- Home
- Technology
- Tech News
- starlink: మస్క్ మామ ఎంట్రీ కన్ఫామ్.. ఇండియాలో శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్, ధరలు ఎలా ఉంటాయో తెలుసా?
starlink: మస్క్ మామ ఎంట్రీ కన్ఫామ్.. ఇండియాలో శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్, ధరలు ఎలా ఉంటాయో తెలుసా?
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఎప్పటి నుంచో చేస్తున్న ప్రయత్నాలు ఓ కొలిక్కి వస్తున్నాయి. భారత్‌లో స్టార్ లింక్ ఇంటర్నెట్ సేవలను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్న మస్క్‌కు ఎట్టకేలకు అనుమతులు లభించాయి.
- FB
- TW
- Linkdin
Follow Us
)
లైసెన్స్ మంజూరు
భారత టెలికం శాఖ నుంచి స్టార్‌లింక్‌కి అవసరమైన లైసెన్స్ మంజూరైంది. దీంతో ఇప్పటికే అనుమతులు పొందిన భారతి గ్రూప్‌కు చెందిన OneWeb, రిలయన్స్ జియోల తర్వాత భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందించేందుకు లైసెన్స్ పొందిన మూడవ సంస్థగా స్టార్‌లింక్ నిలిచింది.
కమ్యూనికేషన్స్ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రకటన
కమ్యూనికేషన్స్ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మీడియాతో మాట్లాడుతూ, "స్టార్‌లింక్‌కి లైసెన్స్ మంజూరైంది. తరువాతి దశలో స్పెక్ట్రమ్ కేటాయింపు ఉంటుంది. అప్పుడే శాటిలైట్ టెలికాం సేవలు దేశవ్యాప్తంగా వేగంగా అందుబాటులోకి వస్తాయి" అని తెలిపారు.
గతంలో దేశంలో ఫిక్స్‌డ్ లైన్ (Fixed Line) టెలిఫోన్లు మాత్రమే ఉండేవి. తరువాత మొబైల్, బ్రాడ్‌బ్యాండ్, ఆప్టికల్ ఫైబర్ వంటి ఆధునిక టెక్నాలజీలు వచ్చాయి. ఇప్పుడు శాటిలైట్ ఇంటర్నెట్ కూడా చేరడం చాలా కీలకం కానుందని మంత్రి తెలిపారు.
కేబుల్స్ వేయడం ఇబ్బందిగా ఉండే కొండప్రాంతాలు, అటవీ ప్రాంతాలు, మారుమూల గ్రామాలు వంటి చోట్ల కూడా శాటిలైట్ ఇంటర్నెట్ ద్వారా కనెక్టివిటీ ఇవ్వవచ్చు అని మంత్రి చెప్పుకొచ్చారు.
అసలేంటీ స్టార్ లింక్, ఎలా పనిచేస్తుంది.?
స్టార్‌లింక్ అనేది స్పేస్‌ఎక్స్ సంస్థ రూపొందించిన శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవ. ఈ సేవలో, భూమికి చాలా దగ్గరగా (Low Earth Orbit - LEO) తిరిగే వేలాది చిన్న ఉపగ్రహాలు పనిచేస్తాయి. ఇవి కలసి ఒక నెట్‌వర్క్‌లా పని చేసి, ఇంటర్నెట్ సిగ్నల్స్‌ను భూమిపైకి పంపిస్తుంటాయి.
ఈ టెక్నాలజీ ద్వారా, బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ అందని మారుమూల ప్రాంతాలకు కూడా హై-స్పీడ్ ఇంటర్నెట్‌ను అందించడం స్టార్‌లింక్ ప్రధాన లక్ష్యం. అడవులు, కొండప్రాంతాలు, గ్రామాలు లాంటి ప్రదేశాల్లో సాధారణ బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందడం కష్టంగా మారుతుంది. అలాంటి చోట కూడా స్టార్‌లింక్ అత్యంత ఉపయోగకరంగా మారుతుంది.
ధరలు ఎలా ఉంటాయి.?
ప్రస్తుతం అమెరికాలో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. అక్కడ రెసిడెన్షియల్ ప్లాన్ ఖర్చు: నెలకు సుమారు $80 (దాదాపు ₹6,800), హార్డ్‌వేర్ కిట్ (ఉపయోగించడానికి అవసరమైన పరికరాలు): ఒకేసారి $349 (దాదాపు ₹29,700), రోమింగ్ ప్లాన్‌లు (ప్రయాణాల కోసం): నెలకు $50 (దాదాపు ₹4,200) ఉన్నాయి.
భారత్‌లో ధరలు ఎలా ఉండనున్నాయి.?
భారత్‌లో ఛార్జీలు ఎలా ఉంటాయన్న దానికి సంబంధించి స్టార్‌లింక్ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ఓ అంచనా ప్రకారం భారత వినియోగదారులకు నెలవారీ ప్లాన్లు కేవలం 10 డాలర్లు, అంటే సుమారు రూ.850కే ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
లాంచింగ్ ఆఫర్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ డేటాను కూడా అందించే యోచనలో కంపెనీ ఉన్నట్లు సమాచారం. మరి ఇండియన్ మార్కెట్లో మస్క్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో చూడాలి.