం ఆయా దేశాల ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి.
Also Read: Apple: టెక్ దిగ్గజం ఆపిల్ తమిళనాడు ప్లాంట్.. షాకింగ్ విషయాలు వెలుగులోకి..