Donald Trump: భారత్‌పై భారీ సుంకాల మోత మోగించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)మరోసారి భారత్ (India)పై కఠిన వైఖరి ప్రదర్శించారు. భారత్ లో ఎటువంటి వాణిజ్య చర్చలు జరగబోవని ఆయన స్పష్టం చేశారు.
India US Trade: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)మరోసారి భారత్ (India)పై కఠిన వైఖరి ప్రదర్శించారు. ఇప్పటికే భారత ఎగుమతులపై మొత్తం 50% సుంకం విధించిన ట్రంప్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తన నీచ బుద్దిని ప్రపంచానికి తెలియజేశారు. టారిఫ్ వివాదం పరిష్కారం అయ్యే వరకు భారత్ ప్రయత్నించాలని భావిస్తుంటే.. ఇండియాతో ఎటువంటి వాణిజ్య చర్చలు జరపడానికి తాను సిద్ధంగా లేనట్లు అధ్యక్షుడు చెబుతున్నారు.
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందన్న కారణంతో భారత్‌పై భారీ సుంకాల మోత మోగిస్తున్నారు. ఇప్పటికే భారత ఎగుమతులపై మొత్తం 50% సుంకం విధించిన ట్రంప్ ఈ విషయాన్ని మరింత జటిలంగా మార్చుతున్నారు. భారత్ లో ఎటువంటి వాణిజ్య చర్చలు జరపబోనని ఆయన స్పష్టం చేశారు. "ఈ సమస్య పరిష్కారం కాకుండా చర్చలు జరగవు" అని ఓవల్ కార్యాలయంలో ఓ వార్తా సంస్థ అడిగిన ప్రశ్నకు ట్రంప్ సమాధానమిచ్చారు.
ఇదిలా ఉంటే.. అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలకు విరుద్ధంగా అమెరికా విదేశాంగ శాఖ మరో ప్రకటన చేసింది. విదేశాంగశాఖ అధికార ప్రతినిధి టామీ పిగోట్ మీడియాతో మాట్లాడుతూ.. అమెరికాకు భారత్ వ్యూహాత్మక భాగస్వామి అని పేర్కొన్నారు. టారిఫ్‌ల నేపథ్యంలో ఇరుదేశాల మధ్య సంబంధాల్లో ఉద్రిక్తతలు నెలకొన్నప్పటికీ భారత్ తో చర్చల్లో పాల్గొంటామన్నారు. వాణిజ్యం, రష్యా నుంచి చమురు కొనుగోలు వంటి విషయాల్లో ట్రంప్ స్పష్టంగా ఉన్నారన్నారు. దానికి ప్రతిస్పందనగానే ట్రంప్ నేరుగా చర్యలు తీసుకున్నారన్నారని తెలిపారు.
రష్యా నుంచి చమురు కొనొద్దన్న తన హెచ్చరికలను పట్టించుకోని భారత్‌పై ట్రంప్ భారీగా సుంకాలు విధిస్తున్నారు. భారత్ ఎగుమతులపై ఆగస్టు 6న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అదనంగా 25% సుంకం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం భారత్ ఎగుమతులపై ప్రభావం చూపింది. ఇక తాజాగా ఇప్పటికే అమలులో ఉన్న సుంకానికి మరో 25% టారిఫ్ విధించారు. దీంతో టారిఫ్ మొత్తం 50%కు చేరుకుంది. భారతదేశం రష్యా నుండి చమురు కొనుగోలు కొనసాగించడం ఈ కఠిన నిర్ణయానికి ప్రధాన కారణమని వైట్ హౌస్ స్పష్టం చేసింది.
ట్రంప్ విధానాలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ గట్టిగా స్పందించారు. రైతులు, పాలు ఉత్పత్తిదారులు, మత్స్యకారుల ప్రయోజనాల విషయంలో ఎటువంటి రాజీ ఉండబోదని ఆయన స్పష్టం చేస్తూ, ఆర్థిక ఒత్తిడి వచ్చినా దేశ ప్రయోజనాలను కాపాడతామని హామీ ఇచ్చారు. ఈ టారిఫ్‌ల పెంపు వల్ల భారత ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది, ముఖ్యంగా టెక్స్టైల్, పాదరక్షలు, రత్నాభరణాలు వంటి రంగాలు భారీ దెబ్బతినే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో అమెరికా–భారత్ సంబంధాల మధ్య ఉద్రిక్తత నెలకొందనే చెప్పాలి.
