అమెరికాకు చెందిన ప్రపంచ ప్రఖ్యత యూనివర్సిటీ మాసచూసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేఘా వేమూరికి గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి హాజరుకావడానికి అనుమతించలేదు. వర్సిటీ ఆ నిర్ణయం ఎందుకు తీసుకుంది.? ఇంతకీ ఆమె ఏం చేసిందంటే..
భారత సంతతికి చెందిన మేఘా వేమూరి MIT 2025 బ్యాచ్‌కు క్లాస్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తోంది. కెఫీయా (పాలస్తీనా సంఘీభావానికి చిహ్నంగా ధరించే వస్త్రం) ధరించి వేదికపైకి వెళ్లిన ఆమె, గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని తీవ్రంగా ఖండిస్తూ యూనివర్సిటీ ఇజ్రాయెల్‌తో కొనసాగిస్తున్న సంబంధాలను విమర్శించింది.
MIT వాదన ఏంటంటే.?
MIT యాజమాన్యం ప్రకారం, వేమూరి ముందుగా సమర్పించిన ప్రసంగాన్ని వేదికపై మాట్లాడలేదు. వేదికపై ఉన్నప్పటికీ ముందస్తు సమాచారం లేకుండా నిరసన చేపట్టడం, కార్యక్రమ నిర్వాహకులను తప్పుదారి పట్టించడం వల్ల ఆమెపై చర్యలు తీసుకున్నట్లు యూనివర్సిటీ తెలిపింది.
వేదికపైకి నిషేధం
వేమూరికి డిగ్రీ పోస్టు ద్వారా పంపించనున్నట్టు MIT ప్రకటించింది. అయితే శుక్రవారం జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి ఆమెను క్యాంపస్‌కు ఆమెకు అనుమతిని నిరాకరించినట్లు తెలిపారు.
మేఘా వేమూరి వాదన ఏంటంటే.?
ఈ చర్యలపై స్పందించిన మేఘా వేమూరి, “నా పట్ల చర్యలు ఎటువంటి న్యాయ ప్రక్రియ లేకుండా తీసుకున్నాయి. ‘ఫ్రీ స్పీచ్’కు మద్ధతిస్తామని చెప్పుకునే వర్సిటీ దానికి విరుద్దంగా ప్రవర్తించింది.” అని వ్యాఖ్యానించింది. "ఇటువంటి యూనివర్సిటీ వేదికపై నడవాల్సిన అవసరం నాకు లేదు" అంటూ వ్యాఖ్యానించింది.
మద్దతు ప్రకటించిన CAIR
అమెరికాలో ముస్లిం హక్కుల సంస్థ అయిన CAIR (కౌన్సిల్ ఆన్ అమెరికన్-ఇస్లామిక్ రిలేషన్స్) ఈ చర్యను ఖండించింది. “జెనోసైడ్‌ను ఖండించినందుకు విద్యార్థులపై శిక్షలు విధించడం తగదు. విద్యాసంస్థలు విద్యార్థుల స్వేచ్ఛను గౌరవించాలి” అని పేర్కొంది.
దేశవ్యాప్తంగా విద్యార్థుల నిరసనలు
హమాస్ దాడుల అనంతరం గాజాలో మొదలైన యుద్ధంపై అమెరికాలోని పలు విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. హార్వర్డ్, కొలంబియా వంటి పలు కాలేజీల్లో విద్యార్థలపై కఠినంగా వ్యవహరిస్తున్నారు.
MITలో కొత్త నిబంధనలు
2024 సెప్టెంబర్ నుంచి MIT నిరసనలకు కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది. అనుమతి లేకుండా జరిగే ప్రదర్శనలపై యాజమాన్యం ఇప్పుడు కఠినంగా వ్యవహరిస్తోంది. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి చాలా గట్టిగా చర్యలు తీసుకుంటోంది.
