Virat Kohli Retirement: 2019 వన్డే ప్రపంచకప్ సమయంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల మధ్య ఉన్న అభిప్రాయ భేదాలను పరిష్కరించడంలో రవిశాస్త్రి కీలక పాత్ర పోషించారని అప్పట్లో రిపోర్టులు పేర్కొన్నాయి. తాజాగా విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ పై రవిశాస్త్రి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

Virat Kohli Retirement: భారత క్రికెట్ లెజెండ్ విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఇప్పటికే టీ20 క్రికెట్ నుంచి తప్పుకున్న కింగ్ కోహ్లీ రాబోయే రోజుల్లో వన్డే క్రికెట్ లో కొనసాగనున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో కోహ్లీ పెట్టిన భావోద్వేగపూరిత పోస్ట్ తో రిటైర్మెంట్ విష‌యాన్ని వెల్ల‌డించాడు.

టెస్ట్ క్రికెట్ నుంచి విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ నిర్ణయం నమ్మలేకపోతున్నానని మాజీ భారత క్రికెటర్ రవిశాస్త్రి అన్నారు. "నువ్వు క్రికెట్ మానేశావని నమ్మలేకపోతున్నా. ఆధునిక క్రికెట్‌లో ఒక దిగ్గజం, టెస్ట్ క్రికెట్‌కు గొప్ప రాయబారివి నువ్వు. అందరికీ, ముఖ్యంగా నాకు నువ్వు ఇచ్చిన మధుర జ్ఞాపకాలకు ధన్యవాదాలు. జీవితాంతం వాటిని గుర్తుంచుకుంటాను" అని శాస్త్రి ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు.

కోహ్లీ, శాస్త్రిల మధ్య మంచి అనుబంధం ఉంది. కోహ్లీ కెప్టెన్‌గా ఉన్నప్పుడే శాస్త్రిని భారత జట్టు కోచ్‌గా నియమించారు. అప్పటి కోచ్ అనిల్ కుంబ్లే హెడ్ మాస్టర్ తరహా శైలి నచ్చకపోవడంతో కోహ్లీ కోరిక మేరకే శాస్త్రిని కోచ్‌గా నియమించారు.

 

View post on Instagram
 

2019 వన్డే ప్రపంచకప్ సమయంలో కోహ్లీ, రోహిత్‌ల మధ్య ఉన్న అభిప్రాయ భేదాలను పరిష్కరించడంలో శాస్త్రి ముందుండి నడిపించారని వార్తలు వచ్చాయి. కోహ్లీకి మార్గదర్శి శాస్త్రి అని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి.

శాస్త్రి కోచ్ పదవి వదిలిన సమయంలోనే కోహ్లీ టెస్ట్ కెప్టెన్సీ వదిలేశాడు. 2021 నవంబర్‌లో రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించారు. 2021 దక్షిణాఫ్రికా పర్యటన తర్వాత కోహ్లీ టెస్ట్ కెప్టెన్సీ వదిలేశాడు. ఆ తర్వాత రోహిత్ శర్మను వన్డే, టెస్ట్, టీ20 జట్లకు కెప్టెన్‌గా బీసీసీఐ నియమించింది. చాలా రోజులుగా వస్తున్న వార్తలకు తెరదించుతూ కోహ్లీ శనివారం మధ్యాహ్నం టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా ప్రకటించాడు.

విరాట్ తన పోస్టులో.. "నేను టెస్ట్ క్రికెట్ ఆడటం మొదలుపెట్టి 14 ఏళ్లు పూర్తయింది. నిజం చెప్పాలంటే, ఈ ఫార్మాట్ నన్ను ఇంత దూరం తీసుకొస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇది నన్ను పరీక్షించింది, నన్ను తీర్చిదిద్దింది, జీవితాంతం గుర్తుంచుకునే పాఠాలు నేర్పింది.తెల్లటి దుస్తులు వేసుకొని ఆడటంలో ఏదో ప్రత్యేకత ఉంది. నిశ్శబ్దంగా శ్రమించడం, సుదీర్ఘమైన రోజులు, ఎవరూ చూడని చిన్న చిన్న విషయాలు ఎప్పటికీ మీతోనే ఉంటాయి.నేను ఈ ఫార్మాట్ నుండి తప్పుకుంటున్నప్పుడు, ఇది అంత సులభం కాదు.. కానీ సరైనదిగా అనిపిస్తుంది. నేను నా శక్తి మేరకు ఆడాను, దానికి ప్రతిగా నేను ఊహించిన దానికంటే చాలా ఎక్కువ ఇచ్చింది. ఆటకు, నేను మైదానంలో పంచుకున్న వ్యక్తులకు, నన్ను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు .నా టెస్ట్ కెరీర్‌ని నేను ఎల్లప్పుడూ చిరునవ్వుతో గుర్తుంచుకుంటాను" అని విరాట్ వెల్లడించాడు. 

 

View post on Instagram