Vijay Mallya: కోర్టు ధిక్కార కేసులో విజయ్ మాల్యాకు సుప్రీంకోర్టు 4 నెలల జైలు శిక్ష విధించింది. అలాగే 2000 రూపాయల జరిమానాను కూడా కోర్టు విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో మరో రెండు నెలలు అదనంగా శిక్ష పడుతుంది. అంతే కాదు, విజయ్ మాల్యా  విదేశాలకు బదిలీ చేసిన 40 మిలియన్ డాలర్లను కూడా 4 వారాల్లో తిరిగి చెల్లించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. 

సుప్రీంకోర్టులో జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ ఎస్ రవీంద్ర భట్, జస్టిస్ సుధాన్షు ధులియాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. నిజానికి మార్చి 10న కోర్టు మాల్యా శిక్షపై తీర్పును రిజర్వ్ చేసింది. కోర్టు ధిక్కరణ కేసులో విజయ్ మాల్యాను దోషిగా పేర్కొంటూ ఐదేళ్ల క్రితం మే 9, 2017న ఆయనపై సుప్రీంకోర్టు ధిక్కార చర్యలను ప్రారంభించింది. వాస్తవానికి విజయ్ మాల్యా వివిధ బ్యాంకుల నుంచి 9000 కోట్ల రూపాయల రుణాలు తీసుకున్నారు. అయితే ఆ బ్యాంకులకు, సంబంధిత అధికారులకు తన ఆస్తులకు సంబంధించిన పూర్తి వివరాలను ఇంకా ఇవ్వలేదు.

ఈ విషయంలో బ్యాంకులు, అధికారుల తరఫు వాదనలు విన్న సుప్రీంకోర్టు విజయ్ మాల్యా తన వాదనను వినిపించేందుకు సుప్రీంకోర్టుకు హాజరు కావాలని 2017 జూలై 10న ఆదేశించింది. బ్రిటన్‌లో మాల్యా స్వేచ్ఛగా జీవిస్తున్నాడని, అయితే అక్కడ ఏం చేస్తున్నాడనే దానిపై ఎలాంటి సమాచారం రావడం లేదని కోర్టు పేర్కొంది.

విచారణ సందర్భంగా, న్యాయస్థానం రెండు కేసుల్లో మాల్యాను కోర్టు దోషిగా నిర్ధారించింది. మొదటిది, ఆస్తులను వెల్లడించకపోవడం మరియు రెండవది, కర్ణాటక హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడం. విజయ్ మాల్యా మొత్తం 17 భారతీయ బ్యాంకులకు రూ. 9,000 కోట్లు బకాయిపడ్డాడు.

లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా కింగ్ ఫిషర్ ప్రస్థానం...కింగ్ నుంచి నేరగాడి వరకూ..

>> విజయ్ మాల్యా తన తండ్రి విఠల్ మాల్యా నుంచి నుండి UB స్పిరిట్‌ సంస్థను వారసత్వంగా పొందారు. 28 సంవత్సరాల వయస్సులో విజయ్ మాల్యా UB గ్రూప్ ఛైర్మన్‌ అయ్యారు. యూబీ గ్రూప్ సంస్థ కింగ్‌ఫిషర్ బీర్ బ్రాండ్‌కు ప్రసిద్ధి చెందింది. భారతదేశంలో అతిపెద్ద స్పిరిట్స్ ఉత్పత్తిదారుగా యూబీ గ్రూపు అభివృద్ధి చెందింది. 

>> అయితే మద్యం వ్యాపారంలో తన గ్రూపును నెంబర్ వన్ రేంజులో నిలబెట్టిన విజయ్ మాల్యాను ఎయిర్ లైన్స్ వ్యాపారం మాత్రం గట్టిగా దెబ్బ కొట్టింది. ఆయన ప్రారంభించిన కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ భారీ నష్టాలను చవిచూసింది. 2005లో స్థాపించిన ఈ ఎయిర్‌లైన్ కంపెనీ, 2008లో ప్రపంచ మాంద్యం అలాగే, చుక్కలను తాకిన ఇంధన ధరల కారణంగా కుప్పకూలిపోయింది. 

>> 2005లో కార్యకలాపాలు ప్రారంభించిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్, నిర్వహణ భారం అయిపోయింది. అటు బ్యాంకుల రుణాలను సైతం చెల్లించడం కష్టతరం అయిపోయింది. ఈ కారణంగా 2012లో ఎయిర్ లైన్స్ సంస్థను మూసివేయవలసి వచ్చింది. రుణాలు చెల్లించడం దాదాపు అసాధ్యం కావడంతో, మాల్యా ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. దీంతో మనీలాండరింగ్, ఆర్థిక ఉల్లంఘనల జరిగినట్లు ఎయిర్‌లైన్ విచారణలో ఉంది.

>> విజయ్ మాల్యా 2016లో విమానయాన సంస్థ పతనం తర్వాత బ్యాంకుల నుంచి ఒత్తిడి ఎదురైంది. దీంతో ఆయన చెప్పా పెట్టకుండా యునైటెడ్ కింగ్‌డమ్‌ వెళ్లిపోయారు. అయితే తాను అప్పులు తీర్చే పనిలో ఉన్నానని బహిరంగంగా ప్రకటించాడు.

>> మాల్యా మార్చి 2, 2016న దేశం విడిచి వెళ్ళాడు, అదే రోజు ప్రభుత్వ రంగ బ్యాంకుల సమూహం డెట్ రికవరీ ట్రిబ్యునల్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో మాల్యాను ఫ్యుజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్ కింద జనవరి 2019లో అతన్ని పారిపోయిన ఆర్థిక నేరగాడు, ఫ్యుజిటివ్ గా గుర్తించింది.

>> అయితే మాల్యా మాత్రం తనపై వచ్చిన ఆరోపణలను తిరస్కరించాడు. బ్యాంకులకు చెల్లించాల్సిన మొత్తం సూత్రప్రాయంగా, తిరిగి ఇస్తానని బహిరంగ వాగ్దానం చేశాడు.

>> మాల్యా 2016లో దేశం విడిచి వెళ్లడానికి ముందు తనను తాను సమర్థించుకుంటూ ఒక బహిరంగ లేఖను ప్రచురించారు. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ లేదా తాను చేసిన నిధుల దుర్వినియోగానికి సంబంధించిన సాక్ష్యాలను కనుగొనడంలో అన్ని విచారణ సంస్థలు విఫలమయ్యాయి. బ్లూచిప్ సెక్యూరిటీలను తాకట్టుపెట్టి, కోర్టులో పెద్ద మొత్తంలో డబ్బు జమ చేసినప్పటికీ, కేవలం తప్పుడు ప్రచారం వల్ల తాను అన్ని బ్యాంక్ ఎన్‌పిఎలకు పోస్టర్ బాయ్‌గా మారాల్సి వచ్చిందని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.

>> జనవరి 2021లో మాల్య UKలో ఉండేందుకు "మరో మార్గం" కోసం హోం సెక్రటరీ ప్రీతి పటేల్‌కి దరఖాస్తు చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం యొక్క అప్పగింత అభ్యర్థనపై అతని న్యాయపరమైన సవాలును గత సంవత్సరం యూకే సుప్రీంకోర్టులో తిరస్కరణకు గురైంది.

>> అదే నెలలో, యునైటెడ్ కింగ్‌డమ్ ప్రభుత్వం మాల్యాకు సంబంధించిన రహస్య "చట్టపరమైన సమస్య" పరిష్కరించబడే వరకు అతనిని అప్పగించలేమని భారతదేశానికి తెలిపింది. UK ఈ "సమస్య" వివరాలను అందించడానికి నిరాకరించింది, ఇది న్యాయపరమైన స్వభావం అని పేర్కొంది. మాల్యా కేసు భారత ప్రభుత్వానికి ఎంత ముఖ్యమైనదో తనకు తెలుసని భరోసా ఇచ్చినప్పటికీ, సమస్యను పరిష్కరించడానికి ఎంత సమయం పడుతుందో వెల్లడించడానికి కూడా నిరాకరించింది.

>> జూన్ 1, 2021న, ముంబైలోని ప్రత్యేక PMLA కోర్టు రూ. 5,646.54 కోట్ల విలువైన మాల్యా ఆస్తులను బ్యాంకులకు రిస్టోరేషన్ కు అనుమతించింది.

>> ఆ తర్వాత SBI నేతృత్వంలోని లోన్ కన్సార్టియం విజయ్ మాల్యా NPA రుణాలను రికవరీ చేయడానికి అతడికి చెందిన కొన్ని రియల్ ఎస్టేట్ ఆస్తులు, సెక్యూరిటీలను విక్రయించవచ్చని పేర్కొంది. మాల్యాకు రుణాలు ఇచ్చిన 11 బ్యాంకుల కన్సార్టియం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నేతృత్వంలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ స్వాధీనం చేసుకున్న అతని ఆస్తులను రిస్టోరేషన్ చేయాలని కోరుతూ మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) ప్రత్యేక కోర్టును ఆశ్రయించింది.

>> జూలై 24, 2021 న భారత విదేశాంగ కార్యదర్శి హర్ష్ వర్ధన్ ష్రింగ్లా మాట్లాడుతూ, మాల్యాపై భారతదేశం తన ఉత్తమ వాదనను వినిపించిందని, విజయ్ మాల్యాను అప్పగించేందుకు UK అధికారుల నుండి కేంద్ర ప్రభుత్వం హామీ పొందిందని పేర్కొన్నారు.