ఆకలితో అలమటించిపోయి.. ఆహారం కోసం బిల్డింగ్ మీదినుంచి దూకిన 8యేళ్ల చిన్నారి...
ఆకలితో అలమటించిపోయి, ఆహారం కోసం సాహసం చేసిందో చిన్నారి. తనను బంధించిన మొదటి అంతస్తు నుంచి దూకేసింది.

వాషింగ్టన్ : వాషింగ్టన్ లో ఓ హృదయ విదారకమైన ఘటన వెలుగు చూసింది. ఆకలితో అలమటించి పోయిన ఓ 8 ఏళ్ల చిన్నారి.. మొదటి అంతస్తు నుంచి కిందికి దూకింది. ఆ తర్వాత ఆహారం కోసం సమీపంలోని దుకాణదారులను అడుక్కుంది. అయితే ఈ చిన్నారికి తల్లిదండ్రులే కొంతకాలంగా ఆహారం ఇవ్వకుండా నిర్బంధించారని తెలుస్తోంది. హృదయాన్ని మెలిపెట్టే ఈ ఘటన అమెరికాలోని వెస్ట్ వర్జినియాలో చోటుచేసుకుంది..
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు ఇలా తెలుపుతున్నారు. అర్నాల్డ్స్ బర్గోలో నివాసం ఉంటున్న ర్యాన్ కీత్ హార్డ్ మన్, ఎలియో ఎమ్ దంపతులు. వీరికి నలుగురు పిల్లలు సంతానం. ఇందులో ఒకరైన ఎనిమిదేళ్ల చిన్నారికి వారు గత కొంతకాలంగా ఆహారం ఇవ్వడం లేదు. అంతేకాదు.. ఆ చిన్నారి బయటికి రాకుండా గదిలో బంధించారు.
మూడేళ్ల కూతురిపై మెడికల్ చైల్డ్ అబ్యూజ్.. తల్లి అరెస్ట్...
ఓవైపు క్షుద్భాధ.. మరోవైపు బందీగా ఉండడం తట్టుకోలేని ఆ చిన్నారి.. ఎలాగైనా ఆహారం సంపాదించాలనుకుంది. ఆకలికి తట్టుకోలేక టెడ్డీబేర్ సహాయంతో ఆ 8 ఏళ్ల చిన్నారి మొదటి అంతస్తు నుంచి కిందికి దూకేసింది. ఆ తరువాత.. ఆ చుట్టుపక్కల ఉన్న దుకాణాల వద్దకు వెళ్ళింది. తనకు తినడానికి ఆహారం ఇవ్వాలంటూ ప్రాధేయపడింది.
ఆ షాపుల్లో ఒక దుకాణ యజమాని ఆ పాప పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. ముందుగా తినడానికి పాపకి కొంత ఆహారాన్ని ఇచ్చాడు. ఆ తరువాత అనుమానం వచ్చి.. ఆమెను వివరాలు అడిగాడు. అప్పుడు ఆ చిన్నారి తన తల్లిదండ్రుల వివరాలను.. కొద్ది రోజులుగా తనకు ఆహారం పెట్టకుండా బంధించి ఉంచిన విషయాన్ని తెలిపింది. వెంటనే ఆ వ్యక్తి అధికారులకు సమాచారం అందించాడు.
ఆ వ్యక్తితో బాలిక ఇలా చెప్పింది.. ‘చాలా రోజులుగా నేను ఆకలితో ఉన్నాను. అమ్మానాన్న నాకు ఆహారం ఇవ్వడం లేదు, నన్ను సరిగా చూసుకోవడం లేదు. ఇంట్లోనుంచి బయటికి రాకుండా బంధించారు. నన్ను శిక్షించేవారు. ఆకలికి తట్టుకోలేక నేను పైనుంచి దూకేశాను. నేను ఒక బర్గర్ తిని మూడు రోజులు అవుతుంది. అప్పటినుంచి ఏమి తినలేదు’ అని ఆ బాలిక తన హృదయ విధారక కథనాన్ని తెలిపింది.
ఈ విషయాన్ని అధికారులకు తెలపడంతో…వారు ఆ బాలిక ఇంటిని సోదా చేశారు. తల్లిదండ్రులు ఇంట్లో ఆహారం ఉన్నా కూడా చిన్నారికి పెట్టడం లేదని తెలిసింది. తల్లిదండ్రుల నుంచి మాదకద్రవ్యాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారిద్దరిని తమ కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు.