రక్షణ వ్యవస్థ పరంగా ఇరాన్ కంటే ఇజ్రాయెల్ చాలా బలమైన దేశం. అలాంటి దేశాన్నే ఇరాన్ క్లస్టర్ బాంబులు భయపెడుతున్నాయి. ఇంతకూ ఏమిటీ బాంబులు? ఎందుకంత ప్రమాదకరం? ఇక్కడ తెలుసుకుందాం. 

Israel-Iran War : పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇటు ఇజ్రాయెల్, అటు ఇరాన్ ఎవరూ వెనక్కితగ్గడంలేదు... యుద్దానికి సై అంటున్నాయి. పరస్పరం డ్రోన్లు, మిస్సైల్స్ తో దాడులు చేసుకుంటున్నాయి... దీంతో ఇరుదేశాల్లో పెను విధ్వంసం జరుగుతోంది. అయితే తాజాగా ఇరాన్ సరికొత్త అస్త్రాన్ని ఇజ్రాయెల్ పై ప్రయోగిస్తోంది... అదే క్లస్టర్ బాంబ్. ఇవి సాంప్రదాయ మిస్సైల్స్ కంటే పెను విధ్వంసాన్ని సృష్టిస్తాయి.

ఇలా ఇజ్రాయెల్ మిస్సైల్స్ కి పోటీగా ఇరాన్ క్లస్టర్ బాంబులను బయటకు తీసింది. టెల్‌ ఆవీవ్‌, జెరూసలెం, హైఫా నగరాలపై దాడులకు దిగింది. ఈ బాంబుల భయంతో ఇజ్రాయెల్‌ వ్యాప్తంగా సైరన్లు మోగాయి... ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇలా రక్షణపరంగా చాలా బలమైన దేశం ఇజ్రాయెల్ ఇప్పుడు ఈ క్లస్టర్ బాంబులకు భయపడుతుండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ బాంబులు ఎందుకింత ప్రమాదకరమో ఇక్కడ తెలుసుకుందాం.

ఏమిటీ క్లస్టర్ బాంబ్?

జూన్ 19న అంటే నిన్న గురువారం ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్లస్టర్ బాంబ్ వినియోగించింది. ఇరాన్ ఉపయోగించిన మిస్సైల్స్ లో ఒకటి క్లస్టర్ బాంబ్ వార్‌హెడ్ కలిగినదిగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (IDF) తెలిపింది. దీంతో ఒక్కసారిగా ఈ క్లస్టర్ బాంబ్ వార్తల్లో నిలిచింది.

సాధారణంగా మిస్సైల్ అంటే ఓ ప్రాంతాన్ని టార్గెట్ చేసి ధ్వంసం చేస్తుంది. కానీ క్లస్టర్ బాంబ్ అలాకాదు... ఇది ఒకే బాంబులా కనిపించే అనేక చిన్న బాంబుల కలయిక. ఇది మిస్సైల్స్ కంటే చాలా ప్రమాదకరమైంది. ఇది ఒకే ప్రాంతంలో భారీ పేలుడు కాకుండా గాల్లోనే తెరుచుకుని ఎక్కువ ప్రాంతాల్లో పేలుళ్లను సృష్టిస్తుంది.

ఇరాన్ ప్రయోగించిన క్లస్టర్ బాంబ్ సుమారు 7 కిలోమీటర్ల ఎత్తులో పేలిపోయి దాదాపు 20 సబ్‌మ్యూనిషన్లను 8 కిలోమీటర్ల పరిధిలో విసిరినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇలా గాల్లోనే విడిపోయే బాంబులు నేలపై పడినపుడు పేలేలా రూపుదిద్దబడ్డాయి.

ఈ క్లస్టర్ బాంబులు చాలా వివాదాస్పదమైనవి. ఈ బాంబుల్లో చాలావరకు నేలపై పడినప్పుడు పేలకుండా మిగిలిపోతాయి. వీటిని అనుకోకుండా పౌరులు తాకితే ప్రాణాపాయం ఏర్పడే ప్రమాదం ఉంది. ఇలాగే ఇరాన్ క్లస్టర్ బాంబ్ ఒకటి ఇజ్రాయెల్ లోని అజోర్ పట్టణంలో ఓ ఇంటిపై పేలకుండా పడింది. ఇలాంటి చిన్న పేలుడు పదార్థాలు నేలపై పడి ఉండే అవకాశముంది... వాటిని తాకవద్దని ఇజ్రాయెల్ తమ పౌరులకు సూచిస్తోంది.

సాంప్రదాయ మిస్సైల్, క్లస్టర్ బాంబ్ కు తేడా ఏమిటి?

సాధారణ బాలిస్టిక్ మిస్సైల్ ఒకే ప్రాంతంలో పేలితే, క్లస్టర్ మునిషన్స్ పెద్ద పరిధిలో విసరబడి విధ్వంసం సృష్టిస్తాయి. ఒక్కో సబ్‌మ్యూనిషన్ శక్తి తక్కువైనా మొత్తం పరిధి విషయంలో చాలా ప్రమాదకరంగా ఉంటాయి.

2008లో వచ్చిన కన్వెన్షన్ ఆన్ క్లస్టర్ మునిషన్స్ ప్రకారం ఈ బాంబుల వినియోగం, నిల్వ, తయారీ, రవాణాపై నిషేధం ఉంది. 111 దేశాలు, 12 సంస్థలు దీన్ని ఆమోదించాయి. అయితే ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వంటి దేశాలు ఈ ఒప్పందానికి సంతకం చేయలేదు.

2023లో అమెరికా యుద్ధభూమిలో రష్యాపై ఉపయోగించేందుకు ఉక్రెయిన్‌కు క్లస్టర్ బాంబులు ఇచ్చిందనే ప్రచారం ఉంది. రష్యా కూడా ఈ ఆయుధాలను వాడుతోందని ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో ఇజ్రాయెల్ పై ఇరాన్ క్లస్టర్ బాంబుల వినియోగం మళ్లీ అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది.