అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి నామినేషన్ రావడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. ఈ నేప‌థ్యంలో నోబెల్ బ‌హుమతికి సంబంధించిన ఆస‌క్తిక‌ర వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

DID YOU
KNOW
?
మొదటి నోబెల్ విజేత ఎవరంటే
మొదటి నోబెల్ బహుమతిని 1901లో జర్మన్ శాస్త్రవేత్త విల్హెల్మ్ రాంట్జెన్, ఎక్స్-రేలు కనుగొన్నందుకు పొందారు. అప్పటినుంచి వైద్య రంగంలో విప్లవం వచ్చింది.

ట్రంప్ నామినేషన్ ఎందుకు సంచలనం సృష్టిస్తోంది?

 

పాకిస్థాన్, ఇజ్రాయెల్ దేశాలు డొనాల్డ్ ట్రంప్‌ను 2026 నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేశాయి. దీంతో సోషల్ మీడియాలో ట్రోల్స్, డిబేట్స్‌ వెల్లువెత్తాయి. “ప్రపంచానికి ఆయ‌న‌ శాంతిని తెచ్చిందేంటి?” అనే ప్రశ్న చాలామంది అడుగుతున్నారు. ఉగ్ర‌వాదుల‌ను పెంచి పోషించే పాకిస్తాన్ లాంటి దేశం ట్రంప్‌ను శాంతి బ‌హుమ‌తికి నామినేట్ చేయ‌డం మ‌రీ విడ్డూరంగా ఉందంటూ కొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అయితే నిజానికి నోబెల్ శాంతి బహుమతి ప్రారంభం నుంచి వివాదాల మధ్యే ఉంది.

నోబెల్ బహుమతి ఎలా మొదలైంది.?

నోబెల్ బహుమతుల స్థాపకుడు ఆల్ఫ్రెడ్ నోబెల్ (Alfred Nobel) ఒక స్వీడన్ దేశానికి చెందిన శాస్త్రవేత్త, రసాయన శాస్త్రజ్ఞుడు, పారిశ్రామిక‌వేత్త‌. ఆయన డైనమైట్‌ను కనిపెట్టిన శాస్త్రవేత్త. 1888లో ఆయన సోదరుడు లుడ్‌విగ్ నోబెల్ మరణించగా, ఒక ఫ్రెంచ్ పత్రిక పొరపాటుగా "డెత్ ఆఫ్ ది మర్చంట్ ఆఫ్ డెత్" అనే శీర్షికతో ఆల్ఫ్రెడ్ నోబెల్ మృతి చెందినట్టు ప్రచురించింది. అంటే "మరణం అమ్ముకునే వ్యక్తి చనిపోయాడు" అని.

ఈ వార్తపై చింతించిన ఆల్ఫ్రెడ్ నోబెల్ చింతించడంతో, తన సంపదను మానవాభివృద్ధికి ఉపయోగపడేలా చేసే నిర్ణయం తీసుకున్నారు. 1895లో ఆల్ఫ్రెడ్ నోబెల్ తన విల్లు రాశారు. అందులో పేర్కొన్న వివ‌రాల‌ ప్రకారం, ఆయన సంపదలో పెద్ద భాగాన్ని నోబెల్ ఫౌండేషన్‌కు విరాళంగా ఇచ్చి, ప్రతి సంవత్సరం ప్రపంచానికి మేలు చేసిన వ్యక్తులకు బహుమతులు ఇవ్వాలని పేర్కొన్నారు. అలా నోబెల్ బ‌హుమ‌తి మొద‌లైంది.

నోబెల్ కమిటీపై ఆరోపణలు

నోబెల్ శాంతి బహుమతిని ఐదుగురు నార్వే రాజకీయ నాయకులు ఎన్నుకుంటారు. దీనిపై పలు దేశాలు ఇది యూరోపియన్ల ఆలోచనలకే పరిమితమైందని విమర్శిస్తుంటాయి. అహింస‌తో భార‌త‌దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మ‌హాత్మ గాంధీని ఐదుసార్లు నామినేట్ చేసినా బహుమతి ఇవ్వలేదు. కానీ హిట్లర్, స్టాలిన్ వంటి నియంతలకు మాత్రం ఒకసారి అయినా నామినేషన్ వచ్చింది. ఇదే నోబెల్ కమిటీ పనితీరుపై అనేక ప్రశ్నలు తీసుకొస్తోంది.

అమెరికా అధ్యక్షులకు ఇచ్చిన నోబెల్ బహుమతులపై విమర్శలు

ఇప్పటి వరకు ముగ్గురు అమెరికా అధ్యక్షులు నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు. వీరిలో థియోడోర్ రూసవెల్ట్, వుడ్‌రో విల్సన్, బరాక్ ఒబామా ఎంపికయ్యారు. ముఖ్యంగా ఒబామాకు 2009లో, అధ్యక్ష పదవీ బాధ్యతలు తీసుకున్న కొద్ది నెలల్లోనే బహుమతి రావ‌డం వివాదాస్ప‌దంగా మారింది.

అంతే కాదు, హెన్రీ కిసింజర్ వియత్నాంలో బాంబుల వర్షం కురిపించినప్పటికీ శాంతి చర్చల కోసం బహుమతి అందుకున్నారు. దాంతో ఇద్దరు నోబెల్ కమిటీ సభ్యులు రాజీనామా చేశారు.

ట్రంప్‌ను నోబెల్ బహుమతి వ‌రిస్తుందా.?

ట్రంప్ ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జాంగ్ ఉన్‌తో చర్చలు జరిపినప్పటికీ, ఆయా ఒప్పందాలు పూర్తిగా అమలవ్వలేదు. అయినా నామినేషన్ రావడంతో నోబెల్ వ‌రించ‌డ‌మం క‌ష్ట‌మ‌ని చాలా మంది భావిస్తున్నారు.

ఒబామా, కిసింజర్ వంటి నాయకులకు వచ్చిందంటే, ట్రంప్ ఎందుకు రాద‌న్న ప్ర‌శ్న‌లు కూడా వినిపిస్తున్నాయి. ఇంత‌కీ ట్రంప్‌ను నోబెల్ వ‌రిస్తుందో లేదో చూడాలి.