లాస్ ఏంజెలెస్‌ వలసదారుల ఆందోళనలతో ఉద్రిక్తతంగా మారింది.ట్రంప్‌ ఆర్మీ పంపిస్తూ కఠిన ఆదేశాలు జారీచేశారు. మస్క్‌ మద్దతుతో రాజకీయ దుమారం రేగింది.

అమెరికాలోని (America) లాస్ ఏంజెలెస్ (Los Angeles) నగరం వలసదారుల ఆందోళనలతో ఉద్రిక్తంగా మారింది. డౌన్‌టౌన్ ప్రాంతంలో వందలాది మంది వలసదారులు ఐసీఈ (ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్‌మెంట్) శాఖ చర్యలకు వ్యతిరేకంగా పెద్ద సంఖ్యలో గుమికూడారు. ఈ ఆందోళనలో దాదాపు 2,000 మంది పాల్గొన్నారు. ప్రధాన రహదారి అయిన 101 ఫ్రీవేపై వారు కూర్చుని ట్రాఫిక్‌ను ఆపేశారు. కొన్ని సెల్ఫ్‌డ్రైవింగ్ కార్లకు నిప్పుపెట్టడం, పోలీసులపై వస్తువులు విసరడం వంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రబ్బరు తూటాలు ప్రయోగించారు. దీంతో ఓ పాత్రికేయుడు గాయపడ్డాడు.

నేషనల్ గార్డ్స్‌ను పంపాలంటూ…

ఈ హింసాత్మక ఘటనలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. పరిస్థితిని నియంత్రించేందుకు లాస్ ఏంజెలెస్‌ నగరంలో నేషనల్ గార్డ్స్‌ను పంపాలంటూ ఆయన ఆదేశించారు. ఇప్పటికే 300 మంది గార్డ్స్ నగరానికి చేరుకున్నారు. మొత్తం 2,000 మంది గార్డ్స్‌ను మోహరించేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. వలసదారుల ఆందోళనల్లో మాస్క్‌లు ధరించినవారిని అరెస్ట్ చేయాలని కూడా ట్రంప్ అధికారులను ఆదేశించారు.

ఈ క్రమంలో ఎలాన్ మస్క్‌ ట్రంప్‌కు అండగా నిలిచారు. ట్రంప్ చేసిన ట్వీట్లను మస్క్‌ తన ఎక్స్ అకౌంట్‌లో షేర్ చేస్తూ, నేషనల్ గార్డ్స్‌ అవసరమేనని మద్దతు తెలిపారు. మరోవైపు, లాస్ ఏంజెలెస్ మేయర్ కరెన్ బాస్ మాత్రం శాంతియుతంగా ఆందోళనలు జరగాలంటూ పిలుపునిచ్చారు. ట్రంప్ విధానాలపై విమర్శలు చేశారు.

లాస్ ఏంజెలెస్ ఒకప్పుడు అమెరికాలో అత్యంత అభివృద్ధి చెందిన నగరం కాగా, ఇప్పుడు వలసదారుల ఆందోళనలతో ఉద్రిక్తతల మధ్య చిక్కుకుంది.