చైనా ప్రభుత్వం దేశంలో తగ్గిపోతున్న జననాలు, వివాహాల రేటు పెంచడానికి వినూత్న ప్రయత్నం చేస్తోంది. పాతికేళ్లలోపు వయసులో పెళ్లి చేసుకునే అమ్మాయిలకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. 

చైనా : ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశం ఏది అంటే చైనా అని చూపించేవారు. కానీ ప్రస్తుతం ఈ పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. జననాల రేటు గణనీయంగా తగ్గిపోయింది. దీంతో చైనాలోని స్థానిక యంత్రాంగాలు కీలకచర్యలు చేపడుతున్నాయి. ఈ చర్యల్లో భాగంగానే 25 లేదా అంతకంటే తక్కువ వయసులో పెళ్లి చేసుకునే యువతులకు రివార్డులు ఇస్తామంటూ ప్రకటించింది. చైనాలోని బెజీయంగ్ రాష్ట్రంలోని చాంగ్షాన్ కౌంటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుతం చైనాలో 140 కోట్లకు పైగా జనాభా కలిగి ఉంది. అయితే ఇక్కడ జననాల రేటు క్రమంగా తగ్గిపోతుండడంతో చైనా కలవరపడుతుంది. ఒకప్పుడు పెరుగుతున్న జనాభాను కంట్రోల్ చేయడం కోసం ప్రయోగాలు చేసింది. ప్రస్తుతం జననాల రేటు పెంచడం కోసం రివార్డులు ప్రకటిస్తోంది. దీంట్లో భాగంగానే యువతులు తగిన వయసులో పెళ్లిళ్లు చేసుకుని పిల్లలు కనేలా ప్రోత్సహించాలనుకుంటుంది.

తొమ్మిదేళ్ల చిన్నారి పోగొట్టుకున్న బొమ్మ కోసం వేలమైళ్లు ప్రయాణించిన ఫైలట్...

దీనికోసం నగదు ప్రోత్సాహకాన్ని చాంగ్షాన్ కౌంటీ ప్రకటించింది. పాతికేళ్లు.. అంత కంటే తక్కువ వయసులో వివాహం చేసుకునే యువతులకు ప్రోత్సాహకాన్ని అందిస్తుంది. అయితే, ఈ వివాహం కూడా మొదటి వివాహం అయి ఉండాలి. అలా వివాహం చేసుకున్న యువతులకు నగదు పథకం కింద వెయ్యి యువాన్లు అందజేస్తుంది. 

 ఆ తర్వాత పుట్టే పిల్లల సంరక్షణ, చదువు విషయంలో కూడా సబ్సిడీలు ఇచ్చి.. వివాహం చేసుకున్న జంటలకు ఆర్థికంగా సహకరిస్తుంది. ప్రస్తుతం చైనాలో స్త్రీ పురుషుల కనీస వివాహ వయసు 20, 22గా ఉంది. చాలా యేళ్లుగా చైనాలోని ప్రజలు చిన్న కుటుంబాలకు అలవాటు పడిపోయారు. జీవన వ్యయాలు పెరిగిపోయాయి.

సాంస్కృతిక మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ కారణాలన్నింటితో యువత పెళ్లిళ్లు చేసుకోవడానికి విముఖత చూపిస్తున్నారు. దీంతో చైనాలో జననాల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. చైనా పౌర సంబంధాల వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2022లో విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. అంతకు ముందటి ఏడు అంటే 2021తో పోలిస్తే.. 2022లో వివాహం చేసుకున్న వారి సంఖ్య 10.5% తగ్గిపోయింది.

చైనాలో 2021లో 7.63 మిలియన్ల జంటలు వివాహం చేసుకున్నాయి. అదే 2022కి వచ్చేసరికి 6.8 మిలియన్ల జంటలు మాత్రమే పెళ్లిళ్లు చేసుకున్నట్లు ఈ గణాంకాల్లో తేలింది. 1986 నుంచి ఇప్పటివరకు చైనాలో నమోదైన వివాహాల్లో నిరుడు అతి తక్కువ వివాహాలు జరిగినట్లు వెల్లడించింది. దీంతోపాటు సంతానోత్పత్తి రేటు అతి తక్కువగా ఉంది. 2022లో అది 1.09కి పడిపోయిందని గణాంకాలు తెలుపుతున్నాయి.