వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ప్రపంచ నలుమూలల నుంచి సుమారు 2.5 లక్షల మందికి పైగా ప్రజలు, 130 విదేశీ ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కాగా కొత్త పోప్ ఎన్నిక ప్రక్రియ మొదలైంది.

పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు: పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు వెటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో గౌరవప్రదంగా జరిగాయి. ఏప్రిల్ 21న ఆయన అనారోగ్య కారణాలతో మరణించిన విషయం తెలిసిందే. శనివారం ఉదయం 10 గంటలకు (స్థానిక కాలమానం) ప్రారంభమైన అంత్యక్రియల్లో 2.5 లక్షలకు పైగా ప్రజలు పాల్గొన్నారు.

సాంప్రదాయాలకు భిన్నంగా

పోప్ ఫ్రాన్సిస్ ఎప్పుడూ సాదాసీదా జీవితాన్ని ఇష్టపడేవారు. అందుకే సాంప్రదాయ మూడు శవపేటికలకు బదులుగా చెక్క పేటికను ఉపయోగించారు. వాటికన్ న్యూస్ ప్రకారం, సామాన్యులకు కూడా పోప్ పార్థివ దేహాన్ని చూసే అవకాశం కల్పించారు. ఉదయం 10 గంటలకు పార్థివ దేహాన్ని సెయింట్ పీటర్స్ బాసిలికా ముందు ఉంచారు. కార్డినల్ జియోవన్నీ బాటిస్టా రే అంత్యక్రియల కార్యక్రమాన్ని నిర్వహించారు.

సాంతా మారియా మాగ్గియోరీలో సమాధి

పోప్ ఫ్రాన్సిస్ తన కోరిక మేరకు సెయింట్ పీటర్స్ బాసిలికాకు బదులుగా రోమ్‌లోని సాంతా మారియా మాగ్గియోరీ బాసిలికాలో సమాధి అయ్యారు. ఆయన ప్రతి విదేశీ పర్యటనకు ముందు, తర్వాత ప్రార్థించే సలుస్ పోపులి రోమనీ చిత్రపటం దగ్గరే ఆయన సమాధి ఉంది. లిగురియన్ మార్బుల్‌తో తయారు చేసిన సమాధిపై Franciscus అనే పేరు, గొర్రెల కాపరి శిలువ గుర్తును చెక్కారు.

కొత్త పోప్ ఎన్నిక ఎప్పుడు?

80 ఏళ్లలోపు ఉన్న 138 మంది కార్డినల్స్ వెటికన్‌లోని రహస్య సమావేశంలో కొత్త పోప్‌ను ఎన్నుకుంటారు. ⅔ వంతు ఓట్లు వచ్చే వరకూ ఈ ప్రక్రియ కొనసాగుతుంది. కొత్త పోప్ ఎన్నికను వెటికన్‌లోని సిస్టీన్ చాపెల్ నుంచి వెలువడే తెల్లని పొగ ద్వారా ప్రకటిస్తారు.

ప్రపంచ నాయకుల సందడి

అంత్యక్రియల్లో 130 విదేశీ ప్రతినిధులు పాల్గొన్నారు. వీరిలో 50 మంది దేశాధినేతలు, 10 మంది రాజులు ఉన్నారు. వీరితో పాటు 2.5 లక్షల మందికి పైగా ప్రజలు పాల్గొన్నారు.

  • భారతదేశం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
  • ఫ్రాన్స్: అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్
  • అమెరికా: మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మెలనియా ట్రంప్
  • బ్రిటన్: ప్రిన్స్ విలియం, ప్రధాని కీర్ స్టార్మర్
  • ఉక్రెయిన్: అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్స్కీ, ఒలేనా జెలెన్స్కా