ఓ ప్రైవేట్ ఇంటిపై దుండగుడు కాల్పులు జరపడంతో ముగ్గురు మరణించారు. మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి. ఈ ఘటన మేరీల్యాండ్ లోని అన్నాపోలిస్ లో చోటు చేసుకుంది.
మేరీల్యాండ్ లో కాల్పులు కలకలం రేపాయి. అన్నాపోలిస్ లోని ఓ ప్రైవేటు నివాసంలో ఓ దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారని స్థానిక అధికారులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపారని ‘ఇండియా టుడే’ నివేదించింది. కాగా.. ఈ ఘటనకు పాల్పడినట్టు అనుమానిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
విషాదం.. 11 ఏళ్ల మూగ బాలుడిని కరిచి చంపిన వీధి కుక్కలు.. ఎక్కడంటే ?
అన్నాపోలిస్ లోని పాడింగ్టన్ ప్లేస్ లోని 1000 బ్లాక్ లోని ఓ ఇంట్లో కాల్పులు జరిగినట్లు రాత్రి 8 గంటల సమయంలో అధికారులకు సమాచారం అందిందని ‘బీఎన్ వో’ న్యూస్ తెలిపింది. అయితే దుండగుడు ఆరుగురిపై కాల్పులు జరిపాడని చెప్పారు. అందులో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారని, మరో ముగ్గురికి గాయాలు అయ్యాయని పోలీసు చీఫ్ ఎడ్ జాక్సన్ తెలిపారు. బాధితులంతా 20 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్కులేనని, ఒకరికొకరు తెలుసునని తెలిపారు.
కాగా.. పరస్పర వ్యక్తిగత వివాదమే ఈ కాల్పులకు కారణమని పోలీసులు పేర్కొన్నారు. అన్నాపోలిస్ లో ఇలాంటివి సాధారణంగానే జరుగుతుంటాయని జాక్సన్ అన్నారు.
ఇలాంటి ఘటనే ఇటీవల ఉత్తర ఇజ్రాయెల్ లో చోటు చేసుకుంది. యాఫా అన్-నసెరియాలో జరిగిన కాల్పుల ఘటనలో ఐదుగురు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను నజరేత్ లోని ఇంగ్లిష్ ఆసుపత్రికి తరలించగా, వారిలో ఐదుగురు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఇజ్రాయెల్ పోలీసు కమిషనర్ కోబి షబ్తాయ్, జాతీయ భద్రతా మంత్రి ఇటామర్ బెన్-గ్విర్ (ఓట్జ్మా యెహుదిట్) సంఘటనా స్థలానికి చేరుకున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. నజరేత్ నగరానికి సమీపంలోని అరబ్ పట్టణమైన యాఫాలోని కారు వాష్ బయట కాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు. వారు ఈ సంఘటనను నేరపూరిత చర్యగా పేర్కొన్నారు కానీ పూర్తి వివరాలను వెల్లడించలేదని స్థానిక మీడియా పేర్కొంది. ఉత్తర ప్రాంతంలోని రెండు స్థానిక నేర కుటుంబాల మధ్య కొనసాగుతున్న ఘర్షణ ఫలితంగా ఈ కాల్పులు జరిగినట్లు కనిపిస్తోందని ఇజ్రాయెల్ ప్రభుత్వ యాజమాన్యంలోని కాన్ టీవీ న్యూస్ నివేదించింది.
