Earthquake In Pakistan: పాకిస్థాన్‌లో మే 5న కుమ్రాట్ వాలీ వద్ద 4.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. గత వారం రోజుల్లో ఇది రెండో భూకంపం కావడం గమనార్హం.

Earthquake In Pakistan: పాకిస్థాన్ మళ్లీ భూ ప్రకంపనలతో వణికిపోయింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) వెల్లడించిన వివరాల ప్రకారం.. మే 5న సోమవారం మధ్యాహ్నం 4:00 గంటల సమయంలో (IST) కుమ్రాట్ వాలీ సమీపంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 4.2గా నమోదైంది. ఈ వారంలో పాకిస్థాన్‌ను కుదిపిన రెండవ భూకంపం ఇది. అయితే, దీని ప్రభావంతో జరిగిన ప్రాణ, ఆస్తినష్టం వివరాలు తెలియాల్సి ఉంది. 

ఈ ప్రాంతం భారత-యూరేషియన్ టెక్టానిక్ ఫలకాల సంగమ ప్రాంతంలో ఉండటంతో భూకంపాలు తరచూ సంభవించడం సహజమని రిపోర్టులు పేర్కొంటున్నాయి. 2024లో మాత్రమే పాకిస్థాన్‌లో ఏకంగా 167 భూకంపాలు నమోదయ్యాయి. వీటి తీవ్రత 1.5 లేదా అంతకంటే ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా, గిల్గిట్-బల్టిస్తాన్, బలోచిస్తాన్ ప్రాంతాల్లో ఎక్కువగా భూ ప్రకంపనలు నమోదయ్యాయి.

2023 మార్చిలో బడఖ్షాన్ ప్రాంతంలో సంభవించిన 6.5 తీవ్రత గల భారీ భూకంపం ఉత్తర పాకిస్థాన్ వణికించింది. ఈ ఘటనలో ప్రాణ, ఆస్తి నష్టం భారీ జరిగింది. ఆ తర్వాత సెప్టెంబర్ 2024లో 5.7 తీవ్రత గల భూకంపం ఇస్లామాబాద్‌తో పాటు పంజాబ్, ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా రాష్ట్రాలను దెబ్బతీసింది. నవంబర్‌లో మరోసారి 5.2 తీవ్రత గల ప్రకంపనలు పేషావర్ ప్రాంతంలో సంభవించాయి.

తాజా ఘటన కేవలం కొన్ని రోజుల్లో వచ్చిన రెండో భూకంపం. ఏప్రిల్ 30న రాత్రి 9:58:26 IST సమయంలో మరో భూకంపం సంభవించింది. దీనిపై NCS ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. అంతకు ముందు ఏప్రిల్ 12న 5.3 తీవ్రత గల మరో భూకంపం చోటు చేసుకుంది. ఇది భూమికి కేవలం 10 కిలోమీటర్ల లోతులో చోటు చేసుకోవడం గమనార్హం.

పాకిస్థాన్ భౌగోళికంగా భారత్-యూరేషియన్ టెక్టానిక్ ఫలకాల మధ్య ఉన్నందున, ప్రధాన భూకంప రేఖలు ఈ దేశాన్ని ప్రభావితం చేస్తున్నాయి. బలోచిస్తాన్, FATA, ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా , గిల్గిట్-బల్టిస్తాన్ యూరేషియన్ ఫలకంపై ఉండగా, సింధు, పంజాబ్, పాకిస్థాన్ ఆక్రమిత జమ్మూ & కాశ్మీర్ ప్రాంతాలు ఇండియన్ ఫలకంపై ఉన్నాయి. దీని కారణంగా ఈ ప్రాంతాల్లో తరచూ భూ ప్రకంపనలకు గురవుతున్నాయి.

Scroll to load tweet…