అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. అక్రమ వలసదారులను తరిమికొట్టడం మొదలు పన్నుల విధింపు వరకు వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాడు..
విదేశీ కార్లపై టారిఫ్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి అందరికీ షాక్ ఇచ్చారు. వేరే దేశాల్లో తయారైన కార్లపై భారీగా టారిఫ్ వేస్తానని చెప్పారు. ఈ కార్లపై 25% టారిఫ్ విధిస్తున్నట్లు వైట్ హౌస్ తెలిపింది. దీనివల్ల వ్యాపార భాగస్వాములతో గొడవలు జరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
కార్లపై 25% టారిఫ్ బాదుడు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైట్ హౌస్‌లో మాట్లాడుతూ.. అన్ని విదేశీ కార్లపై 25% టారిఫ్ వేస్తామని అన్నారు. అమెరికాలో తయారైన కార్లపై ఎలాంటి టారిఫ్ ఉండదని ఆయన తేల్చి చెప్పారు. ఈ రూల్ ఏప్రిల్ 2 నుంచి అమలులోకి వస్తుంది. ఇదివరకు ఉన్న టారిఫ్‌లతో పాటు ఇది అదనం.
స్టీల్, అల్యూమినియం దిగుమతులపై కూడా టారిఫ్
అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ట్రంప్ కెనడా, మెక్సికో, చైనా వంటి దేశాల నుంచి వచ్చే వస్తువులపై టారిఫ్ వేశారు. స్టీల్, అల్యూమినియం దిగుమతులపై కూడా 25% టారిఫ్ వడ్డించారు.వ్యాపారాలకు పెద్ద తలనొప్పి
ఇప్పటికే ఉన్న టారిఫ్‌లతో ఇబ్బంది పడుతున్న వ్యాపారాలకు ఇది మరింత తలనొప్పి తెస్తుంది. దీనివల్ల ఉత్పత్తిదారుల ఖర్చులు పెరుగుతాయని ఆర్థిక నిపుణులు అంటున్నారు. కంపెనీలు ఈ ఖర్చులను భరించలేకపోతే, వినియోగదారుల నుంచి వసూలు చేయాల్సి వస్తుంది. మరి అమెరికా ప్రజల ప్రయోజనాలే తనకు ముఖ్యమని చెప్పుకునే ట్రంప్ ఈ నిర్ణయాన్ని ఎలా సమర్ధించుకుంటారో చూడాలి.
