అమెరాకాతో పాకిస్థాన్ ప్రస్తుతం సత్సంబంధాలు కొనసాగిస్తోంది. దీని ఫలితం ప్రపంచ దేశాలపై ఎలా ఉంటుంది..? అనే ఆసక్తికర కథనాన్ని స్వస్తి సచ్దేవ్, ముగ్దా సత్ప్యూట్ ఇక్కడ అందించారు.
వ్యాసకర్త : స్వస్తి సచ్దేవ్, ముగ్దా సత్ప్యూట్
మే 2025 నుండి పాకిస్థాన్, అమెరికా మధ్య సంబంధాలు వేగవంతమైన మార్పులకు లోనయ్యాయి. ఈ సయోధ్య వెనుక అనేక అంశాలు ఉన్నాయి... ముఖ్యంగా పాకిస్థాన్‌లోని ఎనర్జీ, చమురు నిల్వలపై అమెరికాకు ఉన్న ఆసక్తి... బగ్రామ్ ఎయిర్‌బేస్ తో పాటు ఆఫ్ఘానిస్థాన్‌లో ఇతర అంశాలపై దృష్టి పెట్టడం.. అలాగే పశ్చిమ ఆసియాలో భద్రతా ఆందోళనలు పాకిస్థాన్-అమెరికాలను దగ్గర చేశాయి. మే 2025లో భారత్‌తో జరిగిన ఘర్షణ తర్వాత కుదిరిన కాల్పుల విరమణకు అమెరికానే కారణమని పాకిస్థాన్ పేర్కొంది... దీనివల్ల వాషింగ్టన్‌లో పాకిస్థాన్‌కు గుర్తింపు లభించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రత్యేక విదేశీ విధానం, భారత్‌తో అమెరికాకు ఉన్న సంక్లిష్టమైన సంబంధాలు పాకిస్థాన్-అమెరికా బంధాన్ని మరింత బలోపేతం చేశాయి.
దీని ఫలితంగా పాకిస్థాన్ నాయకులు తరచూ వాషింగ్టన్‌లో పర్యటిస్తున్నారు... ముఖ్యంగా ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టినప్పటి నుండి మూడుసార్లు అమెరికా రాజధానిని సందర్శించారు. అమెరికా కూడా 'బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ' (BLA)ని ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది, ఇరుపక్షాలు ఒక వాణిజ్య ఒప్పందంపై అవగాహనకు వచ్చాయి. అదనంగా ట్రంప్ కుటుంబ సభ్యులు స్ధాపించిన 'వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్' అనే ఫిన్‌టెక్ కంపెనీ పాకిస్థాన్ క్రిప్టో కౌన్సిల్‌తో క్రిప్టోకరెన్సీ ఒప్పందంపై సంతకం చేసింది. అగ్రశ్రేణి అమెరికన్ నాయకులు పాకిస్థాన్ ఇంధన, ఖనిజ వనరులపై ఆసక్తి వ్యక్తం చేశారు... పెట్టుబడి అవకాశాలను కోరారు, దీనిని ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో భాగస్వామిగా చూస్తున్నారు. అంతేకాకుండా అమెరికా కాంగ్రెస్‌కు సమర్పించిన ఇటీవలి రిపోర్ట్స్ మే నెలలో భారత్‌తో జరిగిన ఘర్షణను పాకిస్థాన్‌కు లభించిన "సైనిక విజయం"గా అభివర్ణించింది, ఇది వాషింగ్టన్ మారుతున్న దృక్పథాన్ని స్పష్టం చేస్తోంది.
అమెరికాతో సంబంధాలను పునర్నిర్మించుకోవడానికి పాకిస్థాన్ వేగంగా అడుగులు వేస్తున్నప్పటికీ... అది ఒక ఒడిదుడుకుల మార్గంలో ప్రయాణిస్తోంది. ఇది పశ్చిమ ఆసియాలోని పొరుగు దేశాలు మరీముఖ్యంగా చైనాతో దాని సంబంధాలపై ప్రభావం చూపవచ్చు. ఇస్లామాబాద్‌కు ఆ దేశాలతో వ్యూహాత్మక, సైద్ధాంతిక, చారిత్రక సంబంధాలు ఉన్నాయి, కాబట్టి ఇటీవలి పరిణామాలు ఆ సంబంధాలను ఇబ్బందుల్లో నెట్టవచ్చు. చైనాకు అమెరికాతో తీవ్ర విభేదాలు ఉన్నప్పటికీ, పశ్చిమ ఆసియా దేశాల ప్రతిస్పందన భిన్నంగా ఉండవచ్చు లేదా తటస్థంగా ఉండవచ్చు.
పాకిస్థాన్‌లో బీజింగ్ ప్రభావం బహుముఖంగా, లోతుగా ఉంది. ప్రస్తుతానికి పాకిస్థాన్-అమెరికా సంబంధాల పట్ల చైనా అంతగా ఆందోళన చెందుతున్నట్లు కనిపించడం లేదు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక పర్యటనలు కొనసాగుతున్నందున వారి సాంప్రదాయ స్నేహం చెక్కుచెదరకుండా ఉంది, అయితే భవిష్యత్తులో చైనా కొంత అప్రమత్తతను ప్రదర్శించవచ్చు. ప్రస్తుతానికి BLAను అమెరికా ఉగ్రవాద సంస్థగా ప్రకటించడం వల్ల చైనాకు ప్రయోజనం కలగవచ్చు, ఎందుకంటే వాయువ్య పాకిస్థాన్‌లో చైనా మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, పౌరులు తరచుగా ఆ సమూహం ద్వారా లక్ష్యంగా చేసుకోబడుతున్నారు. పోటీ పడటానికి బదులుగా ఈ రెండు దేశాలు (అమెరికా, చైనా) ఈ ప్రాంతంలో ఒక తాత్కాలిక సురక్షిత ప్రాంతాన్ని సృష్టించడం లక్ష్యంగా పెట్టుకోవచ్చు. అంతేకాకుండా వాషింగ్టన్‌తో ఇస్లామాబాద్‌కు పెరుగుతున్న సంబంధాలు వైట్ హౌస్‌తో దౌత్యపరమైన చర్చలు జరపడానికి బీజింగ్‌కు ఒక నమ్మకమైన మార్గంగా ఉపయోగపడవచ్చు. అయితే ఆఫ్ఘనిస్థాన్‌లో అమెరికా ప్రాబల్యం పెరగడానికి పాకిస్థాన్ సహాయం చేస్తే మాత్రం బీజింగ్ కచ్చితంగా అసహనానికి గురవుతుంది. అమెరికా ఉపసంహరణ తర్వాత కాబూల్‌పై తన ప్రభావాన్ని పెంచుకోవాలని చైనా ప్రయత్నిస్తోంది. అలాగే ఇటీవలి చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (CPEC) ప్రాజెక్టులపై వ్యక్తమవుతున్న సందేహాల నేపథ్యంలో పాకిస్థాన్ ఆర్థిక, రక్షణ రంగాల్లో అమెరికాపై ఆధారపడటం పెరిగితే చైనా అసౌకర్యానికి గురవుతుంది.
పశ్చిమ ఆసియా దేశాల విషయానికొస్తే, పాకిస్థాన్-అమెరికా మధ్య చోటుచేసుకుంటున్న పరిణామాలు ఇంకా చూడాల్సి ఉంది. గల్ఫ్ దేశాలు ముఖ్యంగా సౌదీ అరేబియా, యూఏఈలు దీనిని ఇరాన్‌ను సమతుల్యం చేయడానికి, ఆర్థిక సహకారాన్ని పెంచుకోవడానికి ఒక అవకాశంగా చూడవచ్చు. అదనంగా ఇటీవలి "వ్యూహాత్మక పరస్పర రక్షణ ఒప్పందం" (Strategic Mutual Defence Agreement)పై సంతకం చేయడంతో పాకిస్థాన్, సౌదీ అరేబియా తమ సుదీర్ఘ మతపరమైన, రాజకీయ, ఆర్థిక, రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేసుకున్నాయి. హౌతీల సామర్థ్యాలు, ఖతార్‌పై ఇటీవలి ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఈ రక్షణ ఒప్పందం రియాద్‌కు చాలా ముఖ్యం, అదే సమయంలో పాకిస్థాన్‌కు అవసరమైన ఆర్థిక ఉపశమనాన్ని కూడా అందిస్తుంది. ఇది ఈ ప్రాంతంలో ఒక విశ్వసనీయ భద్రతా ప్రదాతగా ఇస్లామాబాద్ ఎదుగుతున్న పాత్రను హైలైట్ చేస్తోంది, దీనికి అమెరికా సపోర్ట్ కూడా ఉంది.
మరోవైపు, పాకిస్థాన్-అమెరికా సంబంధాల పట్ల ఇరాన్ కచ్చితంగా అప్రమత్తంగా ఉంది. వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య ఉన్న చారిత్రక విభేదాలు అధ్యక్షుడు ట్రంప్ హయాంలో మరింత పెరిగాయి, ముఖ్యంగా ఇరాన్ అణు మౌలిక సదుపాయాలపై ఇటీవలి అమెరికా వైమానిక దాడుల వల్ల ఇవి తీవ్రమయ్యాయి. పాకిస్థాన్ ఆ దాడులను ఖండించినప్పటికీ ఇరాన్‌తో తన సరిహద్దును మూసివేసింది. ఒకవైపు ఈ పరిణామాలు టెహ్రాన్, వాషింగ్టన్ మధ్య దౌత్య మార్గాన్ని కనుగొనడానికి సహాయపడవచ్చు. మరోవైపు సంబంధాలు మరింత బలపడితే ఇరాన్‌పై అమెరికా ఆంక్షలకు లోబడాలని పాకిస్థాన్‌పై ఒత్తిడి పెరగవచ్చు, ఇది గతంలో అమెరికా వ్యతిరేకించిన పాకిస్థాన్-ఇరాన్ గ్యాస్ పైప్‌లైన్ ప్రాజెక్టును దెబ్బతీయవచ్చు. అలాగే అమెరికాకు పాకిస్థాన్ సాంప్రదాయకంగా ముఖ్యమైన ఇంటెలిజెన్స్, సైనిక భాగస్వామి కావడంతో, సుదీర్ఘమైన పాకిస్థాన్-ఇరాన్ సరిహద్దులో అమెరికా ఉనికి పెరిగే అవకాశం ఉంది.
టర్కీకి కూడా ఇటీవలి పాకిస్థాన్-అమెరికా పరిణామాలు ముఖ్యమైనవి. ఇస్లామాబాద్‌తో అంకారాకు ఉన్న సోదర సంబంధాలు, మే నెలలో భారత్‌తో జరిగిన ఘర్షణ సమయంలో అందించిన సైనిక సపోర్ట్, వాణిజ్య, రక్షణ రంగాలలో కుదుర్చుకున్న 20కి పైగా ఒప్పందాల ద్వారా స్పష్టమవుతున్నాయి. బైడెన్ హయాంలో అమెరికాతో దూరమైన సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి అధ్యక్షుడు ట్రంప్ రెండో టర్మ్ టర్కీకి ఒక ఆశగా కనిపిస్తోంది. అయితే ఈ పరిణామాలు ఆ ప్రాంతంలో టర్కీ రాజీ వైఖరిని సవాలు చేస్తున్నాయి. మొత్తంమీద వాషింగ్టన్ అధికార వర్గాల్లో పాకిస్థాన్ ప్రాబల్యం పెరగడం వల్ల ఆ ప్రాంతంలో దాని ప్రభావం పెరిగి, ఇస్లామిక్ ప్రపంచానికి, పాశ్చాత్య దేశాలకు మధ్య ఒక వారధిగా నిలిచే అవకాశం ఉంది.
పాకిస్థాన్‌కు ఇటువంటి విదేశీ విధాన జూదాలు కొత్తేమీ కాదు. భారత్ లాగే పాకిస్థాన్ కూడా అనేక విదేశీ విధాన వైరుధ్యాలను, అంతర్జాతీయ సమతుల్యతలను ఎదుర్కొంది. కోల్డ్ వార్ దీనికి ఒక ఉదాహరణ, ఆ సమయంలో అమెరికాతో వ్యూహాత్మక సంబంధాలను కొనసాగిస్తూనే చైనాతో సంబంధాలను బలోపేతం చేసుకుంది. ఇప్పుడు 'కొత్త ప్రచ్ఛన్న యుద్ధం' అని పిలువబడుతున్న కాలంలో కూడా పాకిస్థాన్ అదే విధానాన్ని అనుసరించాలని చూస్తోంది. అంతేకాకుండా క్షీణిస్తున్న ఆర్థిక వ్యవస్థ, పాత భాగస్వామ్య దేశాల నుండి ఎదురవుతున్న వీసా నిషేధాల నేపథ్యంలో ఇస్లామాబాద్ తన బహుళజాతి ఒప్పందాల ద్వారా మరింత ఆర్థిక సహాయాన్ని ఆశిస్తోంది. కాబట్టి ఈ పెరుగుతున్న సంబంధాల వల్ల కొన్ని దేశాలతో స్వల్ప ఇబ్బందులు ఉన్నప్పటికీ, మొత్తంగా ఇవి ప్రపంచంలో పాకిస్థాన్ స్థాయిని పెంచడానికి, మరిన్ని ఆర్థిక, రక్షణ అవకాశాలను అందించడానికి సహాయపడతాయి.


