ఇండియా చైనా వైపు ఉందన్న తన అభిప్రాయాన్ని ట్రంప్ మార్చుకున్నాడు. మరోసారి భారత్ ను, ప్రధాని మోదీని కొనియాడారు.
Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ తన మాట మార్చారు. ఇండియా చైనా వైపు ఉందన్న తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు. నిన్న(శుక్రవారం) ట్రూత్ సోషల్‌లో ట్రంప్ ఆసక్తికర పోస్ట్ చేశారు… ఇండియా, రష్యాలు చైనా వైపు మళ్లుతున్నాయంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కానీ తాాజాగా ఇండియా చైనా వైపు ఉందని అనుకోవట్లేదంటూ ట్రంప్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇండియా తమతోనే ఉంటుందనేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి.
భారత ప్రధాని నరేంద్ర మోదీ గొప్ప నాయకుడని ట్రంప్ కొనియాడారు. ‘నేను ఎప్పటికీ మోదీ స్నేహితుడినే. భయపడాల్సిన పనిలేదు’ అని ట్రంప్ అంటున్నారు. తనకు మోదీతో మంచి సంబంధం ఉందని… దాన్ని కొనసాగిస్తాననేలా ట్రంప్ తాజా కామెంట్స్ ఉన్నాయి. కేవలం ఇండియా రష్యా నుంచి చమురు కొనడం పట్ల తనకు అభ్యంతరం ఉందని… ఈ సమస్యను పరిష్కరిస్తానని ట్రంప్ తెలిపారు.
అయితే ఇండియా కేవలం స్వప్రయోజనాల కోసమే రష్యా నుంచి చమురు కొంటోందన్న వాదనను ట్రంప్ సలహాదారు పీటర్ నవారో ఖండించారు. ఇండియా నిజం ఒప్పుకోడానికి సిద్ధంగా లేదని నిన్న ఆయన కామెంట్ చేశారు. ఇలా ఓసారి ఇండియాకు వ్యతిరేకంగా, మరోసారి అనుకూలంగా అమెరికా వ్యవహరిస్తోంది.
చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ ఆతిథ్యం ఇచ్చిన టియాన్‌జిన్ SCO సదస్సుకు ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సహా అనేక మంది ప్రపంచ నాయకులు హాజరయ్యారు. ట్రంప్ సుంకాల యుద్ధం ప్రకటించిన నేపథ్యంలో ముగ్గురు నాయకుల స్నేహాన్ని ‘టర్నింగ్ పాయింట్’ గా ప్రపంచం పేర్కొంటోంది. ఈ క్రమంలో ట్రంప్ కూడా వీరి కలయికపై కామెంట్స్ చేయడంతో ఇది మరింత చర్చనీయాంశంగా మారింది. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సదస్సులో మూడు దేశాల నాయకులు కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ ట్రంప్ వ్యంగ్యంగా పోస్ట్ చేశారు.
