తాను దొంగతనానికి పాల్పడలేదని, భారత్‌కు తిరిగి రావాలన్న ఉద్దేశం ఉందని విజయ్ మాల్యా తాజా వ్యాఖ్యలు చేశారు.

ప్రముఖ పారిశ్రామికవేత్త విజయ్ మాల్యా తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోసారి సంచలనం సృష్టిస్తున్నాయి. గతంలో బ్యాంకుల నుంచి రూ.9 కోట్లు పైగా రుణాలు తీసుకుని వాటిని తిరిగి చెల్లించకపోవడంతో ఆయనపై మనీలాండరింగ్‌, లోన్ ఎగవేత ఆరోపణలు వచ్చాయి. అప్పటి నుంచి లండన్‌లో ఉంటున్న మాల్యా, ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని కీలక విషయాలు వెల్లడించారు.

దొంగతనానికి పాల్పడలేదని..

తాను భారత్‌ నుంచి ముందస్తు ప్రణాళికతోనే వెళ్లానని, కానీ దొంగతనానికి పాల్పడినట్టుగా తనను చూస్తే ఆ తప్పు అవుతుందన్నారు. భారత్‌ను వదిలి వెళ్లినంత మాత్రాన తాను తప్పుచేసినట్టు కాదు అన్నారు. తాను ఎక్కడా దొంగతనానికి పాల్పడలేదని స్పష్టం చేశారు. దేశానికి తిరిగి రావాలన్న ఆలోచన తనలో ఉందని, కానీ భారత న్యాయ వ్యవస్థ తనకు న్యాయం చేస్తుందన్న నమ్మకం లేకపోవడం వల్లే ఇప్పటి వరకూ రాలేకపోయానన్నారు.

ఉద్యోగులను తొలగించొద్దని…

కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్ ఆర్థికంగా కుదేలవుతున్న సమయంలో, అప్పటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీకి రీ-స్ట్రక్చరింగ్ ప్లాన్‌ను వివరించానని తెలిపారు. ఆ సమయంలో ఉద్యోగులను తొలగించాలని అనుకున్నా, ప్రభుత్వ సపోర్ట్ ఉంటుందని, ఉద్యోగులను తొలగించొద్దని ప్రణబ్ సూచించారని తెలిపారు. అయితే పరిస్థితులు మరింత దిగజారటంతో దేశం విడిచి వెళ్లాల్సి వచ్చిందని చెప్పారు.

బ్రిటన్‌లో ఆశ్రయం…

ఇకపోతే, మాల్యా ఇప్పటికే బ్రిటన్‌లో ఆశ్రయం పొందారు. ఆయనను భారత్‌కు తీసుకురావడానికి కేంద్రం అనేక ప్రయత్నాలు చేస్తున్నా వాటికి ఇప్పటివరకు ఫలితం లేకపోయింది. ఇటీవలి కాలంలో బ్యాంకులు వసూలు చేసిన రేట్లకు సంబంధించిన పూర్తి లెక్కలు ఇవ్వాలని కోరుతూ మాల్యా కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.