భారత్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ వరుస క్షిపణి పరీక్షలు నిర్వహిస్తోంది  తాజాగా ఫతహ్ క్షిపణిని ప్రయోగించింది... దీని టార్గెట్ రేంజ్ ఎంతో తెలుసా? 

India Pakistan: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు దాడుల తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఇరుదేశాల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ వరుసగా క్షిపణి పరీక్షలు చేపడుతోంది. గత శనివారం అబ్దాలీ క్షిపణిని పరీక్షించగా తాజాగా ఫతహ్ క్షిపణిని పరీక్షించింది.

ఫతహ్ మిస్సైల్ ప్రత్యేకతలేంటి...

పాకిస్తాన్ సోమవారం పరీక్షించిన ఫతహ్ మిస్సైల్ ఉపరితలం నుంచి ఉపరితలానికి దాడి చేస్తుంది. దీని పరిధి 120 కి.మీ. ఫతేహ్ పాకిస్తాన్ స్వదేశీంగా అభివృద్ధి చేసిన మిస్సైల్ అని చెబుతున్నారు. సంప్రదాయ వార్‌హెడ్‌లను మోసుకెళ్లి, తక్కువ దూరంలో ఉన్న లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించేలా దీన్ని రూపొందించారు.

ఇంతకు ముందు పాకిస్తాన్ సైన్యం 450 కి.మీల పరిధి కలిగిన ఉపరితలం నుంచి ఉపరితలానికి దాడి చేసే అబ్దాలీ మిస్సైల్‌ను పరీక్షించింది. మిస్సైల్ అధునాతన నావిగేషన్ వ్యవస్థ, ఇతర సాంకేతిక సామర్థ్యాలను పరీక్షించామని తెలిపింది.

ఫతహ్ మిస్సైల్ నావిగేషన్ వ్యవస్థ 

పాకిస్తాన్ ఈ మిస్సైల్ పరీక్షను తన సైనిక విన్యాసం 'ఎక్సర్‌సైజ్ ఇండస్'లో భాగంగా నిర్వహించింది. మిస్సైల్ పరీక్ష ఉద్దేశం సంసిద్ధంగా ఉండటం, కీలక సాంకేతిక సామర్థ్యాలను ధృవీకరించడమేనని పాకిస్తాన్ సైన్యానికి చెందిన మీడియా విభాగం ISPR (ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్) ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో మిస్సైల్ అధునాతన నావిగేషన్ వ్యవస్థ, మెరుగైన ఖచ్చితత్వం కూడా ఉన్నాయి.

భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత

పహల్గాంలో జరిగిన దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. దాడికి ప్రతిస్పందించేందుకు భారత సైన్యానికి పూర్తి స్థాయి స్వేచ్ఛ ఇచ్చినట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. దీంతో పాకిస్తాన్ హై అలర్ట్‌లో ఉంది. భారత్ ఎప్పుడైనా దాడి చేయవచ్చని పాకిస్తాన్ భయపడుతోంది.