Donald Trump: ట్రంప్ దెబ్బకు టాయిలెట్ పేపర్లు కూడా కొనలేకపోతున్న అమెరికన్లు.
ప్రపంచదేశాలను అదుపు చేయాలన్న ఉద్దేశంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ఆ దేశ ప్రజలకే గుదిబండలా మారుతున్నాయి. ఇష్టారాజ్యంగా విధించిన టారిఫ్‌లతో అమెరికన్లకు నష్టం ప్రారంభమైంది.

అమెరికన్ల ఖర్చులపై ప్రభావం
ట్రంప్ టారిఫ్ దెబ్బతో అమెరికాలో నిత్యావసర వస్తువుల నుంచి వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల వరకు ధరలు ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. అధ్యక్షుడు ట్రంప్ విధించిన భారీ సుంకాల కారణంగా భారత్ సహా పలు దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులు ఆగస్టు 7 నుంచి మరింత ఖరీదైనవిగా మారాయి. ఇప్పటికే దుస్తులు, బ్యాగులు, టాయిలెట్ పేపర్ వంటి సాధారణ వస్తువుల ధరలు పెరగగా, రాబోయే రోజుల్లో డైపర్లు, షాంపూలు, స్కిన్‌కేర్ ఉత్పత్తులు, ప్రీమియం మద్యం, కార్లు, విడి భాగాలు కూడా వినియోగదారుల జేబులకు చిల్లు పెట్టనున్నాయి. ఆర్థిక నిపుణుల లెక్కల ప్రకారం ఒక్కో కుటుంబానికి సంవత్సరానికి సగటున రూ. 2.11 లక్షల వరకు అదనపు ఖర్చు అయ్యే అవకాశం ఉంది.
KNOW
రిటైల్ దుకాణాల్లో ధరల మార్పు స్పష్టంగా కనిపిస్తోంది
అమెజాన్, వాల్‌మార్ట్ వంటి పెద్ద స్టోర్లలో వస్తువుల ధరలను ఒక్కసారిగా పెంచేశారు. ఉదాహరణకు, 6.98 డాలర్లకు ఉన్న కోట్ ధర 10.98 డాలర్లకు చేరింది. 19.97 డాలర్లకు లభించిన బ్యాక్‌ప్యాక్ ఇప్పుడు 24.97 డాలర్లైంది. పాత స్టిక్కర్లపై కొత్త ధరల లేబుళ్లు అతికిస్తున్న దృశ్యాలు వినియోగదారులు సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. వీటికి సంబంధించిన పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ధరలు మరింత పెరుగుతాయనే ఆందోళన
భవిష్యత్తులో రేట్లు ఇంకా పెరుగుతాయని భావించి చాలామంది ముందుగానే అవసరమైన వస్తువులను కొనేస్తున్నారు. ఏఐ టూల్స్ ఉపయోగించి ఏ ఉత్పత్తుల ధరలు పెరుగుతాయో తెలుసుకుని వాటిని ముందే సొంతం చేసుకుంటున్నారు. పెద్ద మొత్తంలో కొనుగోళ్లు చేసేవారు ‘బై నౌ, పే లేటర్’ పద్ధతిని కూడా వినియోగిస్తున్నారు.
వేటిపై ప్రభావం పడనుందంటే
స్కూల్ యూనిఫార్ములు, బూట్లు, సాక్స్, కాఫీ, బీర్, ప్యాక్ చేసిన సముద్రాహారం, బేకరీ వస్తువులు, చిన్న పిల్లల ఆటవస్తువులు, గడియారాలు, వంటింటి సామగ్రి, టూత్‌పేస్టు, డిటర్జెంట్ వంటి అనేక ఉత్పత్తులపై సుంకాల పెంపు ప్రభావం పడుతుంది. సగటున 35% వరకు ధరల పెరుగుదల నమోదు కానుందని అంచనాలు ఉన్నాయి.
దిగుమతుల నిలిపివేతతో ఒత్తిడి
సుంకాల పెంపు తర్వాత అమెజాన్, వాల్‌మార్ట్ వంటి రిటైల్ దిగ్గజాలు కొత్తగా దిగుమతులు ఆర్డర్ చేయడం ఆపేశాయి. విదేశీ సరఫరాదారులకు ‘ప్రస్తుతం సరుకు పంపవద్దు’ అని సూచిస్తున్నాయి. దీంతో సరఫరా శృంఖలలో ఆటంకాలు ఏర్పడి, ధరలపై మరింత ఒత్తిడి పెరుగుతోంది.