సారాంశం
భారత్ తో యుద్దానికి పాక్ ప్రభుత్వం, ఆర్మీనే కాదు ప్రజలు కూడా భయపడిపోతున్నారా? అంటే అవుననే వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంట్లో పాకిస్థాన్ ప్రజలు భారత్ తో యుద్దంపై ఏ అభిప్రాయం వ్యక్తంచేసారో తెలుసా?
India-Pakistan : India Pakistan : పహల్గాం ఉగ్రదాడితో భారత్ ను దెబ్బతీయాలన్న పాకిస్థాన్ కుట్రలు వారికే శాపంగా మారాయి. అమాయక టూరిస్టులపైకి ఉగ్రవాదులను ఉసిగొల్పిన పాక్ ను వదిలిపెట్టబోమని భారత్ అంటోంది. దీంతో పాక్ కు ఏం చేయాలో పాలుపోవడంలేదు... తప్పు చేసిన పాక్ వణికిపోతోంది. పాకిస్థాన్ ప్రభుత్వం, ఆర్మీ మాత్రమే కాదు అక్కడి ప్రజలు కూడా ఏ క్షణంలో భారత్ ఏం చేస్తుందోనన్న భయంలో ఉన్నారు. భారత్-పాక్ యుద్ధంపై పాక్‌లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టగా ఆసక్తికర విషయాలు బైటపడ్డాయి.
అపార సైనికబలం, ఆయుధ బలం కలిగిన భారత్‌తో యుద్ధానికి పాక్ ప్రజలు భయపడుతున్నారు. ఇస్లామాబాద్ ప్రజలతో ముస్లిం మతపెద్దల సమావేశంలో ఈ విషయం బైటపడింది. పాక్ పాలకులపై అక్కడి ప్రజల్లో తీవ్ర అసహనం పెరిగింది. భారత్ తో యుద్దం చేయాల్సివస్తే తాము ముందుకు రాలేమని ప్రజలు తెగేసి చెబుతున్నారు.
భారత్ తో యుద్దంపై పాక్ ప్రజల అభిప్రాయమిదే :
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం వస్తుందన్న భయాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ నుంచి ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇస్లామాబాద్‌లోని లాల్ మసీదులో మౌల్వి అబ్దుల్ అజీజ్ గాజీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ... యుద్ధం వస్తే పాకిస్తాన్‌కు మద్దతు ఇస్తారా అని అడిగారు. దీంతో అక్కడ నిశ్శబ్దం అలుముకుంది. ఎవరూ నోరెత్తలేదు. దీన్నిబట్టి పాకిస్థాన్ ప్రజలు భారత్ తో యుద్దాన్ని ఇష్టపడటం లేదని అర్థమవుతోంది.
వీడియోలో లాల్ మసీదులో చాలా మంది కనిపిస్తున్నారు. ఈ క్రమంలోనే మౌల్వి "భారత్-పాకిస్తాన్ యుద్ధం వస్తే మీలో ఎంతమంది పాకిస్తాన్‌కు మద్దతు ఇస్తారు? చేతులెత్తండి" అని అడిగారు. ఎవరూ చేతులెత్తకపోవడంతో "చాలా తక్కువ మంది ఉన్నట్టున్నారు. అంటే అవగాహన వచ్చినట్టే. భారత్-పాకిస్తాన్ యుద్ధం ఇస్లాం కోసం కాదు, జాతీయవాదం కోసం" అని అన్నారు.
భారత్ కంటే పాకిస్తాన్‌లోనే ఎక్కువ అణచివేత: మౌల్వి
మౌల్వి అబ్దుల్ అజీజ్ గాజీ మాట్లాడుతూ "పాకిస్తాన్‌లో దుర్మార్గపు పాలన ఉంది. భారత్‌లో కంటే పాకిస్తాన్‌లోనే ఎక్కువ అణచివేత ఉంది. లాల్ మసీదు లాంటి ఘటన భారత్‌లో జరిగిందా? బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తున్‌ఖ్వాలో జరుగుతున్న అణచివేత అక్కడ జరిగిందా? వాళ్ల సొంత యుద్ధ విమానాలు వాళ్ల ప్రజలపై బాంబులు వేశాయా? భారత్‌లో ఇంతమంది జనం మిస్సింగ్ అవుతున్నారా?" అని ప్రశ్నించారు.
ఈ వీడియో మే 2న లాల్ మసీదులో చిత్రీకరించబడింది. దీంతో పాకిస్తాన్ సోషల్ మీడియాలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్తాన్‌లో పౌరులు, సైనిక నాయకత్వంపైనే కాకుండా భారత్ పట్ల కూడా వ్యతిరేకత తగ్గుతున్నట్టు నిపుణులు భావిస్తున్నారు. ఒకప్పుడు తీవ్రవాదానికి ప్రతీకగా ఉన్న లాల్ మసీదు మౌల్వికి ఇప్పుడు భారత్‌పై యుద్ధానికి మద్దతు లభించకపోవడం పాకిస్తాన్‌లో లోతైన చీలికకు సంకేతం.