ఓ పైలట్ చేసిన పని ఇప్పుడు అందరి హృదయాల్నీ కదిలిస్తోంది. తొమ్మిదేళ్ల చిన్నారి పోగొట్టుకున్న బొమ్మ కోసం వేల మైళ్ల దూరం ప్రయాణించి.. దాన్ని ఆమెకు అందించాడు.  

అమెరికా : ఎదుటివారి ఎమోషన్స్ ను గుర్తించడం, వాటికి విలువ ఇవ్వడం.. దానికోసం ఎవరైనా కాస్త కష్టపడడం మనసును హత్తుకుంటుంది. అలాంటి ఘటనే ఒకటి అమెరికాలో వెలుగు చూసింది. ఓ చిన్నారికి ఓ బొమ్మ అంటే ప్రాణం.. సరదాగా కుటుంబంతో టూర్ కు వెళ్లినప్పుడు దాన్నీ తనతో తీసుకెళ్లింది. కానీ మధ్యలో పోగొట్టుకుంది. దాన్ని ఆమె తండ్రి ఎఫ్ బీలో పంచుకున్నారు. 

అది గమనించిన ఓ పైలట్ చిన్నారి ఎమోషన్ ను అర్థం చేసుకున్నాడు. ఆ బొమ్మ గురించి ఆరాతీసి.. చివరికి అదెక్కడ పడిపోయిందో కనిపెట్టి.. ఏకంగా 5,880 మైళ్లు ప్రయాణించి ఆమెకు అందించాడు. 

అమెరికా నార్త్ కరోలినా యూనివర్శిటీలో కాల్పులు:ప్రొఫెసర్ మృతి

ఒక అమెరికన్ ఎయిర్‌లైన్స్ పైలట్ టోక్యో నుండి టెక్సాస్‌కు 5,880 మైళ్లు (9462 కిలోమీటర్లు) ప్రయాణించి 9 ఏళ్ల బాలిక పోగొట్టుకున్న బొమ్మను ఆమెకు అందించినట్లు న్యూయార్క్ పోస్ట్ నివేదించింది. ఆ చిన్నారి కుటుంబ పర్యటన తర్వాత ముఖ్యంగా, అమ్మాయికి ఇష్టమైన అమెరికన్ గర్ల్ డాల్, బీట్రైస్ కనిపించకుండా పోయింది. బొమ్మ దొరుకుతుందనే ఆశతో కుటుంబ సభ్యులు తమ లగేజీని మొత్తం వెతికినా ఫలితం లేకుండా పోయింది.

ఇండోనేషియా పర్యటన తర్వాత టెక్సాస్‌కు తిరిగి వెళ్లే ముందు టోక్యోలో ఆగినప్పుడు చివరిసారిగా బొమ్మను చూసినట్లు ఆమె తల్లిదండ్రులు గుర్తు చేసుకున్నారు. ''గత మూడు లేదా నాలుగు సంవత్సరాలుగా మా జీవితంలో బీట్రైస్ ఓ ముఖ్యురాలైంది. ఆ బొమ్మ పోవడంతో మా చిన్నారి చాలా విచారంగా ఉంది. అది మాకూ విచారాన్ని కల్గించింది’ అని వాలెంటినా డొమింగ్యూజ్ తండ్రి రూడీ డొమింగ్యూజ్ అన్నారు.

తమ కుమార్తె నిరుత్సాహానికి గురికావడాన్ని చూసిన తల్లిదండ్రులు ఫేస్‌బుక్‌లో బొమ్మ గురించి పోస్ట్ చేశారు. అదృష్టవశాత్తూ, అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కి చెందిన పైలట్ జేమ్స్ డానెన్ పోస్ట్‌ను చూసి, టోక్యోలోని హనేడా ఎయిర్‌పోర్ట్‌లో టర్కిష్ ఎయిర్‌లైన్స్‌తో దీని గురించి ఆరా తీశారు. అలా పాప పోగొట్టుకున్న బొమ్మను గుర్తించాడు. ఆ తరువాత ఆ బీట్రైస్‌ అనే పేరుగల బొమ్మతో ఫోటోలు తీశాడు. ప్రయాణంలో కూడా దానితో ఫొటోలు తీసుకున్నాడు. చివరికి దానిని 9 ఏళ్ల చిన్నారికి అందించాడు. 

ఆ పైలట్ డొమింగ్యూజ్ కుటుంబానికి కేవలం కొద్ది మైళ్ల దూరంలోనే ఉంటాడు. అతను ఆ బొమ్మతో ఆగస్ట్ 21న వారింటికి వెళ్లి.. చిన్నారిని సర్ ఫ్రైజ్ చేశాడు. ఆ బొమ్మను చూసిన ఆ కుటుంబం సంతోషానికి అవధులు లేకుండా పోయింది. దీని గురించి ఆ పైలట్ మాట్లాడుతూ... 

''అది నా స్వభావం. ప్రజలకు సహాయం చేయడం నాకు ఇష్టం... అలా చేయడం వల్ల వారు పడ్డ ఆనందం నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది..'' అని పైలట్ చెప్పాడు.

చిన్నారి మాట్లాడుతూ "బీట్రైస్ అంటే నాకు చాలా ఇష్టం. ఆ బొమ్మ నా దగ్గర ఉంటే ఎంతో సంతోషంగా ఉంటుంది. అది నా బెస్ట్ ఫ్రెండ్. ఆ బొమ్మ పోయినప్పుడు చాలా బాధపడ్డాను. నా గుండె పగిలిపోయినట్లు అనిపించింది, " అని చెప్పుకొచ్చింది.