Weather Update: వర్షాలకు స్మాల్ బ్రేక్... కానీ ఆ రోజు నుంచి మళ్లీ భారీ వానలు
గడిచిన వారం, పదిరోజులుగా తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో భారీగా వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా వాతావరణ శాఖ వర్షాలకు బ్రేక్ పడినట్లు ప్రకటించింది. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

వర్షాలకు విరామం
గత పది రోజులుగా కురిసిన భారీ వర్షాలకు విరామం దొరికింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం, వచ్చే వారంనుంచి పది రోజులపాటు రాష్ట్రంలో పెద్ద వర్షాలు పడే అవకాశం లేదని తెలిపింది. ప్రస్తుతం పొడి వాతావరణం కొనసాగుతుందని, ఆ తర్వాత మళ్లీ వర్షాలు తిరిగి ప్రారంభం కావచ్చని అంచనా వేసింది.
ఈ సీజన్‌లో రాష్ట్ర సగటు వర్షపాతం సాధారణం కంటే కొంచెం ఎక్కువగా నమోదైంది. అయితే, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సగటు కంటే తక్కువ వర్షాలు పడగా, పాత పాలమూరు జిల్లాల్లో మాత్రం అసాధారణ వర్షాలు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా కూడా వర్షపాతం సాధారణం కంటే 7 శాతం ఎక్కువగా ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది.
KNOW
ప్రాజెక్టుల్లోకి కొనసాగుతోన్న వరద నీటి ప్రవాహం
భారీ వర్షాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ప్రాజెక్టులకు వరద నీరు వస్తూనే ఉంది. జూరాల ప్రాజెక్టులో వరద కారణంగా 10 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో సుమారు 1.34 లక్షల క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 1.31 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా, ప్రస్తుత నీటిమట్టం 317.730 మీటర్ల వద్ద ఉంది. మొత్తం సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 8.087 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జూరాల పైభాగం, కిందభాగం జలవిద్యుత్ కేంద్రాల్లో ఐదు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.
సుంకేషుల నుంచి శ్రీశైలానికి భారీ వరద ప్రవాహం
సుంకేషుల జలాశయం వద్ద కూడా వరద కొనసాగుతోంది. 21 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. పైప్రాంతాల నుంచి వరద చేరుతుండటంతో శ్రీశైలం డ్యామ్ నిండుకుండలా మారింది. ఐదు గేట్లను 10 అడుగుల మేర ఎత్తి లక్షా 8 వేల క్యూసెక్కులకుపైగా నీటిని దిగువకు వదిలేస్తున్నారు. అదనంగా కుడి, ఎడమ గట్టు జలవిద్యుత్ ఉత్పత్తి కోసం 66 వేల క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు తరలిస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో 215 టీఎంసీల సామర్థ్యంలో 204 టీఎంసీలు నిల్వ ఉన్నాయి.
నాగార్జునసాగర్‌లో గరిష్ఠానికి నీటి మట్టం
ఎగువ ప్రాంతాల వరదలతో నాగార్జునసాగర్ జలాశయం కూడా నిండుకుండలా మారింది. ప్రస్తుతం సాగర్‌కు 2 లక్షల 10 వేల క్యూసెక్కుల వరద చేరుతోంది. అవుట్‌ఫ్లో 41 వేల క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 587 అడుగుల వద్ద ఉంది. గరిష్ఠ సామర్థ్యం 312.05 టీఎంసీలు కాగా, ఇప్పుడు 302.72 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మరో 10 టీఎంసీలు చేరితే సాగర్ పూర్తిగా నిండిపోతుంది.
ఆగస్టు రెండో వారం నుంచి మళ్లీ వర్షాలు
హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా ప్రకారం ఆగస్టు రెండో వారం నుంచి తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటివరకు నైరుతి రుతుపవనాల సీజన్‌లో రాష్ట్ర సగటు వర్షపాతం 347.2 మిల్లీమీటర్లుగా ఉండగా, వాస్తవానికి 338.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో 3 శాతం లోటు వర్షపాతం కొనసాగుతోంది. 33 జిల్లాల్లో ఐదు జిల్లాల్లో మాత్రమే ఈ లోటు ఉంది. గత 24 గంటల్లో ఆదిలాబాద్ జిల్లా బేలలో 2.63 సెం.మీ వర్షపాతం గరిష్టంగా నమోదైందని అధికారులు తెలిపారు.