భార‌త్‌, పాకిస్థాన్‌ల మ‌ధ్య కాల్పుల విర‌మ‌ణ‌కు తానే కార‌ణ‌మ‌ని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ ఇప్ప‌టికే ప‌లుసార్లు తెలిపిన విష‌యం తెలిసిందే. కాల్పుల విర‌మ‌ణ‌కు ఇరు దేశాలు అంగీక‌రించాయ‌న్న విష‌యాన్ని కూడా మొద‌ట ట్రంప్ ప్ర‌క‌టించారు. కాగా తాజాగా మ‌రోసారి ట్రంప్ భార‌త్‌, పాకిస్థాన్‌ల ఉద్రిక్త‌త‌ల‌పై స్పందించారు.   

భారత్ – పాకిస్తాన్ మధ్య తన పరిపాలన సమయంలో తానే శాంతి ఒప్పందానికి మూలంగా నిలిచానని, తానే అణు యుద్ధాన్ని నివారించానని ట్రంప్ చెప్పుకొచ్చారు. వైట్ హౌస్‌లో ట్రంప్‌ మాట్లాడుతూ.."శనివారం నా పరిపాలన ద్వారా భారత్, పాకిస్తాన్ మధ్య వెంటనే కాల్పులు నిలిపే ఒప్పందం సాధ్యమైంది. ఇది శాశ్వత కాల్పుల విర‌మ‌ణ‌గా మారుతుంద‌ని నేను నమ్ముతున్నాను. ఈ రెండు దేశాలకూ చాలా అణ్వాయుధాలు ఉన్నాయి" అని చెప్పారు.

అలాగే, తాను వాణిజ్యాన్ని ఆయుధంగా వాడినట్లు వెల్లడించారు. "రెండు దేశాలకు కూడా చెప్పాను... రండి, మేము మీతో బిజినెస్ చేయాలనుకుంటున్నాం. మొదట గొడవ ఆపండి. ఆపితే మేము మీతో వ్యాపారం చేస్తాం. కాల్పుల విర‌మ‌న ఆప‌క‌పోతే మేం వాణిజ్యాన్ని ఆపేస్తామం అని తెలిపారు. 

ట్రంప్ ఇంకా మాట్లాడుతూ.. "వాణిజ్యాన్ని నా లాగా ఎవరూ ఉపయోగించలేదు. నేను చెప్పిన తర్వాతే వారు కలహం ఆపడానికి అంగీకరించారు" అని ట్రంప్ వ్యాఖ్యానించారు.  మ‌రి ట్రంప్ చేసిన వ్యాఖ్య‌ల‌పై ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఎలా స్పందిస్తారో చూడాలి.