అమెరికాలో ఒమిక్రాన్ కేసులు భారీగా నమోదయ్యాయి. ఒక్క రోజులో 5.8 లక్షల కేసులు రిపోర్ట్ అయ్యాయి. ఒక్క రోజులో ఇంత స్థాయిలో కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి. కేసులు భారీగా నమోదు కావడంతో పాటు హాస్పిటల్ చేరుతున్న పిల్లల సంఖ్య కూడా భారీగా పెరుగుతుండటం ఆందోళనకరం. గత వారంతో పోల్చితే డిసెంబర్ 22 నుంచి 28వ తేదీల మధ్య పిల్లలు హాస్పిటల్స్‌లో చేరడం 66 శాతం పెరిగింది. 

న్యూఢిల్లీ: అమెరికాలో ఒమిక్రాన్ వేరియంట్(Omicron Variant) విలయం సృష్టిస్తున్నది. ఊహకు అందని స్థాయిలో దావానలంలా వ్యాపిస్తూ ప్రజల ప్రాణాలకు సవాల్ విసురుతున్నది. తొలిసారిగా ఒక్క రోజు కేసులు అమెరికా(America)లో ఐదు లక్షల మార్క్ దాటాయి. సింగిల్ డేలో అమెరికాలో 5.8 లక్షల కేసు(Corona Cases)లు నమోదై ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ ప్రకంపనలు వ్యాపించింది. కేసులు భారీగా నమోదవ్వడమే కాదు.. మరో సవాల్‌ను కూడా ముందుకు తెచ్చింది. ఒమిక్రాన్ విజృంభణతో రికార్డు స్థాయిలో చిన్న పిల్లలు హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు. ఇంతకు ముందు ఎప్పుడూ లేని సంఖ్యలో పిల్లలు ఆస్పత్రుల్లో చేరారు. దీనికి తోడు నిపుణులూ ఇంకా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వచ్చే వారాల్లో కేసులు అమాంతంగా అమెరికాను కమ్మేస్తాయని వార్నింగ్ ఇస్తున్నారు. అందుకు ఇప్పుడే ముందుగా జాగ్రత్తలు వహించాలని సూచిస్తున్నారు.

వారంలో 66 శాతం పెరిగిన పిల్లల అడ్మిషన్లు
కరోనా కేసులు భారీగా నమోదవ్వడం గుండెను బాధిస్తున్నదని ఫిలడెల్ఫియాలోని ఓ పిల్లల హాస్పిటల్ వైద్యుడు డాక్టర్ పాల్ ఆఫిట్ అన్నారు. గతేడాది ఘటనలే ఇంకా మరిచిపోలేమని తెలిపారు. కానీ, వచ్చే ముప్పును సాధ్యమైనంత మేరకు తప్పించే అవకాశాలూ లేకపోలేవని వివరించారు. అమెరికాలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న తరుణంలో పిల్లలు(Children) హాస్పిటల్‌లలో చేరుతున్నవారి(Hospitalisation) సంఖ్య కూడా పెరుగుతున్నది. గత వారంతో పోల్చితే హాస్పిటల్‌లలో పిల్లల అడ్మిషన్లు 66 శాతం పెరిగాయి. ఈ నెల 22 నుంచి 28వ తేదీ వరకు సగటున 378 మంది పిల్లలు (17 ఏళ్ల లోపు) ప్రతి రోజూ హాస్పిటల్స్‌లో చేరారు. ఇది గత వారంతో పోల్చితే 66 శాతం పెరిగిందని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ గురువారం వెల్లడించింది. 

Also Read: Omicron Cases In India: భారత్‌లో 1,270కి చేరిన ఒమిక్రాన్‌ కేసులు.. ఒక్కరోజే 16వేలకు పైగా కరోనా కేసులు..

అయితే, కరోనాతో హాస్పిటళ్లలో చేరుతున్న అన్ని వయస్కుల వారితో పోల్చితే పిల్లల శాతం చాలా తక్కువే ఉన్నదని తెలుస్తున్నది. ఈ నెల 22 నుంచి 28వ తేదీ వరకు సగటున అమెరికాలో హాస్పిటళ్లలో చేరుతున్న వారి సంఖ్య రోజుకు 10,200 ఉన్నది. అంతేకాదు, మరో ఉపశమనమిచ్చే వార్త కూడా అక్కడి వైద్యులు చెప్పారు. గత ఏడాది వేసవిలో డెల్టా కారణంగా కేసులు భారీగా పెరిగినప్పుడు కొందరు పిల్లలు హాస్పిటల్స్‌లో చేరారని వైద్యులు గుర్తు చేశారు. అప్పటి కంటే ఇప్పుడు హాస్పిటల్ చేరుతున్న పిల్లలో వ్యాధి తీవ్రత తక్కువే ఉన్నదని వివరించారు.

Also Read: విమానంలో ప్రయాణిస్తుండగా కరోనా పాజిటివ్.. టాయిలెట్‌లోనే ఐసొలేషన్.. అసలేం జరిగిందంటే..?

ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా అమెరికాలో కేసులు విస్ఫోటనంలా పెరుగుతుండటంతో మరిన్ని ఆంక్షలకు ప్రజలు సిద్ధం కావాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ కేసులు హాస్పిటళ్ల సామర్థ్యాలకే సవాల్ విసిరే ముప్పు ఉన్నదని తెలిపారు. పిల్లలోనూ కేసులు పెరగడం, హాస్పిటలైజేషన్ పెరగడం ఆందోళనకరంగా ఉన్నదని అన్నారు. ఈ నేపథ్యంలోనే పిల్లలకూ బూస్టర్ షాట్ ఇచ్చే ఆవశ్యకతపై యోచిస్తున్నట్టు తెలుస్తున్నది. ఫెడరల్ అధికారులు మరిన్ని ట్రావెల్ వార్నింగ్‌లు జారీ చేశారు. 12 నుంచి 15 ఏళ్ల వయసు పిల్లలకు వచ్చే వారంలో బూస్టర్ షాట్‌కు అనుమతులకూ కసరత్తులు జరుగుతున్నాయి.