ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో పాకిస్తాన్ తప్పుడు ప్రచారాన్ని జర్నలిస్ట్ నూరానీ వెలుగులోకి తీసుకువచ్చారు, భారత సైన్యం ఆధారాలతో నిదర్శనాలు చూపించింది.

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారతదేశం చేపట్టిన ప్రతీకార చర్య ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో భారత్–పాకిస్తాన్ సంబంధాలు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఇదే సమయంలో పాకిస్తాన్ జర్నలిస్ట్ అహ్మద్ నూరానీ రూపొందించిన వీడియో ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఆ వీడియోలో ఆయన, ఆపరేషన్ సిందూర్‌ సందర్భంగా భారత్‌కు నష్టమని పాకిస్తాన్ చేస్తున్న ఆరోపణలు నిరాధారమని స్పష్టంగా పేర్కొన్నారు. భారత్ మాత్రం తన వైపు నుంచి జరిగిన దాడులపై ఆధారాలతో నిదర్శనలు చూపించినప్పటికీ, పాకిస్తాన్ మాత్రం ఖచ్చితమైన ఆధారాలు లేకుండానే తప్పుడు ప్రచారంలో నిమగ్నమైందని అన్నారు.ఇక పాకిస్తాన్ ఈ దాడుల్లో గణనీయమైన నష్టాన్ని చవిచూసిందని కూడా నూరానీ పేర్కొన్నారు. దాడుల్లో అనేక మంది పాకిస్తానీయులు మరణించినట్లు వెల్లడించారుఇక భారత ప్రభుత్వం కూడా తాము చేపట్టిన దాడులపై ఉపగ్రహ చిత్రాలు, వీడియో ఫుటేజ్, గణాంకాలతో కూడిన స్పష్టతనిచ్చే సమాచారం మీడియా ముందు ఉంచింది. కానీ పాకిస్తాన్ మాత్రం ఈ దృష్టిలో స్పష్టత ఇవ్వలేక, నమ్మదగిన ఆధారాలేమీ చూపలేకపోయింది.

పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మీడియాతో మాట్లాడుతూ ఐదు భారత యుద్ధవిమానాలను కూల్చివేశామని చెప్పారు. కానీ ఆయన ఆధారంగా చూపించింది భారత సోషల్ మీడియాలోని పోస్ట్‌లను మాత్రమే. అంతేకాదు, ఈ విమానాల శకలాలు కాశ్మీర్‌లో కనిపించాయని చెప్పారు గానీ, ఎటువంటి అధికారిక లేదా భౌతిక ఆధారాలు మాత్రం చూపలేకపోయారు.భారత్ వైమానిక స్థావరాలపై దాడులకు సంబంధించిన పాకిస్తాన్ ఆరోపణలను భారత ప్రభుత్వం పూర్తిగా ఖండించింది. భారత్ వైమానిక దళంలోని వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మాట్లాడుతూ, ఇది పూర్తిగా అబద్ధమైన ప్రచారమని, పాకిస్తాన్ ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం పెడుతోందని తెలిపారు.

భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, ఆర్మీ కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ సంయుక్తంగా నిర్వహించిన మీడియా సమావేశంలో పాకిస్తాన్ చేస్తున్న అబద్ధాలను సాక్ష్యాలతో బయటపెట్టారు. దెబ్బతిన్న స్థావరాల రియల్ టైమ్ చిత్రాలను చూపిస్తూ అసలు యుద్ధ వాస్తవాలు వివరించారు.

ఆపరేషన్ సిందూర్ ముగిసిన మరుసటి రోజే భారత సాయుధ దళాలు మీడియా సమావేశం నిర్వహించాయి. ఆర్మీ తరఫున లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, ఎయిర్ ఫోర్స్ తరఫున ఎయిర్ మార్షల్ ఎకె భారతి, నేవీ తరఫున వైస్ అడ్మిరల్ ఎఎన్ ప్రమోద్ పాల్గొన్నారు.వీరి ప్రకారం, మే 7 నుండి 10 వరకూ జరిగిన కాల్పుల్లో 35 నుండి 40 మంది పాకిస్తాన్ సైనికులు హతమయ్యారు. అలాగే మే 7వ తేదీ ఉదయం భారత దళాలు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకొని దాడులు జరిపాయి. ఇందులో 100 మందికిపైగా ఉగ్రవాదులు మృతి చెందినట్లు సమాచారం.

అంతేకాక, IC-814 హైజాకింగ్, పుల్వామా దాడిలో ప్రమేయం ఉన్న పలు అగ్ర ఉగ్రవాదులను భారత సైన్యం హతమార్చినట్టు వెల్లడించారు. భారత ఎయిర్ ఫోర్స్ అనేక పాకిస్తాన్ జెట్‌లను కూల్చిందని ఎయిర్ మార్షల్ భారతి చెప్పారు. అయితే విమానాల ఖచ్చితమైన సంఖ్య మాత్రం వెల్లడించలేదు.ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న భారతీయ పైలట్లు సురక్షితంగా తిరిగివచ్చినట్టు చెప్పారు. మొత్తం మీద పాకిస్తాన్ చేసిన తప్పుడు ప్రచారం గట్టిగా ఎదుర్కొంటూ భారత్ స్పష్టమైన ఆధారాలతో నిజాలను ప్రపంచానికి చూపించగలిగింది.