ప్రపంచ భద్రతకు అణుబాంబులు పెను సవాలుగా మారాయి. హిరోషిమా, నాగసాకిలపై జరిగిన అణుదాడి అన్ని దేశాలకూ ఓ హెచ్చరిక.

DID YOU
KNOW
?
ఆగస్ట్ 15 ఎందుకు?
భారత స్వాతంత్య్ర దినోత్సవానికి జపాన్ కు సంబంధముంది. రెండో ప్రపంచ యుద్దంలో జపాన్ లొంగిపోయిన రోజును భారత స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్నాం.

మురళీకార్తిక్ ఎస్.

అణుబాంబు దాడి వల్ల జరిగిన నష్టం, ప్రాణనష్టాల నుండి దేశాలు ఇంకా పాఠం నేర్చుకోలేదు. స్వప్రతిష్ట కోసం ప్రత్యర్థి దేశాలను అణుబాంబుతో బెదిరిస్తున్నాయి. ఇది ప్రపంచ భద్రతకు పెను సవాలు. ఈ నేపథ్యంలో హిరోషిమా విషాదం అన్ని దేశాలకూ హెచ్చరిక.

ఆ ఘటనలో ఒక దేశం లక్షలాది మందిని కోల్పోయింది, మరో దేశం తన బలాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. కానీ ఆ ఘటన ప్రపంచ వినాశనానికి ముందస్తు హెచ్చరిక. 1945 ఆగస్టు 6, ఉదయం 8.15కి జపాన్‌లోని హిరోషిమా నగర ప్రజలు యుద్ధ భయంలో తమ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఈ సమయంలో అమెరికా విమానం ప్రపంచంలోనే మొదటిసారి అణుబాంబును వేసింది. క్షణాల్లో నాలుగు కిలోమీటర్ల దూరం బూడిదైపోయింది. హిరోషిమాలో 90% నాశనమై, లక్షలాది మంది చనిపోయారు. ఈ ఘోర ఘటనకు 80 ఏళ్ళు.

అణుబాంబు దాడి ఎందుకు?

1939లో ప్రారంభమైన రెండవ ప్రపంచ యుద్ధం 1945 నాటికి కీలక దశకు చేరుకుంది. ఇటలీ, జర్మనీలు లొంగిపోయాయి. కానీ జపాన్ లొంగలేదు. దీంతో అమెరికా జపాన్‌పై దాడి చేసింది. జపాన్ ప్రతిదాడి చేయడంతో అమెరికా అధ్యక్షుడు హ్యారీ ట్రూమాన్ జపాన్‌ను బెదిరించారు. కానీ జవాబు లేకపోవడంతో 1945 ఆగస్టు 6న హిరోషిమాపై ‘లిటిల్ బాయ్’ అనే అణుబాంబును వేశారు. మూడు రోజుల తర్వాత నాగసాకిపై ‘ఫ్యాట్‌మ్యాన్’ అనే బాంబును వేశారు. దీంతో జపాన్ లొంగిపోయింది.

అపార ప్రాణనష్టం, వినాశనం:

అణుబాంబు వల్ల జపాన్ తీవ్ర నష్టాన్ని చవిచూసింది. హిరోషిమాలో 90 వేల నుండి 1,66,000 మంది చనిపోయారు. నాగసాకిలో 40,000 మంది చనిపోయారు. బతికి ఉన్నవారు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ఐన్‌స్టీన్ సూత్రమే ఆధారం:

ఐన్‌స్టీన్ E=mc² సూత్రం అణుబాంబు తయారీకి ఆధారం. 1939లో ఐన్‌స్టీన్ అమెరికా అధ్యక్షుడు రూజ్‌వెల్ట్‌కు రాసిన ఉత్తరం కూడా అణుబాంబు తయారీకి పరోక్ష కారణం. దీంతో అమెరికా మాన్‌హాటన్ ప్రాజెక్టును ప్రారంభించింది. 1945 జూలై 16న మొదటి అణుబాంబును పరీక్షించారు. ఆగస్టు 6న హిరోషిమాపై వేశారు.

మానవాళికి హెచ్చరిక:

హిరోషిమా. నాగసాకి లపై అణుబాంబుల దాడి నుండి చాలా దేశాలు పాఠం నేర్చుకోలేదు. ప్రస్తుతం 9 దేశాల వద్ద అణుబాంబులు ఉన్నాయి. ఇది ప్రపంచ భద్రతకు ముప్పు. హిరోషిమా ఘటన అందరికీ హెచ్చరిక.