US Student Visa Cancellation: అమెరికా ప్రభుత్వం 6,000 పైగా విదేశీ విద్యార్థుల వీసాలను రద్దు చేసింది. ఇందులో ఎక్కువగా భారతీయులు ఉన్నారు. చిన్నపాటి నేరాలు, ఉగ్రవాద గ్రూపులకు మద్దతు, ఆరోపణలు ప్రధాన కారణాలుగా వెల్లడించారు.
US Student Visa Cancellation: అమెరికా ట్రంప్ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రధానంగా వలస విధానాలను పటిష్టంగా కొనసాగిస్తోంది. ఈ క్రమంలో మరోసారి అంతర్జాతీయ విద్యార్థులకు భారీ షాక్ ఇచ్చింది ట్రంప్ సర్కార్. వలస నియంత్రణ చర్యలలో భాగంగా ఈ సంవత్సరం ఇప్పటివరకు 6,000 మందికి పైగా అంతర్జాతీయ విద్యార్థుల వీసాలను రద్దు చేసినట్లు అమెరికా విదేశాంగ శాఖ ధృవీకరించింది. అంతర్జాతీయ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని వీసా రద్దు విస్తృత స్థాయిలో జరగడం గమనార్హం. అయితే.. ఈ పరిణామం ముఖ్యంగా భారతీయ విద్యార్థులకు పెద్ద షాక్‌గా మారింది.
అధికారుల ప్రకారం.. వీసా రద్దుకు ప్రధాన కారణాలు అమెరికా చట్టాల ఉల్లంఘనలు, జాతీయ భద్రతా ఆందోళనలు అని తెలిపారు. దాదాపు 4,000 వీసాలు అమెరికా చట్టాలను ఉల్లంఘించిన విద్యార్థులవే. వీరిలో దాడులు, మద్యం సేవించి వాహనం నడపడం (DUI),దొంగతనం వంటి కేసుల్లో పట్టుబడిన వారు ఉన్నారని వెల్లడించారు. మరో 200-300 వీసాలను ఉగ్రవాద గ్రూపులకు మద్దతు ఇచ్చారనే ఆరోపణలతో రద్దు చేశారు.
అయితే, ఆ గ్రూపుల వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఈ చర్యలు ఇమిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్ నిబంధనల ప్రకారం అమలులోకి వచ్చాయి. ఆ చట్టం ప్రకారం ఉగ్రవాదం లేదా తీవ్రవాద కార్యకలాపాలకు సంబంధం ఉన్న విదేశీయులు అమెరికాలో ప్రవేశించడానికి అర్హులు కాని వారిగా పరిగణించబడతారు.
విద్యార్థులపై నిఘా
అమెరికాలో చదువుతున్న విద్యార్థులపై నిఘా మరింత కఠినతరం చేయాలని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా విద్యార్థుల సోషల్ మీడియా ఖాతాలను, వారి పూర్తి స్థాయి బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేస్తున్నారు.ఈ తరుణంలో ప్రత్యేకంగా ఇజ్రాయెల్-గాజా సంఘర్షణకు సంబంధించిన విద్యార్థి నిరసనలపై ట్రంప్ ప్రభుత్వం దృష్టి సారించింది. పలువురు పాలస్తీనా అనుకూల నిరసనకారులు వీసా సమస్యలను ఎదుర్కొంటున్నారు.
ఈ నిరసనల్లో యూదు వ్యతిరేక ధోరణులు పెరిగాయని ప్రభుత్వం ఆరోపిస్తోంది. మార్చి 2025లో టఫ్ట్స్ విశ్వవిద్యాలయానికి చెందిన పిహెచ్‌డీ విద్యార్థిని రూమెసా ఓజ్‌టుర్క్ వీసాను రద్దు చేసి, ఫెడరల్ ఏజెంట్లు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను కొన్ని వారాలు ICE కస్టడీలో ఉంచిన తరువాత, మేలో ఫెడరల్ జడ్జి ఆదేశాలతో విడుదల చేశారు. ఈ పరిణామాలు విద్యార్థుల భవిష్యత్తుపై పెద్ద ప్రభావం చూపుతాయని, అమెరికా ప్రతిష్టను దెబ్బతీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
యూనివర్సిటీల్లో ఆందోళనలు
ఈ నిర్ణయాలపై అమెరికాలోని హార్వర్డ్, బ్రౌన్, కాలిఫోర్నియా, పెన్సిల్వేనియా వంటి ప్రముఖ విశ్వవిద్యాలయాలు ఆందోళన వ్యక్తం చేశాయి. చిన్న చిన్న తప్పులకు కూడా వీసాలను రద్దు చేయడం సరికాదని, ఈ విధానం అంతర్జాతీయ విద్యార్థులలో అమెరికా విద్యపై ఆసక్తిని తగ్గించవచ్చని ఆ విద్యాసంస్థలు హెచ్చరించాయి. ఇప్పటికే కొంతమంది విద్యార్థులు కోర్టులను ఆశ్రయించారు.


