సౌత్ కరోలినాలోని లిటిల్ రివర్ బీచ్ టౌన్‌లో ఆదివారం రాత్రి జరిగిన కాల్పుల్లో కనీసం 11 మంది గాయపడి ఆసుపత్రిలో చేరారు.

అమెరికా దక్షిణ కరోలినాలో ఆదివారం రాత్రి ఓ తీవ్రమైన కాల్పుల ఘటన కలకలం రేపింది. లిటిల్ రివర్ అనే ప్రాంతంలో రాత్రి 9.30 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు విచక్షణ లేకుండా కాల్పులకు పాల్పడ్డారు. ఈ అనూహ్య దాడి నుంచి తప్పించుకోవాలని ప్రజలు పరుగులు పెట్టారు. ఈ సంఘటనలో 11 మంది గాయపడగా, వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించినట్టు హారీ కౌంటీ పోలీసులు వెల్లడించారు.

Scroll to load tweet…

ప్రమాదానికి సంబంధించి సమాచారం అందుకున్న వెంటనే అత్యవసర సేవలు అందించే బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. పలువురు అంబులెన్స్‌లు వెంటనే వచ్చి గాయపడిన వారిని తరలించాయి. కాల్పులు జరిగిన ప్రదేశం నివాస సముదాయాల మధ్య ఉండటంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

Scroll to load tweet…

ఇలాంటి ఘటనలు అక్కడ కొత్తవి కావు. గత నెలలో కూడా దక్షిణ కరోలినాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం మిర్టిల్ బీచ్‌లో జరిపిన కాల్పుల్లో ఒకరు మరణించగా, 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరోసారి, నార్త్ ఓషన్ బౌలేవార్డ్ వద్ద ఓ వ్యక్తి జనంపై అకస్మాత్తుగా కాల్పులకు తెగబడి పలువురిని గాయపరిచాడు. తర్వాత అతను పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు.

ఇప్పుడు లిటిల్ రివర్ కాల్పుల వెనక ఎవరు ఉన్నారు, ఎందుకు జరిగినదీ తెలియాల్సి ఉంది. ఘటనపై పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని అధికారులు ప్రకటించారు. వరుసగా జరుగుతున్న ఈ ఘటనలు దక్షిణ కరోలినాలో భద్రతపై అనేక ప్రశ్నలు తెరపైకి తీసుకొస్తున్నాయి.