మూడు శవపేటికలు తెరిచి.. పుర్రెలు, ఎముకలకు ముద్దులు పెడుతూ లైవ్ స్ట్రీమ్ చేసిన వ్యక్తికి చైనాలో జైలుశిక్ష విధించారు.
చైనా : కొంతమంది కొన్ని రకాల పనులు ఎందుకు చేస్తారో తెలియదు. కేవలం లైకుల కోసం, వ్యూస్ కోసం విచిత్రమైన, ఒళ్లు గగుర్పొడిచే పనులు.. అసభ్యకరమైన పనులు చేస్తూ సమాజం నోళ్లలో నానుతుంటారు. అలాంటి విచిత్రమైన పని చేసి జైలు పాలయ్యాడు ఓ వ్యక్తి. లైవ్ స్ట్రీమింగ్ ద్వారా డబ్బు సంపాదించే ఆ వ్యక్తి.. ఓ పురాతన శ్మశానవాటికకు వెళ్లి.. అక్కడున్న మూడు శవపేటికలను తెరిచి.. అందులోని అస్థిపంజరాలకు ముద్దులు పెట్టాడు.
ఈ లైవ్ స్ట్రీమింగ్ వెలుగులోకి రావడంతో చైనాలో ఒక వ్యక్తికి తొమ్మిది నెలల జైలు శిక్ష విధించబడింది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం, గత సంవత్సరం మార్చిలో పురాతన గుయోలీ గుహ శ్మశానవాటికలో ఓ 21 ఏళ్ల వ్యక్తిని అనుమానాస్పదంగా గ్రామస్థులు పట్టుకున్నారు. చెన్ తన ఇద్దరు స్నేహితులతో అక్కడికి వెళ్లి.. ఆ స్మశానంలో ఉన్న మూడు శవపేటికలను తెరిచాడు. ఒక శవపేటిక నుండి ఎముకలను తీసి చూపిస్తూ.. తన వీడియోను ప్రత్యక్ష ప్రసారం చేశాడు. అంతేకాదు మరో రెండు శవపేటికల్లోని పుర్రెలను తీసి ముద్దాడుతూ కనిపించాడు.
ఇస్లామిక్ స్టేట్ టాప్ కమాండర్లను హతమార్చిన తాలిబాన్ బలగాలు.. ప్రకటించిన ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం
ముఖ్యంగా, ఇతను వీడియో తీసిన స్థలం మింగ్ రాజవంశం నాటిది. ఇక్కడే మియావో జాతి సమూహం "శవపేటిక గుహ"గా పిలిచే సాంప్రదాయక శ్మశానవాటిక ఉంది. 2015లో, గుయోలీ గుహ-శైలి ఖననం ప్రాంతీయ సాంస్కృతిక అవశేష రక్షణ ప్రదేశంగా గుర్తింపబడింది. ఈ వీడియో అన్మో అనే వీడియో ప్లాట్‌ఫారమ్‌లో కనిపించిన తర్వాత, ఫిబ్రవరి 16న లాంగ్లీ కౌంటీ పీపుల్స్ ప్రొక్యూరేటరేట్ అతనిపై అభియోగాలు మోపింది. మొదట్లో, పోలీసులు దీనిమీద అభియోగాలు మోపడానికి ఆసక్తి చూపలేదు.
అయితే సాంస్కృతిక అవశేషాలకు విఘాతం కలిగించాడని.. వాటిని రక్షించడంలో సహాయపడాలని న్యాయశాఖ అధికారులు పట్టుబట్టారు.''అలా మరొకరు చేయకుండా కఠినంగా చర్యలు తీసుకోవాలి. ఇలాంటివి సామాజిక వ్యవస్థకు, స్థానిక సాంస్కృతిక అవశేషాల రక్షణకు హాని కలిగిస్తాయి'' అని పోలీసులు చెప్పారు. ఆ వ్యక్తి సదరు శవపేటికల్లోని వారసులకు క్షమాపణలు చెప్పాడు.
ఈ సంఘటనపై చైనాలోని సోషల్ మీడియా వెబ్‌సైట్‌లలో నెటిజన్లు మండిపడుతున్నారు. "శవపేటికలను తెరవడం అనైతికమని సమాధి దొంగలకు కూడా తెలుసు. కానీ, ఏదైనా చేసి డబ్బులు సంపాదించాలనుకునే లైవ్ స్ట్రీమర్‌లకు బాటమ్ లైన్ ఉండదు" అని ఒక వ్యక్తి వ్యాఖ్యానించాడు.
