హైదరాబాద్: ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో విజయకేతనం ఎగరేసి కొత్తగా ఎన్నికైన గులాబీ సైనికులకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్ ఎలక్షన్స్ ఫలితాలు టీఆర్ఎస్ పార్టీపై రాష్ట్ర ప్రజలకున్న నమ్మకాన్ని మరోసారి తెలియజేశాయని... ప్రభుత్వం పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పార్టీ కార్యకర్తల కృషి కూడా మరువలేనిదని కేటీఆర్ వెల్లడించారు. 

గురువారం తెలంగాణ భవన్ కు విచ్చేసిన ఆయన మీడియాతో మాట్లాడారు.  2014 జూన్ తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు ఏ ఎన్నిక వచ్చినా టీఆరెస్ కి భారీ విజయాన్ని తెలంగాణ ప్రజలు ఇస్తున్నారని అన్నారు. గతంలో నాలుగున్నర ఏండ్ల టీఆర్ఎస్ పాలనలో అందించిన సంక్షేమ పథకాలు తెలంగాణ సమాజంకి చేరాయని... అందువల్లే రెండోసారి చంద్రబాబు, రాహుల్ గాంధీ తెలంగాణ అంతా తిరిగినా తెలంగాణ ప్రజలు  మాత్రం కేసీఆర్ కి 75 శాతం సీట్లు కట్టబెట్టారని అన్నారు.

ఇక పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని పార్టీలతో పోల్చితే టీఆరెస్  పార్టీకే ఎక్కువ సీట్లు వచ్చాయన్నారు. ఆ తర్వాత జిల్లా పరిషత్, మండల పరిషత్,  తాజాగా  మున్సిపల్ ఎన్నికల్లో గతంలో ఎప్పుడూ లేని విజయాన్ని టీఆరఎస్ కి ప్రజలు అందించారని అన్నారు. మున్సిపల్ ఎన్నికలను అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు కోర్టుకు వెళ్లారని... అయినప్పటికి ఎలాంటి అడ్డంకులు లేకుండా ఎన్నికలు సజావుగా జరిగాయని అన్నారు. 

read more  గెలిచి ఓడిన రెబెల్స్.. పార్టీలో దక్కని ప్రాధాన్యత

మూడు వేలకు పైగా వార్డులకు ఎన్నికలు జరుగితే 8వేల మంది అభ్యర్థులు టీఆరెస్ తరపున నామినేషన్ వేశారన్నారు. కానీ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి కొన్ని చోట్ల బి-ఫామ్ ఇద్దామంటే అభ్యర్థులు దొరకలేరని ఎద్దేవా చేశారు.  బీజేపీ-కాంగ్రెస్ కలిపి 12వందల స్థానాల్లో అభ్యర్థులు నిలిపే పరిస్ధితుల్లో లేవన్నారు. 

అన్ని మున్సిపాలిటీల్లో కలిపి మూడు వేల ఒకవంద స్థానాల్లో దాదాపు 95 శాతం స్థానాల్లో టీఆర్ఎస్ గెలిచిందన్నారు. అయితే ప్రతిపక్షాలు ఓటమిని అంగీకరించుండా ఓట్లు వేసిన తెలంగాణ ప్రజలను అవమానిస్తున్నాయని మండిపడ్డారు. ఆ పార్టీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక రాజకీయాల నుంచి విరమించుకోవాలని సూచించారు. 

ఉత్తమ్ కుమార్ రెడ్డికి వ్యవస్థలపై నమ్మకం లేదు కాబట్టే ఫలితాలు టీఆర్ఎస్ కి అనుకూలంగా వచ్చాయన్నారు. ప్రజలు భారీ విజయాన్ని టీఆరెస్ నేతలకు అందిచినంత మాత్రాన గర్వం రావొద్దని సూచించారు. ప్రతి నెలా మున్సిపాలిటీలకు నిధులు మంజూరు చేపించే భాద్యత తనదేనని కేటీఆర్ హామీ ఇచ్చారు.

కొత్త మున్సిపల్ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని  మంత్రి సూచించారు.  అన్ని మున్సిపాలిటీల్లో 8లక్షల వీధి దీపాలను ఏర్పాటు చేసామన్నారు. ప్రతి మున్సిపాలిటీలో నర్సరీలు ఏర్పాటు చేశామని...అందుకోసం గ్రీన్ బడ్జెట్ పేరుతో 10శాతం కేటాయిస్తామన్నారు.  పట్టణాల్లో ప్రణాళికబద్ధమైన అభివృద్ధి జరగాల్సిన అవసరం వుందన్నారు కేటీఆర్. 

భవన నిర్మాణంలో అవినీతి పూర్తిగా రూపుమాపాలని సూచించారు.  కౌన్సిలర్లు, చైర్ పర్సన్ పై గతంలో ఉన్నట్లుగా ఆరోపణలు ఇక నుంచి ఉండొద్దన్నారు. మున్సిపాలిటీల్లో ఎవరైనా తప్పు చేస్తే ఎమ్మెల్యే, మంత్రి చెప్పినా వినకుండా చర్యలు ఉంటాయన్నారు. తప్పు చేస్తే టీఆరెస్ నేత అయినా క్షమించేది లేదని కేటీఆర్ హెచ్చరించారు.

మున్సిపాలిటీ నేతలెవరు తప్పు చేయకండి..బదునామ్ కాకండి అని సూచించారు.  కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లు మున్సిపల్ కొత్త చట్టాన్ని పూర్తిగా చదవి అర్థం చేసుకోవాలన్నారు. ఎన్నికల ముందు ఇతర పార్టీల మాదిరిగా  టీఆర్ఎస్ నాయకులు డైలాగులు కొట్టడం, ఓట్ల కోసం ఉత్తుత్తి మాటలు చెప్పలేదన్నారు.

readmore  సూర్యాపేట మున్సిపల్ వైఎస్ చైర్మెన్ పదవి: టీఆర్ఎస్ కార్యకర్త ఆత్మహత్యాయత్నం

మున్సిపల్ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ సామాజిక న్యాయం పాటించారని... 57 శాతం మహిళకు అవకాశం కల్పించారని వెల్లడించారు. గతంలో ఎప్పుడూ లేని విదంగా ఎంబీసీలకు కూడా ప్రాతినిధ్యం కల్పించి టీఆర్ఎస్ పార్టీ అవకాశం ఇచ్చిందన్నారు. 240 పోస్టుల్లో 108 పోస్టులను బలహీన వర్గాలకు టీఆరెస్ పార్టీ కల్పించిందన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విదంగా వైష్యులు 11 మంది చైర్మన్లుగా ఎన్నికయినట్లు తెలిపారు. 

సూర్యాపేటలో దళిత మహిళకు చైర్మన్ స్తానం కల్పించి దేశానికి మంచి సందేశం పంపించామన్నారు. ఇకపై ఒక్కొక్కరు ఒక్కో కేసీఆర్ లాగా పనిచేసి పార్టీని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దాలని కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.