నమ్మకం సన్నగిల్లింది..: చైనా దౌత్యవేత్తతో సమావేశంలో అజిత్ దోవల్ కీలక వ్యాఖ్యలు
2020 నుంచి భారత్-చైనా సరిహద్దులోని పశ్చిమ సెక్టార్‌లోని ఎల్‌ఏసీ వెంబడి ఉన్న పరిస్థితులు ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలపై వ్యూహాత్మక విశ్వాసాన్ని, ప్రజా, రాజకీయ ప్రాతిపదికను దెబ్బతీశాయని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అన్నారు.

న్యూఢిల్లీ: 2020 నుంచి భారత్-చైనా సరిహద్దులోని పశ్చిమ సెక్టార్‌లోని ఎల్‌ఏసీ వెంబడి ఉన్న పరిస్థితులు ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలపై వ్యూహాత్మక విశ్వాసాన్ని, ప్రజా, రాజకీయ ప్రాతిపదికను దెబ్బతీశాయని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అన్నారు. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన ఫ్రెండ్స్ ఆఫ్ బ్రిక్స్ సమావేశానికి భారత్ తరఫున అజిత్ ధోవల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా చైనా అగ్ర దౌత్యవేత్త వాంగ్ యితో ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై అజిత్ దోవల్ చర్చిస్తున్నట్లుగా సంబంధిత వర్గాలు తెలిపాయి.
వాంగ్ యి విషయానికి వస్తే.. ఆయన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ) పొలిటికల్ బ్యూరో సభ్యుడు, సీపీసీ విదేశీ వ్యవహారాల కమిషన్ కార్యాలయ డైరెక్టర్. భారత్ తరఫున అజిత్ దోవల్, చైనా తరఫున వాంగ్ యి సరిహద్దు చర్చలపై ప్రత్యేక ప్రతినిధులుగా ఉన్నాయి. సరిహద్దుపై భారత్, చైనాల మధ్య చివరి ప్రత్యేక ప్రతినిధి స్థాయి చర్చలు 2019లో జరిగాయి.
ద్వైపాక్షిక సంబంధాలలో సాధారణ స్థితికి అవరోధాలను తొలగించేందుకు, సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, ప్రశాంతతను పునరుద్ధరించడానికి, పరిస్థితిని పూర్తిగా పరిష్కరించడానికి, శాంతిని పునరుద్ధరించడానికి నిరంతర ప్రయత్నాల ప్రాముఖ్యతను అజిత్ దోవల్ ఈ సందర్భంగా నొక్కి చెప్పారు.
మరోవైపు ఇరు పక్షాలు వ్యూహాత్మక పరస్పర విశ్వాసాన్ని పెంపొందించుకోవాలని, ఏకాభిప్రాయం, సహకారంపై దృష్టి సారించాలని, అడ్డంకులను అధిగమించాలని, వీలైనంత త్వరగా ద్వైపాక్షిక సంబంధాలను మంచి, స్థిరమైన అభివృద్ధి ట్రాక్‌లోకి తీసుకురావాలని వాంగ్ యి అన్నారని చైనా ప్రభుత్వ వార్తా సంస్థ జిన్హువా రిపోర్టు చేసింది. చైనా ఎప్పుడూ ఆధిపత్యాన్ని కోరుకోదని, బహుపాక్షికత, అంతర్జాతీయ సంబంధాల ప్రజాస్వామ్యీకరణకు మద్దతు ఇవ్వడానికి, అంతర్జాతీయ క్రమంలో మరింత న్యాయమైన, సమానమైన అభివృద్ధిని ప్రోత్సహించడానికి భారతదేశంతో సహా అభివృద్ధి చెందుతున్న దేశాలతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉందని కూడా ఆయన నొక్కిచెప్పిన్టటుగా పేర్కొంది.
ఇక, భారత్-చైనా ద్వైపాక్షిక సంబంధాలు కేవలం రెండు దేశాలకే కాకుండా ఈ ప్రాంతానికి, ప్రపంచానికి కూడా ముఖ్యమైనవని ఇరుపక్షాలు అంగీకరించాయి. ఇక, ఇటీవల ఇండోనేషియా రాజధాని జకార్తాలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మిస్టర్ వాంగ్‌తో సమావేశమై చర్చలు జరిపారు. ఇరుదేశాల సరిహద్దు ప్రాంతాలలో శాంతి, ప్రశాంతతకు సంబంధించిన సమస్యలపై వారు చర్చించారు. అయితే ఈ భేటీ జరిగిన కొద్దిరోజులకే తాజాగా ఈ సమావేశం జరగడం గమనార్హం. ఇక, ఇరుదేశాల మధ్య సరిహద్దు వివాదం తన సుదీర్ఘ దౌత్య జీవితంలో అత్యంత క్లిష్టమైన సవాలుగా కేంద్ర విదేశాంగ మంత్రి జై శంకర్ ఇటీవల అభివర్ణించారు. సరిహద్దు ప్రాంతంలో శాంతి నెలకొనకపోతే ద్వైపాక్షిక సంబంధాలు సాధారణంగా ఉండలేవని భారత్ అభిప్రాయపడుతోంది.