అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ట్రంప్‌తో పాటు ఆయన స్నేహితుడు, ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ సైతం నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఇతర దేశాల అధినేతలను విమర్శించడంతో పాటు పలు కీలక వ్యాఖ్యలు చేస్తూ టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మస్క్‌ చేసిన ఓ పని సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది..  

ఇటీవల నిర్వహించిన ఓ ప్రైవేట్‌ విందు కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో పాటు ఎలాన్‌ మస్క్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా మస్క్‌ చేసిన ఓ పని అందరి దృష్టిని ఆకర్షించింది. చిటికెన వేలుపై ఫోర్క్‌, రెండు స్పూన్‌లను బ్యాలెన్స్ చేస్తూ మస్క్‌ సరాదాగా గడిపాడు. అయితే ఆ సమయంలో ఆయన పక్కనే దేశాధినేత ట్రంప్‌ ఏదో సీరియస్‌ మీటింగ్‌లో ఉండడం గమనార్హం. 

మస్క్‌ ఈ పని చేస్తున్న సమయంలో అక్కడే విందుకు హాజరైన ఓ వ్యక్తి స్మార్ట్‌ ఫోన్‌లో దీనంతటినీ సీక్రెట్‌గా రికార్డ్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా ప్రపంచమంతా చక్కర్లు కొడుతోంది. ఈ విందు మార్చి 15వ తేదీన జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఇదేదో అషామాషీ విందు ప్రోగ్రామ్‌ కాదు. ఇందులో పాల్గొనాలంటే ఒక్కొక్కరు ఏకంగా 1 మిలియన్‌ డాలర్లు విరాళంగా అందించాల్సి ఉంటుంది. మన కరెన్సీలో చెప్పాలంటే అక్షరాల రూ. 8.5 కోట్లకుపైమాటే. ఇలాంటి రిచ్‌ పార్టీలో పాల్గొన్న మస్క్‌ అలా ప్రవర్తించడం అందరినీ విస్మయానికి గురి చేసింది. 

వైరల్ వీడియో

Scroll to load tweet…

ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లోని తన మార్-ఎ-లాగో ఎస్టేట్‌లో డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ ప్రైవేట్‌ క్యాండిల్‌లైట్‌ విందు నిర్వహించినట్లు సమాచారం. అయితే ఈ కార్యక్రమం అధ్యక్షుడి అధికారిక షెడ్యూల్‌లో లేకపోవడం గమనార్హం. ఈ కార్యక్రమానికి వచ్చిన విరాళాలు 2024 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌నకు మద్ధతు ఇచ్చిన మేక్‌ అమెరికా గ్రేట్‌ ఎగైన్‌ పీఏసీకి వెళ్లాయని సమాచారం. మొన్నటికి మొన్న నరేంద్ర మోదీతో పాటు ట్రంప్‌తో జరిగిన అధికారిక సమావేశాలకు తన పిల్లల్ని తీసుకొచ్చి అందరి దృష్టి ఆకర్షించిన మస్క్‌ ఈసారి ఇలా వెరైటీ ప్రవర్తించి మరోసారి సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అయ్యారు.