రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌తో ద్వైపాక్షిక చర్చలకు తొలిసారి అంగీకరించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో చర్చల తర్వాత 30 రోజుల పాక్షిక యుద్ధ విరమణకు కూడా ఆయన అంగీకరించారు. దీంతో గత మూడేళ్లుగా కొనసాగుతోన్న రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి ఫుల్ స్టాప్ పడనుందా అన్న వార్త ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది..
మాస్కో: మూడేళ్లుగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఉక్రెయిన్‌తో యుద్ధం మొదలైన తర్వాత తొలిసారి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌తో ద్వైపాక్షిక చర్చలకు సిద్ధమని ప్రకటించారు. శాంతి చర్చలు విఫలమైతే మధ్యవర్తిత్వం నుంచి వైదొలుగుతానని ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దీంతో ఒత్తిడిలో ఉన్న పుతిన్ ద్వైపాక్షిక చర్చలకు ఆఫర్ ఇచ్చారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శాంతి చర్చల ప్రతిపాదనకు పుతిన్ అంగీకరించి 30 రోజుల పాక్షిక యుద్ధ విరమణకు సమ్మతించారు. ఈ సమయంలో ఇరు దేశాల ఇంధన, విద్యుత్ కేంద్రాలపై దాడి చేయబోమని రష్యా అంగీకరించింది. ఉక్రెయిన్‌కు అమెరికా, యూరోపియన్ దేశాలు సరఫరా చేస్తున్న ఆయుధాలను వెంటనే నిలిపివేయాలని కూడా ఖరాఖండిగా చెప్పారు.
మంగళవారం ట్రంప్, పుతిన్ యుద్ధ విరమణపై సుదీర్ఘంగా ఫోన్‌లో చర్చించారు. దీని ఫలితంగా ఉక్రెయిన్ ఇంధన, విద్యుత్ కేంద్రాలపై దాడి చేయబోమని రష్యా అంగీకరించింది. యుద్ధ విరమణ సమయంలో ఉక్రెయిన్ తన బలాన్ని పెంచుకోకుండా, ఆయుధాలు సమకూర్చుకోకుండా, సైనికుల సంఖ్య పెంచుకోకుండా, ఉక్రెయిన్‌కు ఎలాంటి గూఢచర్య సమాచారం ఇవ్వకుండా అమెరికా చూసుకోవాలని పుతిన్ ಒత్తిడి చేశారని క్రెమ్లిన్ వర్గాలు తెలిపాయి.
శాంతికి తొలి అడుగు-అమెరికా
పుతిన్‌తో చర్చలు, వాటి ఫలితంపై శ్వేతసౌధం హర్షం వ్యక్తం చేసింది. ఇది శాంతికి తొలి అడుగు అని, పూర్తిస్థాయి యుద్ధ విరమణ, దీర్ఘకాలిక శాంతి స్థాపన కోసం అమెరికా ఎదురు చూస్తోందని తెలిపింది.
