పహల్గాం దాడి తర్వాత భారత్ కఠిన చర్యలు తీసుకోవడంతో పాకిస్తాన్ లో టెన్షన్ నెలకొంది. సైన్యాధిపతి ఆసిమ్ మునీర్ కుటుంబంతో సహా మిస్సింగ్ అయినట్లు తెలుస్తోంది. 

Islamabad: పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ కఠిన చర్యలు తీసుకుంటుండటంతో పాకిస్తాన్ లో టెన్షన్ పెరిగిపోయింది. భారత్ చర్యలతో పాకిస్తాన్ కంగారు పడుతోంది. ఈ నేపథ్యంలో పాక్ సైన్యాధిపతి జనరల్ ఆసిమ్ మునీర్ కుటుంబంతో సహా మిస్సింగ్ అయ్యారనే వార్తలు వస్తున్నాయి. ఆయన తన కుటుంబాన్ని ప్రైవేట్ విమానంలో బ్రిటన్ లేదా న్యూజెర్సీకి పంపించినట్లు ప్రచారం జరుగుతోంది. 

ఇలా పాక్ ఆర్మీ చీఫ్ కనిపించడంలేదన్న వార్తలపై ఆ దేశ ప్రధాని కార్యాలయం స్పందించింది. ఆయన ఎక్కడికీ పోలేదు... దేశంలోనే ఉన్నాడని సూచించేలా ప్రధాని మహ్మద్ షహబాజ్ షరీఫ్ తో ఆర్మీ చీఫ్ మునీర్, ఇతర ఆర్మీ అధికారులు దిగిన గ్రూప్ ఫోటోను ఎక్స్ వేదికన పోస్ట్ చేసింది. దీంతో పాక్ ఆర్మీ చీఫ్ మిస్సింగ్ ప్రచారానికి తెరదించే ప్రయత్నం చేసింది పిఎంవో. 

Scroll to load tweet…

మునీర్ విద్వేశపూరిత కామెంట్స్ :

ఇటీవల పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ సంచలన కామెంట్స్ చేసారు. పాకిస్థాన్ కు కశ్మీర్ జీవనాడి అని... దానికోసం ఎంతకైనా సిద్దమే అంటూ రెచ్చగొట్టేలా మాట్లాడారు. కశ్మీర్ విషయంలో తమ వైఖరి చాలా స్పష్టంగా ఉందన్నారు పాక్ ఆర్మీ చీఫ్. ఇలా అతడు విద్వేషపూరిత కామెంట్స్ చేసినతర్వాత పహల్గాంలో ఉగ్రదాడి జరిగింది.

విదేశాల్లో నివసిస్తున్న పాకిస్థానీల గురించి మునీర్ మాట్లాడుతూ... వారు దేశానికి రాయబారులని అన్నారు. వారు "ఉన్నతమైన భావజాలం, సంస్కృతి"కి చెందినవారని మర్చిపోకూడదని అన్నారు. “మీ పిల్లలకు పాకిస్థాన్ కథను తప్పకుండా చెప్పాలి. మన పూర్వీకులు హిందువులతో ప్రతి అంశంలోనూ భిన్నంగా ఉన్నామని భావించారు. మన మతాలు, మన ఆచారాలు, సంప్రదాయాలు, ఆలోచనలు, ఆశయాలు భిన్నమైనవి. అదే ద్విజాతి సిద్ధాంతానికి పునాది” అని మునీర్ పేర్కొన్నారు.

ఇలా పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ లాంటివారి రెచ్చగొట్టే మాటలే పహల్గాం వంటి ఉగ్రదాడులకు కారణం అవుతున్నాయనే వాదన ఉంది. భారతదేశం 'హిందు ముస్లిం భాయి భాయి' అనే విధానాన్ని పాటిస్తుంటే పాకిస్థాన్ మాత్రం హిందు, ముస్లింలను శత్రువులుగా చూపిస్తోందని అంటున్నారు. అందువలే పహల్గాంలో కేవలం హిందువులనే టార్గెట్ గా చేసుకుని దాడులు జరిగాయని చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

భారత్ దూకుడు... పాకిస్థాన్ పరేషాన్ :

పహల్గాం దాడి జరిగిన 48 గంటల్లోనే భారత్ ఐఎన్ఎస్ సూరత్ యుద్ధనౌక నుంచి క్షిపణి పరీక్ష చేసి అరేబియా సముద్రంలో శత్రువులకు గట్టి వార్నింగ్ ఇచ్చింది. భారత నౌకాదళ యుద్ధనౌక క్షిపణి దాడితో సముద్రంలోని టార్గెట్ ని ధ్వంసం చేసింది.

పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ అరేబియా సముద్రంలో కాల్పుల సాధన మొదలుపెట్టింది. దీనికి ప్రతిగా భారత్ ఐఎన్ఎస్ విక్రాంత్ నౌకను సముద్రంలోకి దింపింది. విక్రాంత్ లో మిగ్ 29కె, యుద్ధ విమానాలు ఎగురుతున్నాయి. దీంతో సముద్ర సరిహద్దుల్లో కూడా భారత వైమానిక దళం అప్రమత్తంగా ఉంది. 

సైనిక చర్యల ప్రత్యక్ష ప్రసారం వద్దు

పహల్గాం దాడి చేసిన ఉగ్రవాదులను పట్టుకోవడానికి భారత సైన్యం కార్యకలాపాలు ముమ్మరం చేసింది. సైనిక చర్యలను ప్రత్యక్ష ప్రసారం చేయవద్దని కేంద్రం మీడియాకు సూచించింది. ‘జాతీయ భద్రత దృష్ట్యా మీడియా, సోషల్ మీడియా వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. సున్నితమైన సమాచారాన్ని బయటపెడితే శత్రువులకు అప్రమత్తం అయ్యే అవకాశం ఉంది.

దీనివల్ల కార్యకలాపాలకు ఆటంకం కలుగుతుంది. భద్రతా సిబ్బందికి కూడా ఇబ్బంది ఉంటుంది. కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్ (సవరణ) నిబంధనలు-2021 ప్రకారం ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారం చేయడం నేరం’ అని కేంద్ర సమాచార, ప్రసార శాఖ తెలిపింది.