Kashmir terror Attack: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో ఇండియాకి వీసాపై వచ్చిన పాకిస్తానీయులు తిరిగి వారి దేశానికి వెళ్లిపోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆదేశించారు. ఈ మేరకు అన్ని రాష్ట్రాల సీఎంలతో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. దీంతో ఈ రోజు ఉదయం నుంచి పాకిస్తానీయులు స్వదేశానికి పయనమయ్యారు. ఇక పాక్‌లో ఉన్న భారతీయులు సైతం ఇండియాకి వచ్చేస్తున్నారు.  

పాకిస్థాన్‌కు చెందిన సుమారు 180 మంది ఇండియాలో ఉన్నట్లు అధికారులు గుర్తించి వారిని వెనక్కి పంపించేశారు. ఇక భారత సరిహద్దు నుంచి వస్తున్న పాకిస్తానీయులను ఇప్పటికే నిలుపుదల చేసి వెనక్కి పంపిచేస్తున్నారు. మరోవైపు భారతీయులను సైతం పాక్‌కు వెళ్లేందుకు అనుమతించట్లేదు. ఇక పాక్‌ నుంచి 120 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. 

వీసాలపై ఆంక్షలు.. 
భారత్‌, పాక్ దేశాల మధ్య వీసాలపై రెండు దేశాలు ఆంక్షలను విధించాయి. ఇప్పటికే వీసాపై వచ్చి ఇండియాలో ఉన్న పాకిస్తానీయులు 48 గంటల్లో భారత్‌ను వదిలి వెళ్లిపోవాలని హోంమంత్రి అమిత్‌ షా ఆదేశించారు. అన్ని రాష్ట్రాల్లో ఉన్న పాక్‌ జాతీయులను గుర్తించి వెనక్కి పంపించే ఏర్పాట్లు చేయాలని కోరారు. ముందుగా స్థానికంగా ఉంటున్న పాకిస్థానీయులను గుర్తించి ఆ డేటా కేంద్రానికి పంపాలని, అప్పుడే వారి వీసాల రద్దుకు అవకాశం ఉంటుందన్నారు. ఇక గతంలో సార్క్‌ వీసా పొడిగింపు పథకం కింద చాలా మంది పాకిస్తానీయులు భారత్‌లో పర్యటించే అవకాశం కల్పించారు. దీని కింద భారత్‌కు వచ్చి ఉంటే 48 గంటల్లో దేశాన్ని వీడాలని స్పష్టం చేశారు. 

ఇక మెడికల్‌ వీసాతో భారత్‌కు వచ్చిన వారికి ఏప్రిల్‌ 29వ తేదీ వరకు గడువు ఇచ్చారు. పాక్‌ నుంచి పూర్తిగా రాకపోకలను పూర్తిగా నిషేధించారు. దీంతోపాటు పాక్‌లో ఉన్న భారత జాతీయులు తిరిగి వచ్చేయాలని భారత అధికారులు పేర్కొన్నారు. ఎట్టిపరిస్థితిల్లో పార్‌ దేశస్టులు ఇచ్చిన గడువులోపు వెళ్లిపోవాలని లేదంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని భారత్‌ హెచ్చరికలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాల డీజీపీలు సైతం ఇవే ఆదేశాలు జారీ చేశారు. 

పహల్గాం ప్రాంతంలో తీవ్రవాదులు పర్యాటకులపై విచక్షణారహితగా కాల్పులు జరిపి.. సుమారు 26 మందిని హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో అనేక మంది గాయపడ్డారు. ఈ చర్యను భారత్‌ సీరియస్‌గా తీసుకుంది. తీవ్రవాదులకు పాక్‌ ఇంటెలిజెన్స్‌ సహకారం ఉందని సమాచారంతో ఆ దేశంలో సంబంధాలు పూర్తిగా తెంచేసుకుంది. ఇప్పటికే సింధూజలాల ఒప్పందం రద్దు చేసుకోవగా.. పాకిస్తానీయులు దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. కశ్మీర్‌ తీవ్రవాదుల దాడుల నేపథ్యంలో పర్యాటకులు పూర్తిగా ఆయా ప్రాంతాలను ఖాళీ చేస్తున్నారు. ఇప్పటికే సుమారు 3 వేల మంది అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనేక మంది పర్యటను రద్దు చేసుకున్నారు. త్వరలో అమర్నాథ్‌యాత్ర జరగనున్న నేపథ్యంలో అప్పటి వరకు పరిస్థితులు ఏవిధంగా ఉంటాయో అన్న ఆందోళనలు మొదలయ్యాయి. ఇక కశ్మీర్‌లో ముష్కరులకు భద్రతాబలగాలకు మధ్య కాల్పులు జరుగుతున్నాయి.