అమెరికాలోని న్యూయార్క్ ఎయిర్‌పోర్ట్‌లో ఓ భారతీయ విద్యార్థి తో అధికారులు అమానుషంగా ప్రవర్తించారు. విద్యార్థిని నేలపై పడుకోబెట్టి, చేతులకు సంకెళ్లు వేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారతీయ రాయబార కార్యాలయం ఈ ఘటనపై విచారణ జరుపుతోంది.
అమెరికాలో ఇమిగ్రేషన్ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు నిరసనలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో న్యూ జెర్సీలోని న్యూయార్క్ ఎయిర్‌పోర్ట్‌లో ఓ భారతీయ విద్యార్థి అధికారులు అమానుషంగా ప్రవర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో విద్యార్థి చేతులకు సంకెళ్లు వేసి, నేలపై పడుకోబెట్టిన దృశ్యాలు కనిపిస్తున్నాయి.
భారతీయ సంతతికి చెందిన అమెరికన్ వ్యాపారవేత్త కునాల్ జైన్ ఈ వీడియోను ఆదివారం సోషల్ మీడియాలో షేర్ చేసి, భారతీయ రాయబార కార్యాలయం జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీంతో రాయబార కార్యాలయం ఈ ఘటనపై విచారణ చేపట్టింది.
విద్యార్థిపై దురుసు ప్రవర్తన
ఈ ఘటనపై భారతీయ రాయబార కార్యాలయం స్పందించింది. స్థానిక అధికారులతో సంప్రదిస్తున్నామని, భారతీయ పౌరుల హక్కులను కాపాడటం తమ ప్రాథమిక బాధ్యత అని తెలిపింది.
సోషల్ మీడియాలో ఆగ్రహం
ఈ వీడియోపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికాలో అనేక ప్రాంతాల్లో అధికారులు ప్రజలతో దురుసుగా ప్రవర్తిస్తున్నారని నెటిజన్లు ఆరోపిస్తున్నారు.ఇలాంటి ఘటనలు గతంలోనూ చోటుచేసుకున్నాయి. ట్రంప్ కఠినమైన ఇమిగ్రేషన్ విధానాల కారణంగా చాలా మంది భారతీయులను వెనక్కి పంపించారు. అప్పుడు కూడా భారతీయులతో అధికారులు దురుసుగా ప్రవర్తించారు.


