అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చట్టాలను కఠినతరం చేస్తున్నారు. ముఖ్యంగా తమ దేశంలోకి చట్ట విరుద్ధంగా అక్రమ మార్గాల్లో వచ్చే వారిని కట్టడి చేస్తున్నారు. ఈ దిశగానే తాజాగా భారత్‌లోని అమెరికా ఎంబసీ కీలక నిర్ణయం తీసుకుంది. సుమారు 2000 మంది భారతీయుల వీసా అపాయింట్‌మెంట్‌లను రద్దు చేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. 

భారత్‌లో ఆటోమేటెడ్ 'బాట్స్' వీసా ఇంటర్వ్యూ స్లాట్‌లను బ్లాక్ చేస్తుండటంతో అమెరికా కఠిన చర్యలు తీసుకుంటోంది. దీంతో చాలామంది ప్రైవేట్ ఏజెంట్లకు భారీగా డబ్బులు చెల్లించాల్సి వస్తోంది. అపాయింట్‌మెంట్ దొరక్కపోవడంతో రూ. 30,000-35,000 వరకు కట్టాల్సి వస్తోంది. భారత్‌లోని యూఎస్ ఎంబసీ బుధవారం సోషల్ మీడియా వేదిక X ద్వారా కీలక ప్రకటన చేసింది. "కన్సులర్ టీమ్ ఇండియా బాట్స్ ద్వారా చేసిన 2,000 వీసా అపాయింట్‌మెంట్‌లను రద్దు చేస్తోంది. మా షెడ్యూలింగ్ పాలసీలను ఉల్లంఘించే ఏజెంట్లు, ఫిక్సర్లను మేం సహించం. వెంటనే ఈ అపాయింట్‌మెంట్‌లను రద్దు చేస్తున్నాం. సంబంధిత ఖాతాల షెడ్యూలింగ్ అధికారాలను నిలిపివేస్తున్నాం." అని పేర్కొన్నారు. 

Scroll to load tweet…

"మేం మోసాల్ని అరికట్టే ప్రయత్నాలు చేస్తూనే ఉంటాం. మోసాల్ని ఏమాత్రం సహించం" అని ఎంబసీ తెలిపింది.

వీసా ఏజెంట్ల గుట్టు

చాలా ఏళ్లుగా ట్రావెల్ ఇండస్ట్రీలో కొందరు అక్రమార్కులు వ్యవస్థను తప్పుదోవ పట్టిస్తున్నారు. సాధారణంగా బిజినెస్ (B1/B2), స్టూడెంట్ వీసాల కోసం దరఖాస్తు చేసుకునేవాళ్లు చాలా రోజులు వెయిట్ చేయాల్సి వస్తోంది. డబ్బులుంటే మాత్రం నెల రోజుల్లోనే పని అయిపోతుంది. పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ తల్లిదండ్రి తమ అనుభవాన్ని పంచుకున్నారు: "మా పిల్లవాడు అమెరికన్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వడానికి వీసా ఇంటర్వ్యూ కోసం మేం చాలా ప్రయత్నించాం. కానీ టైమ్‌కి దొరకలేదు. ఏజెంట్‌కు ₹30,000 కట్టిస్తే టైమ్‌కి అయిపోయింది." అలాగే B1/B2 వీసాల కోసం అప్లై చేసుకునేవాళ్లు ఆరు నెలలు వెయిట్ చేయాల్సి వస్తోంది. కానీ ఏజెంట్లు మాత్రం బాట్స్‌తో కొన్ని వారాల్లోనే పని పూర్తి చేస్తున్నారు.

బాట్స్ ఎలా మోసం చేస్తాయి?

వీసా అందించే ఏజెంట్లు బాట్స్‌ను ఉపయోగించి స్లాట్‌లను బ్లాక్ చేస్తారు. దీంతో నేరుగా వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారికి అపాయింట్‌మెంట్లు దొరకవు. తప్పనిసరి పరిస్థితుల్లో మధ్యవర్తులను ఆశ్రయించాల్సి వస్తుంది. వాళ్లు డబ్బులు తీసుకుని స్లాట్‌లను రిలీజ్ చేస్తారు. 2023లో ఈ సమస్య తీవ్రంగా మారింది. B1/B2 వీసా కోసం 999 రోజులు ఎదురు చూడాల్సి వచ్చింది. దీంతో అమెరికా ఫ్రాంక్‌ఫర్ట్, బ్యాంకాక్, ఇతర ప్రాంతాల్లోని కాన్సులేట్‌లలో అపాయింట్‌మెంట్లు ఏర్పాటు చేసింది. దీనిపై ఇండియా మూడు సంవత్సరాల క్రితం అమెరికాతో మాట్లాడింది. అప్పటి నుంచి అమెరికా వెయిటింగ్ పీరియడ్‌ను తగ్గించడానికి చాలా చర్యలు తీసుకుంది.