India-Pakistan war tensions: పహల్గాం దాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. భారత్ తో యుద్ధ భయంతో పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో (PoK) ప్రభుత్వం రెండు నెలల నిత్యావసరాలు నిల్వ చేయాలని ఆదేశించింది. ముజఫరాబాద్‌లో ఆహార ధాన్యాలు, పిండి సంచులు ట్రక్కులపై ఎక్కిస్తున్న దృశ్యాలు వైరల్ గా మారాయి.
India-Pakistan war tensions: ఏప్రిల్ 22న పహల్గాం వద్ద జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. దాడికి పాల్పడింది పాక్-ఆధారిత ఉగ్రవాదులని భారత నిఘా వర్గాలు గుర్తించాయి. దాడి అనంతరం భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు అధికమయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK) ప్రభుత్వం యుద్ధ భయంతో అత్యవసర చర్యలు చేపట్టింది. రెండు నెలలకు సరిపడా ఆహార పదర్థాలు నిల్వ చేసుకోవాలంటూ సరిహద్దు ప్రాంతాల ప్రజలకు ఆదేశాలు జారీ చేసింది పాక్ సర్కారు.
ముజఫరాబాద్‌లో ఉన్న ఆహార మిల్లుల వద్ద ఆహార ధాన్యాలు, పిండి సంచులు ట్రక్కులపై ఎక్కిస్తున్న దృశ్యాలు వైరల్ గా మారాయి. అలాగే, ప్రజల్లో ఆందోళనలను పెంచుతున్నాయి. రాయిటర్స్ ప్రకారం.. ఇది వరకు నిత్యావసరాలను ఒక నెల వరకు నిల్వ చేసుకోవాలనే ఆదేశాలు ఉండగా, ఇప్పుడు రెండు నెలలకు పెంచారు.
తాజాగా యుద్ధ భయంతో పాకిస్తాన్ తీసుకున్న చర్యలు గమనిస్తే..
1. నియంత్రణ రేఖ (LoC) వద్ద నివసించే ప్రజలకు నిత్యావసరాల నిల్వ చేయాలని ఆదేశాలు.
2. బ్లూ వ్యాలీ, ఇతర LoC సరిహద్దు ప్రాంతాలకు పర్యాటకులను అనుమతించకుండా నిషేధించారు.
3. 1,000కి పైగా మతపాఠశాలలు (మదరస్సాలు) తదుపరి ఆదేశాల వరకు సెలవులు ప్రకటించారు.
3. 1 బిలియన్ రూపాయల విలువ చేసే ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఫండ్ ఏర్పాటు చేసింది.
4. ముఖ్యమైన ప్రాంతాల్లో రహదారుల సంరక్షణ కోసం ప్రైవేట్, ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపట్టింది.
5. సివిల్ డిఫెన్స్ బలగాలు హై అలర్ట్ ఉంచారు.
6. ప్రజలకు అత్యవసర సహాయం కోసం 1122 రిస్క్యూ హెల్ప్‌లైన్ అందుబాటులోకి తెచ్చారు.
యుద్ధ భయంతో బయటపడ్డ రాజకీయ రంగు.. భారత్ పై విషం
ఉగ్రవాదులకు మద్దతుగా ఉంటూనే పాకిస్తాన్ తమది తప్పులేదని వాదనలు చేస్తోంది. ఇదే సమయంలో భారత్ పై తప్పుడు ప్రచారాలు మొదలుపెట్టింది. ఆ పాక్ రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు భారత్ ను మరింత రెచ్చగొట్టే విధంగా కామెంట్స్ చేస్తున్నారు.
ఉగ్రవాదంపై పోరులో తగ్గేదే లే అంటున్న భారత్
ఉగ్రవాదంపై వెనక్కి తగ్గేదేలే అంటూ భారత్ చర్యలు తీసుకుంటోంది. ఉగ్రవాదులకు అండగా ఉంటున్న పాక్ తో అన్ని సంబంధాలు కట్ చేసుకుంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ సైన్యానికి పూర్తి ఆపరేషనల్ స్వేచ్ఛను ఇచ్చారు. దీంతో గతంలో మాదిరిగా ఉదాహారణకు 2016 ఉరి సర్జికల్ స్ట్రైక్, 2019 బాలాకోట్ ఎయిర్‌స్ట్రైక్ వంటి చర్యలు తిరిగి పునరావృతం అయ్యే అవకాశం ఉందని పాక్ లో భయాందోళనలు ఉన్నాయి.


