విమానంలో ప్రయాణిస్తుండగా మార్గంమధ్యలో ఓ మహిళకు గొంతులో నొప్పి రావడంతో అనుమానంతో కరోనా టెస్టు చేసుకున్నది. ఆ టెస్టులో ఆమెకు కరోనా పాజిటివ్ అని వచ్చింది. అప్పటికే ఆమె చేసుకున్న ఐదు టెస్టుల్లో నెగెటివ్ వచ్చి.. విమానంలో ప్రయాణిస్తుండగా పాజిటివ్ రావడం ఆమెను గందరగోళ పరిచింది. వెంటనే ఫ్లైట్ అటెండాంట‌్‌కు విషయం చెప్పింది. కానీ, ఆ ఫ్లైట్‌లో ఫుల్‌గా ప్రయాణికులు ఉన్నారు. దీంతో ఆమె స్వయంగా టాయిలెట్‌లోనే మూడు గంటలపాటు ఐసొలేషన్‌లో ఉన్నది. 

న్యూఢిల్లీ: ఒమిక్రాన్(Omicron Variant) భయాలు అన్ని దేశాల్లో నెలకొన్నాయి. కరోనా పాజిటివ్ రిపోర్ట్(Positive Report) రాగానే వెంటనే ఐసొలేషన్‌(Isolation)లోకి పంపిస్తున్నారు. విదేశాల నుంచి వస్తున్న వారికి ఎయిర్‌పోర్టులోనే టెస్టులు చేస్తున్నారు. పాజిటివ్ వస్తే వెంటనే నిర్దేశిత కేంద్రాలకు పంపి ఐసొలేషన్ చేస్తున్నారు. ఒకవేళ విమాన ప్రయాణం చేస్తుండగా ఎవరికైనా కరోనా పాజిటివ్ అని రిపోర్టు వస్తే ఏం చేయాలి? అయినా, విమానంలో ఎవరు టెస్టు చేసుకుంటారు? అనే అనుమానం రావచ్చు. కానీ, అమెరికాకు చెందిన ఓ మహిళ విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు తనకు గొంతులో గరగరగా అనిపించడంతో అనుమానంతో టాయిలెట్‌కు వెళ్లి ర్యాపిడ్ టెస్టు చేసుకున్నారు. అందులో తనకు కరోనా సోకినట్టుగా రిపోర్ట్ వచ్చింది. విమానం నిండా ప్రయాణికులే. ఒక్క సీటు కూడా ఖాళీగా లేదు. పాజిటివ్ వచ్చిన ఆ మహిళ ఎక్కడ కూర్చోవాలో అర్థం కాక సతమతం అయింది. ఫ్లైట్ అటెండాంట్ సహకారంతో ప్రయాణికులకు దూరంగా ఒంటరిగా ఉండే సీటు కోసం వెతికింది. కానీ, సాధ్యపడకపోవడంతో టాయిలెట్‌(Toilet)నే ఐసొలేషన్ సెంటర్‌గా ఎంచుకుంది. ఫ్లైట్(Flight) ల్యాండ్ అయ్యే వరకు ఆ టాయిలెట్‌లోనే ఆమె తనను తాను ఐసొలేట్ చేసుకుంది. డిసెంబర్ 19న ఈ ఘటన చోటుచేసుకుంది.

మిచిగాన్‌కు చెందిన టీచర్ మారిసా ఫోటియో ఐస్‌లాండ్‌కు బయల్దేరింది. ఆమె కుటుంబంతో పాటు అక్కడికి విమానంలో వెళ్లడానికి సిద్ధమయ్యారు. కలిసి డిన్నర్ చేశారు. విమానం ఎక్కడానికి ముందే ఆమె రెండు పీసీఆర్ టెస్టులు, ఐదు ర్యాపిడ్ టెస్టులు చేయించుకుంది. అన్నింటిలోనూ ఆమెకు కరోనా నెగెటివ్ అనే ఫలితం వచ్చింది. దీంతో నిర్భయంగా ఆమె కుటుంబంతో కలిసి విమానం ఎక్కింది. కానీ, విమానం ఎక్కిన గంటన్నర తర్వాత ఆమె గొంతులో నొప్పి వచ్చింది. దీంతో ఆమెకు కరోనా అనుమానాలు వచ్చాయి. కానీ, ఆపాటికే కనీసం ఐదు సార్లు టెస్టు చేసుకుని ఉండటంతో కొంత తమాయించుకుంది. అయినా, అనుమానం వేధించింది. దీంతో ర్యాపిడ్ టెస్టు చేసుకుంటే మనసు కుదుటపడుతుందని భావించింది. వెంటనే ఫ్లైట్‌లోని టాయిలెట్‌కు వెళ్లి ర్యాపిడ్ టెస్టు చేసుకుంది. ఇందులో ఆమెకు పాజిటివ్ అని వచ్చింది. అంతే.. ఆమె ఖంగుతిన్నది.

Also Read: Omicron: రికార్డు స్థాయిలో హాస్పిటల్స్‌లో చేరుతున్న పిల్లలు.. యూఎస్‌లో 24 గంటల్లో 5.8 లక్షల కేసులు

తన కుటుంబంతో కలిసి చేసిన డిన్నర్... తనతోటి ప్రయాణం చేస్తున్న తోటి ప్రయాణికులు.. ఇలా తనతో కలిసిన వారు ఒక్కొక్కరుగా గుర్తుకు వచ్చారు. ఆమెలో టెన్షన్ పెరిగింది. దాదాపు ఆమెలో ఏడుపు మొదలైంది. టాయిలెట్ డోర్ తీసి ఎదురుగా కనిపించిన ఫ్లైట్ అటెండాంట్ దగ్గరకు పరుగున వెళ్లింది. తనకు పాజిటివ్ వచ్చిన సంగతి చెప్పింది. ఫ్లైట్ అటెండాంట్ ఆమెను ఓదారుస్తూ అందరికీ దూరంగా ఉండే ఓ సీటును వెతుకుదాం అని చెప్పారు. కానీ, ఆ ఫ్లైట్‌లో ప్రయాణికులు ఫుల్‌గా ఉన్నారు. ఏం చేయాలా? అని ఆలోచించారు. చివరకు మారిసా ఫోటియోనే ఓ నిర్ణయానికి వచ్చారు.

Also Read: Omicron Cases In India: భారత్‌లో 1,270కి చేరిన ఒమిక్రాన్‌ కేసులు.. ఒక్కరోజే 16వేలకు పైగా కరోనా కేసులు..

ఇతరులకు దూరంగా.. తన ద్వారా కరోనా వేరేవారికి సోకవద్దని ఆమె భావించింది. అందుకే ఆమె తాను టాయ్‌లెట్‌లో ఐసొలేట్ చేసుకోవాలని భావించింది. ఫ్లైట్ ల్యాండ్ అయ్యే వరకు అంటే మూడు గంటలు ఆమె టాయిలెట్‌లోనే ఐసొలేషన్‌లో ఉన్నది. ఫ్లైట్ ల్యాండ్ అయ్యాక.. అందరి కన్నా చివరిగా మారిసా కుటుంబమే విమానం నుంచి దిగింది.

కానీ, మారిసా సోదరుడ, తండ్రికి ఎలాంటి లక్షణాలు లేకపోవడంతో వారిని స్విట్జర్లాండ్‌కు కనెక్టింగ్ ఫ్లైట్ ఎక్కడానికి అధికారులు అనుమతించారు. కాగా, మారిసా మాత్రం ఐస్‌లాండ్‌లోనే పది రోజులు క్వారంటైన్‌లో ఉండటానికి ఉపక్రమించారు.